టీటీడీ తరహాలో శ్రీశైలం అభివృద్ధి
- భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయం
- మాస్టర్‌ప్లాన్ అమలులో ఇబ్బందులు
- సోలార్ వ్యవస్థతో ఖర్చు తగ్గిస్తున్నాం
- ·ప్రీ ఫ్యాబ్రికేషన్ గదుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం
- ఏడాది పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈఓ నారాయణభరత్ గుప్త
శ్రీశైలం: తిరుమల తిరుపతి తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు.. చేయలేకపోయిన కార్యక్రమాలను వివరించారు. భక్తుల సౌకర్యాల కల్పనకు పెద్ద పీట వేసినట్లు తెలిపారు. క్షేత్రంలో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు. ఆధునిక టాయిలెట్స్ నిర్మాణం.. కాల్‌సెంటర్ ఏర్పాటు..ప్రగతి పనులుగా చెప్పుకొచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే...
వసతిపై స్పష్టత లేదు..
మొత్తం రూ.580 కోట్లతో మాస్టర్‌ప్లాన్ అంచనాలను రూపొందించారు గాని.. ఎక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించాలన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదటి దశలో డార్మెంటరీలు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజి వ్యవస్థ, వాటర్ ట్రీట్ మెంట్‌ప్లాంట్, మంచినీటి సరఫరా వ్యవస్థ, సివరేజ్ ప్లాంట్ మొదలైనవి ఉన్నాయి. ఇందులో ఉన్నంత వరకు దాదాపు అన్ని పూర్తిస్థాయిలో ముగింపు దశకు చేరుకున్నాయి. రెండో ఫేజ్‌లో వసతిగదుల నిర్మాణం కోసం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయితే అవి ఎక్కడ నిర్మించాలి, ఎలా నిర్మించాలి అన్నదానిపై స్పష్టత లేదు. మల్లికార్జునసదన్ నిర్మించి ఎనిమిదేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క గదిని కూడా దేవస్థానం కట్టించలేదు. అంటే ఏ అధికారి ఆ దిశగా ఆలోచించలేదు.
ప్రత్యేక గదులు..
దేవస్థానానికి ఉన్న నిధులతో ఆర్‌సీసీ బిల్డింగ్ నిర్మించాలంటే కనీసం చదరపు అడుగుకు సుమారు రూ. 2వేల వరకు ఖర్చు అవుతుంది. దీనికి తోడు కాలవ్యవధి కూడా ఎక్కువవుతుంది. ఈ పరిస్థితుల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రీ ప్యాబ్ కన్‌స్ట్రక్షన్ ద్వారా ప్రత్యేక గదులను 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని చూస్తున్నాం. ఇందుకోసం అయ్యే ఖర్చు రూ. 1700 చదరపు అడుగుకు అవుతుంది. అయితే ఈ గదులకు కామన్ బాత్‌రూమ్స్ మాత్రమే ఉంటాయి. మరో 50 అడుగుల పెంపుదలతో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 1900 నుంచి రూ. 2వేల వరకు చదరపు అడుగుల వ్యయంతో ఏసీ గదులను అందులోనే అటాచ్డ్ బాత్‌రూమ్‌లతో నిర్మించే పనిలో ఉన్నాం.
సోలార్ వెలుగులు..
ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణ పనులను రూ.75 కోట్లతో ఆర్‌కె కన్‌స్ట్రక్షన్ చేపడుతోంది. ప్రతి ఏటా దేవస్థానం విద్యుత్ శాఖకు సుమారు రూ. 3కోట్లకు పైగా కరెంట్ బిల్లులు చెల్లిస్తోంది. దీనిని తగ్గించుకునేందుకు ఒకే సారి పెట్టుబడి పెట్టి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నాం. ఇందులో భాగంగా దేవస్థానం అన్నపూర్ణ భవన్‌లో రూ 2 కోట్ల వ్యయంతో, మల్లికార్జునసదన్, వీవీఐపీ భ్రామరీసదన్, పలు కాటేజీలకు సోలార్ వ్యవస్థ ద్వారా వేడినీటితో పాటు విద్యుత్ వ్యయాన్ని కూడా తగ్గించే పనిలో ఉన్నాం. ఆయా వసతి గదుల్లో వైఫై సదుపాయాన్ని కూడా భక్తులకు కల్పిస్తున్నాం. అలాగే శ్రీశైలం టీవీ చానల్‌ను ఏర్పాటు చేయాలని భావించాం. ఇప్పటి వరకు చానల్‌కోసం రూ. 30లక్షల వరకు ఖర్చు చేశాం. దాతలు సహకరిస్తే మరింత తొందరగా చానల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ¯ð ల్లూరు ఏసిటీ నెట్‌వర్క్ వారి సహకారంతో ఛానెల్‌ను ఆప్‌లికింగ్ లేదా నెట్‌వర్క్ బ్యాకింగ్ ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నాం. చంద్రావతి కల్యాణమండపం నుంచి ఘంటామఠం, ఉద్యానవనం, శివాజీగోపుర మాడ వీధి అక్కడి నుంచి కృష్ణదేవరాయగోపురం నుంచి భక్తులు వచ్చేలా క్యూల నిర్మాణం జరుగుతోంది. ఇందు కోసం సుమారు రూ. 30 కోట్ల అంచనాతో ప్రణాళికను రూపొందిస్తున్నాం.
కాల్ సెంటర్...
భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ప్రతి రోజు ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు ఇది పని చేస్తుంది. ఫో¯Œన్ నంబర్లు 833901351,52, 53, 54,55,56.. గడిచిన 3 నెలల్లో 16 వేల ఫోన్ కాల్స్ ను కాల్ సెంటర్ రిసీవ్ చేసుకున్నాం.
అభివృద్ధి ఇదీ..
-
పాతాళగంగ మార్గంలోని నీలకంఠ , భ్రమరాంబా వసతి సముదాయం (పిలిగ్రామ్స్ అమినిటీస్ కాంప్లెక్స్) నుంచి భక్తులు తాత్కాలిక వసతిని పొందవచ్చు. ఈ సముదాయంలో బెడ్లు, మరుగుదొడ్లు, స్నానపు గదులతో పాటు లాకర్ సౌకర్యం కూడా కల్పించాం. భ్రమరాంబా వసతి సముదాయంలో ఏసీ సౌకర్యం ఉంది.
-
ఆలయ సమీపంలోని అన్న పూర్ణభవనంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు అన్న ప్రసాదాలు (భోజన ప్రసాదం), సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు అల్పాహారం అందజేస్తున్నాం. అన్నదానం నిధుల నుంచి వచ్చే వడ్డీని ఆధారం చేసుకుని భక్తులకు అల్పాహార సౌకర్యాన్ని కూడా కల్పించాం.
-
స్వామివారి అభిషేకం, శ్రీ అమ్మవారి కుంకుమార్చన, కల్యాణోత్సవం, ఏకాంత సేవ తదితర సేవా టిక్కెట్లను ముందస్తుగా ఇంటర్నెట్ నుంచిపొందవచ్చు. దేవస్థానం గదులను , కాటేజీలను, రిజర్వ్ చేసుకునే సదుపాయం కల్పించారు. వివరాలకు www.srisailamonline.com ను సందర్శించవచ్చు. క్యూ కాంప్లెక్స్‌చ ఆలయ ప్రాంగణంలోని ఆర్జిత సేవ కౌంటర్‌లు, మల్లికార్జున సదన్ , గంగా సదన్ మొదలైన చోట్ల గల ప్రత్యేక కౌంటర్ల నుంచి ఆర్జితసేవ టిక్కట్లను పొందవచ్చు.
-
శివగంగా జలప్రసాద పథకం కింద ఆలయ ప్రాంగణం, గౌరీసదనం, మల్లికార్జున సదనం, టూరిస్ట్ బస్టాండ్ , చంద్రవతి కళ్యాణ మండపం ప్రాంతాల్లో ఉచిత రక్షిత మంచినీటి కేంద్రాలు(మినరల్‌వాటర్ ప్లాంట్లు) ఏర్పాటు చేశాం.
-
పాతాళగంగ మార్గంలో అధునాతన కళ్యాణ కట్ట నిర్మించాం.. ఉదయం 4.30 నుండి రాత్రి 9 వరకు భక్తులు ఇక్కడ తలనీలాలను సమర్పించవచ్చు.
-
క్షేత్రంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. శ్రీ స్వామి వార్ల కైంకర్యానికి పూలతోటలను పెంచుతున్నాం.
-
శ్రీశైల క్షేత్రాన్ని స్వచ్ఛ శ్రీశైలంగా తీర్చి దిద్దేందుకు పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పొడిచెత్త, తడిచెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేర్వేరుగా సేకరించేందుకు డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేశాం.
-
శ్రీశైలాలయ పరిసరాలు విశాలంగా కనిపించేందుకు మాడ వీధుల విస్తరణ పనులను చేపట్టాం. ప్రస్తుతం దక్షిణమాడ వీధి పనులు పూర్తయ్యాయి. పడమర, తూర్పు, ఉత్తర మాడ వీధి పనులు కొనసాగుతున్నాయి. దసరా శరన్నవరాత్రోత్సవాల్లోగా వీటిని పూర్తి చేస్తాం.