కృష్ణమ్మ తీరం ... భక్తజన సంద్రం
సాక్షి, అమరావతి : కృష్ణాతీరానికి పుష్కరాల పదోరోజు భక్తజనం పోటెత్తింది. ఆదివారం కావడం, మరో రెండురోజుల్లో పుష్కరాలు ముగియనుండటంతో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని ప్రధాన పుష్కర ఘాట్లన్నీ జనసంద్రాన్ని తలపించాయి. ఎండ తీవ్రత, ట్రాఫిక్ జామ్‌లు, ఇతర ఇబ్బందులను లెక్కచేయకుండా భక్తులు పుష్కర స్నానాలాచరించి పులకించిపోయారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రంలో 29,91,750 మంది స్నానాలు చేయడం విశేషం. ఈ పుష్కరాల్లో ఇదే రికార్డు కావడం గమనార్హం. మొత్తం మీద ఈ పది రోజుల్లో పుష్కర స్నానాలు చేసిన భక్తుల సంఖ్య 1,53,66,036కు చేరింది.విజయవాడ కనకదుర్గమ్మ ఆల యంతో పాటు కృష్ణాతీరంలోని ఆలయాలన్నీ భక్తజనంతో కిటకిటలాడాయి.
23న ఆది పుష్కరాల ముగింపు
కృష్ణా పుష్కరాల్లో తొలి 12 రోజుల ఆది పుష్కరాలను మంగళవారం వేడుకగా ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. 23వ తేదీ రాత్రి 7 గంటలకు ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదికిచ్చే హారతితో ఆది పుష్కరాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా కృష్ణా హారతి ప్రాంతంలో ప్రభుత్వం భారీగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనుంది. ఆది పుష్కరాల ముగింపు సంద ర్భంగా వెయ్యి మంది కళాకారులతో కూచిపూడి నాట్య ప్రదర్శన నిర్వహిస్తారు.