
సాక్షి, హైదరాబాద్: దేవాదాయశాఖలో అడ్డదారిలో చేరిన సిబ్బంది వల్ల ప్రభుత్వ ఖజానాకు ఇప్పటికే పడుతున్న చిల్లుకు మరింత గండి పడనుంది. దేవాలయ ఉద్యోగులు, అర్చకులకు సర్కారు వేతన సవరణ ప్రారంభించిన నేపథ్యంలో అక్రమ ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం చూసి ఉన్నతాధికారులే కంగు తినాల్సి వచ్చింది. వేతన సవరణ కోసం ఒక్కో ఉద్యోగి వివరాలు సేకరించిన సమయంలో... నియామకాలపై నిషేధం ఉన్నప్పుడు చేరిన వారి సంఖ్య దాదాపు 1,500 వరకు ఉందని తేలింది. ఇప్పుడు వేతన సవరణకు అర్హులుగా గుర్తించిన 5,260 మందిలో అక్రమ సిబ్బంది కూడా ఉండటం, వారి సగటు వేతనం రూ. 30 వేలుగా ఉండటంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా సుమారు రూ. 50 కోట్ల మేర భారం పడుతుందని స్పష్టమవుతోంది.
నాటి కమిషనర్ కక్కుర్తి వల్లే...
2006కు ముందు పని చేసిన ఓ కమిషనర్ కక్కుర్తి ఇప్పుడు పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. కొందరు అధికారులతో కలసి ఆలయ భూములను అన్యాక్రాంతం చేయడం ద్వారా రూ. కోట్లు దండుకున్న ఆ అధికారి అది చాలదన్నట్టు దేవాలయాల్లో వందలాది మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించాడు. ఇందుకోసం ఒక్కొక్కరి వద్ద నుంచి భారీగా వసూలు చేశాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో స్పందించిన ప్రభుత్వం...ఆ అధికారిపై వేటు వేసి అక్రమ సిబ్బందిని తొలిగించింది. అలాగే అక్రమంగా సిబ్బందిని నియమించకుండా నిషేధం విధించింది. ఎక్కడైనా అవసరమైతే ప్రత్యేక అనుమతి తీసుకుని నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. అయితే దేవాలయ పాలకమండళ్లు, కొందరు అధికారులు చాలా చోట్ల అనుమతుల అవసరం లేకుండానే వందల మందిని అక్రమంగా నియమించి సొమ్ము చేసుకున్నారు. వేతన సవరణ నేపథ్యంలో ఈ భారీ అక్రమం వెలుగుచూసింది. దీంతో అక్రమ సిబ్బందిని తొలగించాలని కొందరు అధికారులు పేర్కొంటుండగా కొందరు నేతలు మాత్రం వారికి అడ్డుపడుతున్నారు. అక్రమ సిబ్బందిని కొనసాగించేందుకు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది.
సగం అక్రమ సిబ్బందికే...
దేవాదాయశాఖలోని ప్రభుత్వ ఉద్యోగులు మినహా మిగతా వారిని దేవాలయ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వారు ఏ ఆలయంలో పనిచేస్తే ఆ ఆలయం నుంచే వేతనాలు పొందాల్సి ఉంటుంది. ఆయా ఆలయాల ఆదాయంలో 30 శాతం మొత్తాన్ని ఉద్యోగుల వేతనాలకు కేటాయిస్తారు. తాజా వేతన సవరణతో ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. ఉద్యోగులు పొందుతున్న వేతనాలను ఇకపై కూడా ఆయా ఆలయాలే చెల్లించనుండగా వేతన సవరణతో పెరిగే మొత్తాన్ని ప్రభుత్వ గ్రాంటు నుంచి చెల్లిస్తా రు. 5,260 మంది ఉద్యోగులు, అర్చకులకు సంబంధించి ప్రభుత్వం సాలీనా ఇవ్వనున్న రూ. 115 కోట్ల గ్రాంటులో సగం ఈ అక్రమ ఉద్యోగుల జేబుల్లోకి వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment