
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానాలకు (టీటీడీ) చెందిన రూ. 1000 కోట్లను ప్రైవేటు బ్యాంకు ఇండస్ ఇండ్‌లో డిపాజిట్ చేయడంపై హైకోర్టు మంగళవారం టీటీడీ ఈవో వివరణ కోరింది. జాతీయ బ్యాంకులు ఉండగా, ప్రైవేటు బ్యాంకులో ఎందుకు ఆ వెయ్యి కోట్ల రూపాయలను జమ చేశారో చెప్పాలంటూ టీటీడీ ఈవో, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, తిరుపతి ఇండస్ ఇండ్ బ్యాంక్ మేనేజర్‌లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీకి చెందిన రూ. వెయ్యి కోట్లను ప్రైవేటు బ్యాంకు ఇండస్ ఇండ్‌లో జమ చేయడాన్ని సవాలు చేస్తూ తిరుపతికి చెందిన పి.నవీన్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జక్కుల శ్రీధర్ వాదనలు వినిపిస్తూ, పెద్ద మొత్తంలో నిధులను ప్రైవేటు బ్యాంకులో జమ చేయడం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, జాతీయ బ్యాంకులు ఉండగా, ఎందుకు ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్ చేశారో చెప్పాలని టీటీడీ, దేవాదాయశాఖ అధికారులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment