
ఆలంపూర్ జోగులాంబ దేవాలయంలో భక్తులకు సమస్యలు చెప్పుకుంటున్న అర్చకులు
సాక్షి, హైదరాబాద్: ‘ఆశీర్వదించే చేతులతో అర్థిస్తున్నాం. మా ఆందోళనకు సహకరించండి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మాకు వేతనాల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. మేం దేవాలయాలు మూసివేయడం లేదు. కేవలం ఆర్జిత సేవలను మాత్రమే నిలిపివేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి’అంటూ భక్తులకు రాష్ట్రంలోని దేవాలయాల అర్చకులు, ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలను నిలిపివేశారు. దీంతో ఆలయాలకు వచ్చిన భక్తులకు తమ సమస్యను వివరించి వారికి సర్దిజెప్పేందుకు ప్రయత్నించారు.
రాష్ట్రం మొత్తం మీద 646 దేవాలయాలు దేవాలయ శాఖ పరిధిలో ఉండగా, 610 దేవాలయాల వరకు ఆర్జిత సేవలు నిలిపివేశామని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ జె.జైపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కావడంతో కొన్ని జిల్లాల్లోని దేవాలయాల్లో ఆర్జిత సేవలు కొనసాగించక తప్పలేదన్నారు. ఆర్జిత సేవల నిలిపివేత శనివారం కూడా కొనసాగుతుందని, తమ సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు భక్తులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.