నవమి నాటికి మూలమూర్తులకు బంగారు కవచం
* 12 కేజీల బంగారం వితరణ ఇచ్చిన బెంగళూరు భక్తుడు
* 15న చినజీయర్ స్వామి రాక
* విలేకరుల సమావేశంలో ఆలయ ఈఓ జ్యోతి
భద్రాచలం : భక్తరామదాసు ప్రతిష్ఠించిన భద్రాద్రి రాములోరు (గర్భగుడిలోని మూలవరులు) ఇక స్వర్ణ కవచంతో మెరిసిపోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 15న జరిగే శ్రీసీతారాముల పెళ్లి రోజున (శ్రీరామనవమి) బంగారు కవచాన్ని వారికి అలంకరించనున్నారు. బెంగళూరుకు చెందిన పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ భక్తుడు 12 కేజీల బంగారాన్ని కొనుగోలు చేసి తమకు అందజేశారని దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
భద్రాద్రి ఆలయంలోని గర్భగుడిలో ఉన్న శ్రీసీతారామచంద్ర స్వామి మూలమూర్తులకు ఈ కవచాన్ని అలంకరిస్తామని చెప్పారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వర్ణ కవచం తయారీని ప్రముఖ స్థపతి పాకున్నం రామన్‌కుట్టి దండపాణికి అప్పగించినట్లు తెలిపారు. శ్రీరామనవమి నాటికి మూలవరులకు వజ్రాలతో పొదిగిన స్వర్ణ కవచాన్ని అలంకరిస్తామని వివరించారు. శ్రీరామాయణ మహాక్రతువులో భాగంగా ఈ నెల 10 నుంచి 18 వరకు కీలక ఘట్టం ఉంటుందని, ఈ నెల 15న చినజీయర్ స్వామి హాజరుకానున్నారని ఆమె పేర్కొన్నారు.
ఈ నెల 10 నుంచి ప్రత్యేక వేడుకలు...
ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు మాట్లాడుతూ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న శతవర్ష ప్రయుక్త సువర్ణ భద్రకవచ సమర్పణాత్మక నవాహ్నిక శ్రీరామ మహాక్రతువు వేడుకలు ఈ నెల 10 నుంచి 18 వరకు కొనసాగిస్తామని తెలిపారు. 350 ఏళ్ల కిందట భక్త రామదాసు వారి ఆచార్యులైన రఘునాథ భట్టాచార్యుల చేతుల మీదుగా ప్రతిష్ఠించిన ప్రాచీన దివ్య ఉత్సవమూర్తులకు అలంకరణ చేయనున్న సువర్ణ భద్ర కవచ సమర్పణ మహాక్రతువులో భాగంగా చివరి తొమ్మిది రోజుల్లో ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నామని చెప్పారు.
తొమ్మిది రోజుల పాటు రోజుకు 12 వేల సార్లు శ్రీరామ మహామంత్రం హవనం, పంచగవ్యాభిషేకం చేస్తామని తెలిపారు. తొలిరోజు బాలకాండ, రెండవ, మూడవ రోజు అయోధ్యకాండ, 4వ రోజు అరణ్యకాండ, 5వ రోజు కిష్కిందకాండ, 6వ రోజు సుందరకాండ, 7, 8 రోజుల్లో యుద్ధకాండ, 9వ రోజు మహాపుర్ణాహుతి ప్రతిష్ఠాంగ మహాపట్టాభిషేకం నిర్వహిస్తామని వేదపండితులు వివరించారు. కార్యక్రమంలో పండితుడు మురళీకృష్ణమాచార్యులు, ప్రధానార్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులు, స్థానాచార్యులు స్థలసాయి, ఏఈఓ శ్రావణ్‌కుమార్, డీఈ రవీందర్ పాల్గొన్నారు.