
విద్యాధరపురంలో ఆజాద్ బంధువు ఇంట్లో సోదాలు చేస్తున్న ఏసీబీ సీఐ, ఆజాద్
సాక్షి, అమరావతి: ‘అధర్మా’దా యం కూడబెట్టారన్న అభియోగంపై దేవాదాయశాఖ రాజ మహేంద్రవరం రీజనల్ జాయిం ట్ కమిషనర్(ఆర్‌జేసీ) శీలం సూర్యచంద్రశేఖర్ ఆజాద్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. తెలుగు రాష్ట్రాల్లోని ఆయన నివాసాలతోపాటు బంధువులు, బినామీ లకు చెందిన ఆస్తులపై 18 చోట్ల ఏసీబీ 21 బృందా లతో ఆకస్మిక సోదాలు జరిపింది. హైదరాబాద్, విజయవాడ, నూజివీడు, ఏలూరు, రాజమండ్రి, అనంతపురం తదితర ప్రాంతాల్లో సోదాలు జరిపి బ్యాంక్ పాస్ పుస్తకాలు, రికార్డులు, ఇతర డాక్యుమెంట్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఆజాద్‌కు రూ.50 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించామని ఏసీబీ ఏలూరు డీఎస్పీ వాసంశెట్టి గోపాలకృష్ణ మీడియాకు తెలిపారు. ఆజాద్‌ను మంగళవారం రాత్రి ఏలూరులోని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా 2000లో బాధ్యతలు చేపట్టిన ఆజాద్ శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయం, కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం, శ్రీశైలం ఆలయాల్లో పనిచేశారు. ఆజాద్ పేరిట విజయవాడ గుణదలలో రూ.2 కోట్ల విలువైన భవనంతోపాటు హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారంలో న్యూటన్స్ రమ్య అపార్టుమెంట్‌లో ప్లాట్, భార్య పేరుతో దిల్‌సుఖ్‌నగర్‌లో ప్లాట్ ఉన్నాయి. ఆజాద్ ఇంట్లో రూ.12 లక్షల విలువైన బంగారు, వెండి సామగ్రిని గుర్తించారు.
రూ. 18 కోట్లతో సోలార్ పవర్‌ప్లాంట్
ఆజాద్ తన కుటుంబ సభ్యుల పేరుతో అనంతపురం జిల్లా ఊబిచర్లలో 32.1 ఎకరాల్లో ఆబేధ్య సోలార్ పవర్ ప్లాంట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆజాద్ రూ.18 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు చెబుతున్నారు. ఆజాద్ సోదరుడు వివేకానంద వద్ద డ్రైవర్‌గా పనిచేసే సాంబశివరావు, ప్లాంట్‌లో పనిచేస్తున్న లక్ష్మణరావు, రంగమ్మల పేరుతో రైతుల నుంచి 36.63 ఎకరాలను కొనుగోలు చేసి తర్వాత వివేకానంద పేరుపై బదిలీ చేయించుకున్నారు. ఆ భూముల్లోనే సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.
అలాగే ఆజాద్ విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడిపారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆజాద్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ డీజీ ఠాకూర్ తెలిపారు. దాడుల్లో రాజమహేంద్రవరం ఏసీబీ సీఐ సూర్య మోహనరావు, ఏసీబీ ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment