
సాక్షి, అమరావతి: మరో సంచలనానికి రాష్ట్ర ప్రభుత్వం తెరతీసింది. దేవదాయ శాఖ పరిధిలోని 1,448 ఆలయాలకు ఒకే విడతలో పాలక మండళ్ల నియామకానికి సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ ప్రక్రియలో ఒక్కో ట్రస్టు బోర్డులో ఉండే మొత్తం సభ్యులలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించడంతో పాటు మొత్తంగా అన్ని కేటగిరీలలో సగం పదవుల్లో మహిళలనే నియమించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో వీటిలోని మొత్తం 10,256 నామినేటెడ్ పదవులకుగాను సగం అంటే.. 5128 పదవులు హిందువుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కుతాయి. అలాగే.. జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీల కేటగిరీలలోని మొత్తం 10,256 మంది నియామకాల్లో సగం అంటే 5,128 పదవులు మహిళలకే లభించనున్నాయి.
ఒక్కో గుడికి 7–9 మంది చొప్పున..
రూ.25 లక్షలలోపు ఆదాయం ఉండే 1,388 ఆలయాలతో పాటు రూ.25 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఆదాయం ఉండే మరో 60 ఆలయాలకు కలిపి మొత్తం 1,448 ఆలయాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. రూ.కోటిలోపు ఆదాయం ఉన్న మొత్తం 172 ఆలయాలకుగాను ప్రస్తుతం 60కి మాత్రమే పాలక మండళ్లను నియమిస్తున్నారు. దేవదాయ శాఖ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం రూ.25 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలకు ఏడుగురు సభ్యుల చొప్పున పాలక మండలిని నియమించాల్సి ఉంది. అలాగే, రూ.కోటిలోపు ఆదాయం ఉండే ఆలయాలకు తొమ్మిది మంది చొప్పున సభ్యులను నియమించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో.. నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం అనుమతి తెలిపిన ఆలయాల వివరాలను సంబంధిత ఆలయ కార్యనిర్వహణాధికారులు ఎక్కడికక్కడ ఆయా ఆలయాలు, పంచాయతీ, మండల కార్యాలయాల్లోని నోటీసు బోర్డులో ఉంచుతారు. ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. గడువు ముగిసిన తర్వాత పాలక మండళ్ల నియామక ప్రక్రియ కొనసాగుతుంది. కాగా, రూ.25 లక్షలలోపు ఆదాయం ఉండే ఆలయాలకు దేవదాయ శాఖ కమిషనర్, రూ.కోటిలోపు ఆదాయం ఉండే ఆలయాలకు థార్మిక పరిషత్ అనుమతితో పాలక మండలి సభ్యుల నియామకం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment