
రూ.400 కోట్ల భూమిని సీఎం కానుకగా ఇచ్చారా?
తిరుపతి కల్చరల్: తమిళనాడులో టీడీపీ నేతలు ఆక్రమ మార్గాల్లో స్వాధీనం చేసుకున్న సదావర్తి సత్రం భూములను తక్షణం ప్రభుత్వానికి అప్పగించాలని, లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు పంచుతామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. తిరుపతిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరలింగేశ్వర సదావర్తి సత్రం భూములు తమిళనాడు రాష్ట్రంలో 471 ఎకరాలు ఉన్నాయని, ఇవి దాదాపుగా అన్యాక్రాంతమయ్యాయన్నారు. తమిళనాడు ప్రభుత్వం 100 ఎకరాలు స్వాధీనం చేసుకుని సాప్ట్‌వేర్ కంపెనీకి కట్టబెట్టిందన్నారు.
కొందరు ఆక్రమించుకుని పట్టాలు పొందారన్నారు. మిగిలిన 87 ఎకరాలు కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజ కుమారుడు వేలంలో రూ.23 కోట్లకు కొనుకున్నామని చెబుతున్నారు. నిజానికి వేలం ప్రకటన ఇవ్వకుండా పబ్లిక్ యాక్షన్ లేకుండా ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. ఇదంతా ఓ పథకం ప్రకారం వేలం నాటకమాడి వందల కోట్లు విలువ చేసే భూమిని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. రూ.400 కోట్ల విలువైన భూమిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు కార్పొరేషన్ చైర్మన్‌కు కానుకగా ఇచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి తారా స్థాయికి చేరిందని దానిని అదుపు చేయడంలో సీఎం ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యంగా ఉంటూ జల వివాదాలను పరిష్కరించలేకపోతోందని విమర్శించారు. ఏ సమస్యతో రాష్ట్రం విడిపోయిందో అదే సమస్యలు ఇంకా వెంటాడుతున్నా ముఖ్యమంత్రులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. హైకోర్టు బెంచ్‌ను విభజించడంతో పలు సమస్యలు తలెతుతున్నాయన్నారు. ఈ సమస్యను పట్టించుకోవాల్సిన గవర్నర్ కొండకు వచ్చి ఆ దేవుడే పరిష్కరించాలి చేతులెత్తేయడం భావ్యంకాదన్నారు. గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని చూసి టీడీపీ ఎందుకు భయపడుతోందని, రాజకీయ ప్రచారాన్ని ఆహ్వానించాలన్నారు. వారు చూపించే లోటుపాట్లను ప్రభుత్వం సరిదిద్దుకోవాలని ఓ ప్రశ్నకు సమాదానంగా చెప్పారు.