జనజాతర
పుష్కరాలకు 8వ రోజు 20 లక్షల మంది
* పాలమూరులో 14 లక్షలు, నల్లగొండలో 6 లక్షలు
* తెలంగాణ అమరులకు కోదండరాం పిండ ప్రదానం
* అమర జవాన్లకు, సాగర్ డ్యామ్ నిర్మాణ కూలీలకు పిండ ప్రదానాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/నల్లగొండ: కృష్ణా పుష్కరాలకు 8వ రోజు శుక్రవారం భక్తులు పోటెత్తారు. పుష్కరాలు మరో 4 రోజుల్లో ముగియనుండటంతో రాష్ట్రం నలుమూలల నుంచీ లక్షలాది మంది తరలివచ్చారు. మహబూబ్‌నగర్‌లో 14 లక్షలు, నల్లగొండ జిల్లాలో 6 లక్షల మంది యాత్రికులతో ఘాట్లు కళకళలాడాయి. ఉదయం ఐదింటి నుంచే భక్తులతో కిటకిటలాడాయి. పాలమూరులో రంగాపూర్ ఘాట్‌కు ఏకంగా నాలుగున్నర లక్షల మంది పోటెత్తారు.
బీచుపల్లి, సోమశిల ఘాట్లు మూడేసి లక్షల మందితో కళకళలాడాయి. పలు ఘాట్లకు కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా వచ్చి పుణ్యస్నానమాచరించారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువనుంచి వరద నీరు భారీగా తగ్గడంతో జూరాల ఘాట్‌ను వరుసగా నాలుగో రోజూ మూసేశారు. సోమశిల పుష్కరఘాట్‌లో జేఏసీ చైర్మన్ కోదండరాం, జేఏసీ నేతలు పుష్కర స్నానం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరులో అమరులైన వారికి కోదండరాం పిండ ప్రదానం చేశారు. నల్లగొండ జిల్లాలో శుక్రవారం 6 లక్షల మంది స్నానాలు చేశారు. ఒక్క నాగార్జునసాగర్‌లోనే ఏకంగా 1.8 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని అంచనా. ఇక్కడి శివాలయం ఘాట్‌లో 1.3 లక్షల మంది స్నానాలు చేయడంతో భక్తులను అక్కడికి వెళ్లకుండా 2 గంటల సేపు నిలిపేసి సురికి వీరాంజనేయస్వామి ఘాట్‌కు తరలించారు.
వాడపల్లి ఘాట్ వద్ద 1.3 లక్షలు, మట్టపల్లిలో లక్ష మంది, కనగల్ మండలం దర్వేశిపురం ఘాట్‌లో 70 వేల మంది స్నానాలు చేశారు. కృష్ణా పుష్కరఘాట్‌లో విధులు నిర్వహిస్తున్న బ్రహ్మన్న అనే గజ ఈతగాణ్ని పాము కరవడంతో అతన్ని మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అమర జవాన్లకు, సాగర్ డ్యామ్ నిర్మాణంలో అసువులు బాసిన కూలీలకు పిండ ప్రదానాలు చేశారు. బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు ఒలింపిక్స్ ఫైనల్లో గెలవాలని కోరుతూ నదిలో దీపాలు వెలిగించారు.
వీఐపీల తాకిడి
మహబూబ్‌నగర్ జిల్లా గొందిమళ్ల ఘాట్‌లో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి పుణ్యస్నానాలు ఆచరించారు. జోగుళాంబ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు స్నానాలాచరించారు.
రంగాపూర్ ఘాట్‌లో ‘సాక్షి’ ఎడిటర్ వర్ధెల్లి మురళి సతీసమేతంగా పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువు వేలేటి మృత్యుంజయశర్మ మట్టపల్లి ప్రహ్లాద ఘాట్‌లో, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని సాగర్‌లో పుణ్యస్నానాలు చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన పాతులోతు వెంకటేశ్వర్లు, సుశీల దంపతులు తమ 30 రోజుల చిన్నారికి పుష్కర స్నానం చేయించారు.