సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో దేవాదాయ భూముల స్వాహా, రికార్డుల గల్లంతు విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. భూముల స్వాహా వెనక జరిగిన తతంగాన్ని ఆరా తీసింది. దాదాపు 20 ఏళ్ల క్రితం కొందరు రాజకీయ నేతలు దేవాలయ భూములు స్వాహా చేసిన విషయంపై లోకాయుక్త ఆదేశంతో దేవాదాయ శాఖ పాత ఫైళ్లను వెతికి పట్టుకుని వాటిని తర్జుమా చేయిస్తున్న తీరుపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించింది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం నివేదిక కోరినట్టు తెలిసింది.
మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రెండు రోజుల్లో ఆ శాఖ కమిషనర్‌తో భేటీ అయి ఈ మొత్తం వ్యవహారంపై చర్చించనున్నారు. జిల్లా పర్యటనలో ఉన్న తాను హైదరాబాద్‌కు రాగానే కమిషనర్‌తో చర్చిస్తానని, నిజాం కాలం నాటి రికార్డుల్లో అందుబాటులో ఉన్న పత్రాల తర్జుమా వ్యవహారాన్ని పర్యవేక్షిస్తానని ఇంద్రకరణ్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి దారుణాలు చోటుచేసుకున్నాయని, వీటిని సరిదిద్దుతామని వెల్లడించారు.
అందుబాటులో ఉన్న దేవాలయ భూములను వెంటనే గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామన్నారు. వాటిని గుర్తించి దేవాలయాల వారీగా పాస్ పుస్తకాలను జారీ చేస్తామని, దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారని వెల్లడించారు. కబ్జా అయిన భూములను గుర్తించి వాటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment