‘సాగర సంగమం’లో పర్యాటకం పకపక!
- సాగర సంగమం అభివృద్ధిపై నీలినీడలు
- అమలుకు నోచుకొని ముఖ్యమంత్రి హామీలు
- సింధు స్నానాలు సమీపిస్తున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం
సముద్రుడి అందాలు.. కృష్ణమ్మ సోయగాలు ఒకేచోట ఆవిష్కృతమయ్యే సాగర సంగమ ప్రాంతం మదిమదికి మరపురాని అద్భుత దృశ్యం. ఆధ్యాత్మికత విరబోత.. ప్రకృతి అందాల కలబోతతో విరాజిల్లుతున్న ‘సంగమం’ పర్యాటకాభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తోంది. పాలకుల నిర్లక్ష్యానికి గురవుతోంది. పెద్దలు ఇచ్చిన హామీలు నీటిమూటలుగా మారడంతో ప్రకృతి ప్రేమికులు, యాత్రికులను వేదన పెడుతోంది.
కోడూరు :‘కృష్ణా నదీ సాగర సంగమం ఎంతో పవిత్రమైంది. ఇక్కడున్న అడ్డంకులను తొలగించి, నవ్యాంధ్ర రాజధానిలో సాగర సంగమ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం’ అంటూ పుష్కరాల సమయంలో ఇక్కడకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది. ఆరు నెలలు దాటినా ఎలాంటి పనులు చేపట్టలేదు. ఈ నెల 10న సింధు స్నానాలకు ఇక్కడకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. సింధుస్నానాలకు వచ్చే భక్తుల కోసమైనా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
ఆటంకాలను అధిగమించేనా?
2004 పుష్కరాల సమయంలో అప్పటి ప్రభుత్వం పాలకాయతిప్ప కరకట్ట దగ్గర నుంచి సముద్రం వరకు రహదారి, వంతెన, సముద్రం, సంగమం వద్ద విశాంత్రి భవనాలు నిర్మించారు. గత ఏడాది ఆగస్టులో జరిగిన పుష్కరాలకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.6 కోట్లు కేటాయించింది. డాల్ఫిన్ భవనం నుంచి సంగమం వద్ద ఉన్న విశాంత్రి భవనం వరకు నూతన రహదారి నిర్మించేందుకు రూ.2.80 కోట్లు, భవనాల మరమ్మతులతో పాటు డాల్ఫిన్ భవనం వద్ద రిసార్ట్స్ నిర్మాణానికి రూ.3 కోట్లు, పాలకాయతిప్ప నుంచి సముద్రం వరకూ విద్యుత్ లైన్ కోసం నిధులు కేటాయించారు.
కలెక్టర్, అటవీ శాఖ మధ్య సమన్వయ లోపం వల్ల ఈ పనులు ప్రారంభం కాలేదు. అయితే సంగమ ప్రదేశం కృష్ణా వన్యప్రాణుల అభ్యయారణ్య ఫారెస్ట్ రేంజ్‌లోని కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) పరిధిలోకి రావడం, ఈ కారణంగా స్వచ్ఛంద సంస్థలు హైకోర్టును ఆశ్రయించడం, అటవీశాఖాధికారులపై కలెక్టర్ హెచ్చరికలు, ఒకరికొకరు పంతాలకు పోవడంతో ఈ పనుల ప్రారంభానికి ఆటంకం ఏర్పడింది. ఆటంకాలు తొలగించి అభివృద్ధి బాటపట్టిస్తామని పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చి ఆరు నెలలు దాటినా ఒక్క అడుగు ముందుకేయలేదు.
సింధు స్నానాలనాటికైనా సమస్యలు పరిష్కారమయ్యేనా?
మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఈ నెల 10వ తేదీ సాగర సంగమం వద్ద సింధు స్నానాలు చేసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వస్తారు. భక్తులకు విశ్రాంతినిచ్చేందుకు నిర్మించిన డాల్ఫిన్ భవనం అస్తవ్యస్తంగా ఉంది. విశ్రాంతి భవనం చుట్టూ ఉన్న బల్లలు శిథిలావస్థకు చేరాయి. లక్షలాది రూపాయల వ్యయంతో తాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసినా యాత్రికులకు ఉపయోగపడటం లేదు. ప్రధాన రాహదారికి ఇరువైపులా ముళ్లచెట్లు పెరిగిపోయాయి. రహదారి పూర్తిగా ధ్వంసమైంది, మరుగుదొడ్లు నిర్వహణ సరిగా లేకపోవడం, కృష్ణమ్మ విగ్రహం, పాదాలకు రక్షణ కరువవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి సింధు స్నానాలనాటికైనా నిరుపయోగంగా ఉన్నవాటిని ఉపయోగంలోకి తీసుకు రావాలని భక్తులు కోరుతున్నారు.