గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రయాణికుల రద్దీ | airport rush with devotees at gannavaram airport | Sakshi
Sakshi News home page

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రయాణికుల రద్దీ

Published Sun, Aug 21 2016 9:55 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

airport rush with devotees at gannavaram airport

గన్నవరం : కృష్ణా పుష్కరాల సందర్భంగా గన్నవరం విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి ఎక్కువైంది. సాధారణ ప్రయాణికులతో పాటు పుష్కర స్నానమచరించేందుకు దేశ, విదేశాల నుంచి యాత్రికులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. దీనితో గత పది రోజులుగా ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎయిర్‌పోర్టు వర్గాలు పేర్కొంటున్నాయి. పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంతే కాకుండా ఎయిర్‌పోర్టు అధికారులు ఏర్పాటు చేసిన ఆత్మీయ స్వాగత ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రయాణికులను, పుష్కర యాత్రికులను ఆకట్టుకుంటున్నాయి.

పుష్కర ప్రారంభానికి రోజువారి విమాన సర్వీసుల సంఖ్య 24 నుంచి 28 వరకు ఉండగా ప్రస్తుతం 34 నుంచి 36 సర్వీసులకు చేరుకున్నాయి. ఇక్కడికి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య కూడా గతంలో రోజుకు 1,500 నుంచి 1,800 వరకు ఉండేది. పుష్కరాల ప్రారంభంతో ఈ సంఖ్య రెట్టింపు అయి మూడు వేల నుంచి 3,500 మంది ప్రయాణికులకు చేరుకుంది. ముఖ్యంగా న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ప్రయాణికులు ఎక్కువగా ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. అయా నగరాలకు నడిచే విమానాల్లో ప్రయాణికుల అక్యుపెన్సీ రేషియో కూడా 90 నుండి 95 శాతం వరకు ఉన్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలుపుతున్నాయి.

దిగిరాని విమాన టిక్కెట్ల ధరలు
పెరిగిన ప్రయాణికుల రద్దీతో విమాన టిక్కెట్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణ రోజుల్లో రూ. 1,200 నుంచి రూ. 5 వేలలోపు ఉండే టిక్కెట్ ధరలు గత పది రోజులుగా రూ. 10 నుంచి రూ. 15 వేలు వరకు పలుకుతున్నాయి. పుష్కరాల సందర్భంగా ప్రయాణికులు అప్పటికప్పుడు టిక్లెట్లు బుక్ చేస్తుండడం విమానయాన సంస్థలకు లాభసాటిగా మారింది. గత మూడు రోజులుగా ట్రూజెట్ విజయవాడ నుంచి చెన్నైకు టిక్కెట్ ధర రూ. 13,329 చేరుకుంది. స్పైస్‌జెట్ విజయవాడ-బెంగళూరు మధ్య తిరిగే విమాన సర్వీసుల టిక్కెట్ ధర రూ. 12,400 నుంచి రూ. 14,500కు చేరింది. విజయవాడ నుంచి చెన్నై సర్వీస్ టిక్కెట్ ధర రూ. 11,299 ఉండగా, తిరుపతి, వైజాగ్ సర్వీసుల టిక్కెట్ల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. విజయవాడ నుంచి న్యూఢిల్లీకి ఎయిరిండియా విమాన టిక్కెట్ ధర 14,405కు చేరుకుంది
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement