సాక్షి, ఖమ్మం : దేవుడి పేరిట భూములు ఆక్రమించరాదని, దేవుడు కూడా చట్టానికి అతీతం కాదని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఖమ్మంలో టీటీడీ కళ్యాణ మండపం భూవివాదానికి సంబంధించి వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి అల్లిక అంజయ్య దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. టీటీడీకి చెందిన 12 గుంటల భూమిని వెనక్కి తీసుకుంటున్నారని విచారణ సందర్భంగా పిటిషనర్ పేర్కొనగా, టీటీడీ ఆధీనంలో 12 గుంటలు అదనంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. అయితే టీటీడీ పక్క భూమిని కూడా ఆక్రమించే ప్రయత్నం చేస్తోందని ఖమ్మం కార్పొరేషన్ హైకోర్టుకు వెల్లడించింది. ( ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన టీటీడీ చైర్మన్)
దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనుమానాస్పదంగా ఉందని, భూమి వెనక్కి తీసుకుంటే టీటీడీ ఎందుకు స్పందించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వెనుక టీటీడీ ఉండొచ్చునని అభిప్రాయపడింది. ప్రభుత్వ భూమిని టీటీడీ ఆక్రమించినట్లు కనిపిస్తోందని, భూమికి సంబంధించిన దస్త్రాలు, పటాలన్నీ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను సెప్టెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment