అమరావతిలోని సదావర్తి సత్రానికి తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఉన్న విలువైన భూమిని అతి తక్కువ ధరకు టీడీపీ నేతలు దక్కించుకోవడంపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: అమరావతిలోని సదావర్తి సత్రానికి తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఉన్న విలువైన భూమిని అతి తక్కువ ధరకు టీడీపీ నేతలు దక్కించుకోవడంపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సంతృప్తి చెందినట్లు దేవాదాయ శాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని టీడీపీ నాయకులు వేలంలో రూ.22 కోట్లకే దక్కించుకున్న సంగతి తెలిసిందే. దేవాదాయ శాఖ అధికారులు సత్రం భూముల అమ్మకానికి సంబంధించిన ఫైళ్లతో సహా సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా భూములు అమ్మిన తీరును చంద్రబాబు పూర్తిగా సమర్థించారనే ప్రచారం జరుగుతోంది. అయితే, భూమి అమ్మకం వివరాలు బయటకు పొక్కడంపై అధికారులపై ఆయన తీవ్ర అగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గోప్యంగా ఉంచాల్సిన వివరాలు ఎలా బయటపడ్డాయని ఆయన దేవాదాయ శాఖ కమిషనర్‌పై మండిపడినట్లు సమాచారం. సదావర్తి సత్రం భూముల అమ్మకానికి సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్‌కు జాయింట్ కమిషనర్ రాసిన లేఖ బయటకు ఎలా పొక్కిందని ఆయన అధికారులను నిలదీసినట్లు తెలుస్తోంది.