కృష్ణా పుష్కర పనులకు ఏప్రిల్‌లో శ్రీకారం
సాక్షి, విజయవాడ : వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో పవిత్ర కృష్ణానదిలో స్నానాలు చేయడానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు వచ్చే ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభించాలని దుర్గగుడి అధికారులు నిర్ణయించారు. విజయవాడ కృష్ణానదీ తీరంలో దుర్గాఘాట్, వీఐపీ ఘాట్, భవానీ ఘాట్, పున్నమి ఘాట్, పద్మావతి ఘాట్‌లు ఉన్నప్పటికీ దుర్గాఘాట్‌కే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సౌకర్యాల కల్పనపై దేవస్థానం అధికారులు త్వరలో సమావేశం ఏర్పాటుచేసి పనులు ప్రారంభించాలని ఈవో సీహెచ్ నర్సింగరావు నిర్ణయించారు.
రూ.25 లక్షలు మంజూరు...
దుర్గాఘాట్ నిర్వహణ మాత్రమే దేవస్థానం పరిధిలో ఉంది. మిగిలిన ఘాట్లు ఇరిగేషన్ అధికారుల ఆధీనంలో ఉంటాయి. అందువల్ల దుర్గాఘాట్‌కు రూ.25 లక్షల దేవస్థానం నిధులు విడుదల చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రూ.25 లక్షల నుంచి 50 లక్షల నిధులు రాబట్టి పనులు చేయాలని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.
తొలుత కేశఖండన శాలలో మార్పులు...
దుర్గాఘాట్‌లో తలనీలాలు సమర్పించేందుకు కేశఖండన శాల ఉంది. దీన్ని భవనం పై అంతస్తులోకి మార్చి కింద భాగంలో భక్తుల కోసం మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా సెప్టిక్‌ట్యాంక్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్‌లో ఉన్న చెత్త(సిల్ట్)ను తొలగించి నీటిని శుభ్రం చేస్తారు. ఇదంతా పుష్కర ఏర్పాట్ల ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని నిర్ణయించారు.
భక్తులకు కల్పించే సౌకర్యాలు ఇవీ...
పుష్కరాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఒకేసారి 200 మంది జల్లు స్నానాలు చేసేవిధంగా 200 షవర్లను ఏర్పాటు చేస్తారు. నదిలో నుంచి 60 మీటర్ల వరకు పైపులు వేసి జల్లు సాన్నాలకు శుభ్రమైన నీరు వచ్చే విధంగా ఐదారు మోటార్లు వినియోగిస్తారు. ఘాట్‌లో ఉన్న నీరు కలుషితం కాకుండా ఉండేందుకు ఇక్కడి దుకాణాల్లో సబ్బుల విక్రయాలు నిషేధిస్తారు. కేవలం పసుపు, కుంకుమల విక్రయానికే అనుమతి ఇస్తారు.
⇒ భక్తుల కోసం అందుబాటులో ఉన్న స్థలంలోనే మరుగుదొడ్లు 30, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు మరో 30 ఏర్పాటు చేస్తారు.
⇒ వృద్ధులు, వికలాంగులు నదిలోకి దిగి స్నానాలు చేయదలిస్తే వారి కోసం ర్యాంపులు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న ర్యాంపును ఉపయోగంలోకి తెస్తారు.
⇒ వేలాది మంది భక్తులు స్నానాలు చేస్తే ఘాట్‌లో నీరు మురికి అయ్యే అవకాశం ఉన్నందున ఘాట్‌కు ఆరేడు మీటర్ల దూరంలోనే నీటిని క్లోరినేషన్ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల భక్తులకు అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉండదు.
⇒ పెద్దపెద్ద మోటార్లను ఉపయోగించి ఘాట్‌లోని నీటిని నదిలోకి పంపుతూ ఘాట్‌లోకి శుభ్రమైన నీరు వచ్చే విధంగా వాటర్ రీప్లేస్‌మెంట్ స్కీమ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
⇒ భక్తుల సౌకర్యం కోసం ఆరేడు హెల్ప్‌లైన్ సెంటర్లు, వైద్య బృందాలు ఏర్పాటు చేస్తారు.
⇒ ఘాట్‌లో స్నానాలు చేసే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న ఏడు బస్సులకు అదనంగా మరో ఐదారు ఏర్పాటు చేస్తారు. కొండపై నుంచి బస్టాండ్, రైల్వేస్టేషన్‌లకు ఉచిత సర్వీసులు నడుపుతారు.
⇒ కొండపైన ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేసి భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేస్తారు.