
నేత్రపర్వం అమరేశ్వర తెప్పోత్సవం
అమరావతి: పంచారామ క్షేత్రాలలో ప్రథమారామ క్షేత్రమైన అమరావతి బాల చాముండికా సమేత అమరేశ్వరుని తెప్పోత్సవం గురువారం రాత్రి పవిత్ర కృష్ణానదీలో నేత్ర పర్వంగా సాగింది.
అమరావతి: పంచారామ క్షేత్రాలలో ప్రథమారామ క్షేత్రమైన అమరావతి బాల చాముండికా సమేత అమరేశ్వరుని తెప్పోత్సవం గురువారం రాత్రి పవిత్ర కృష్ణానదీలో నేత్ర పర్వంగా సాగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా తొలుత స్వామి వారి ఉత్సవ మూర్తులను మేళతాళాల నడుమ చిరు రథంపై పురవీథుల్లో ఊరేగించారు. అనంతరం అమరేశ్వర స్నానఘాట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహించారు.
తొలుత ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి అధ్వర్యంలో వేద పండితులు పవిత్ర కృష్ణవేణికి ఏకాదశహారతులు, అష్టోత్తర హారతి, కుంభహారతి, నక్షత్ర హారతులు ఇచ్చారు.
ఆలయ స్థానాచార్యుడు జగర్లపూడి వెంకటేశ్వరశాస్త్రి నదీ హారతి విశిష్టత వివరించారు. పవిత్ర నదులను కార్తీకపౌర్ణమినాడు పూజించటం శ్రేష్టమన్నారు.
ఆ తరువాత హంస వాహనంలా తీర్చిదిద్దిన పడవను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివార్లను ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు, భజనలు చేస్తూ, మేళతాళాలతో, బాణసంచాలతో కృష్ణానది అలలపై కన్నుల పండువగా తెప్పోత్సవం నిర్వహించారు.
అనంతరం తూర్పు ద్వారం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం కిందుగా స్వామి వారిని ఆలయంలోకి తీసుకువచ్చారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి తెప్పోత్సవాన్ని కనులారా వీక్షించారు.