11 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల : శ్రీవారి ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 18 వరకు జరగనున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ప్రారంభం రోజైన విజయదశమి నాడు స్వామివారిని పెండ్లికుమారునిగాను, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా అలంకరించడంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఉత్సవాల్లో భాగంగా వచ్చేనెల 12న ధ్వజారోహణను ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు సర్వాది దేవతలను ఆహ్వానించే క్రమంలో ఈ ధ్వజారోహణను జరపడం పరిపాటి.
14న ఎదుర్కోలు ఉత్సవం, 15న చిన వెంకన్న దివ్య కల్యాణ మహోత్సవం జరపనున్నట్టు ఈవో చెప్పారు. 16న సాయంత్రం శ్రీవారి రథోత్సవం, 17న శ్రీచక్రవార్యూత్సవం, చూర్ణోత్సవం, వసంతోత్సవాలు, ధ్వజ అవరోహణ జరుపుతారు. 18న రాత్రి జరుగనున్న శ్రీపుష్పయాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈవో చెప్పారు. ఉత్సవాల రోజుల్లో ఉదయం, సాయంత్రం స్వామివారు వివిధ వాహనాలపై క్షేత్ర పురవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆయా రోజుల్లో శ్రీవారి నిత్యార్జిత కల్యాణం, ఆర్జిత సేవలు రద్దుకానున్నాయని ఈవో తెలిపారు.