పరవశించిన భక్తజనం
♦ రెండో రోజు భారీగా తరలివచ్చిన సాయి భక్తులు
♦ నేటితో ముగియనున్న గురుపౌర్ణమి ఉత్సవాలు
♦ ఉట్టి ఉత్సవాలతో ఘనంగా ముగింపు
సాక్షి ముంబై : గురుపౌర్ణమి ఉత్సవాలతో షిర్డీ పుణ్యక్షేత్రం శుక్రవారం జనసంద్రమైంది. భారీగా తరలివచ్చిన భక్తజనం సాయి దర్శించుకుని పరవశించారు. సాయిబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో ఈ రోజు ప్రధానం కావడంతో పలు కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. దీంతో షిర్డీ పురవీధులన్ని భక్తులతో కిటకిటలాడాయి.
శుక్రవారం ‘శ్రీ సాయి సచ్ఛరిత్ర’ పవిత్ర గ్రంథం అఖండ పారాయణం సమాప్తి అయింది. అనంతరం శ్రీసాయి చిత్రపటం, పోతి (ధాన్యపు సంచి)ని ఊరేగించారు. సాయిబాబా సంస్థాన్ అధ్యక్షుడు, జిల్లా కోర్టు జడ్జి వినయ్ జోషీ ‘పోతి’ చేతబట్టుకోగా, మందిరం కార్యనిర్వహణ అధికారి (ఈవో) రాజేంద్ర జాదవ్, డిప్యూటీ ఈవో అప్పాసాహెబ్ షిండే సాయి చిత్రపటాన్ని చేతపట్టుకున్నారు. సాయిబాబా మందిర పరిసరాల్లోని ఐదు మందిరాలు గురుస్థాన్ మందిరంతోపాటు శని మందిరం, గణపతి మందిరం, మహాదేవ్ మందిరం, నందాదీప్ మందిరాలకు సాయిభక్తుడు విజయ్ కుమార్ సహకారంతో బంగారు పూతను అద్దారు.
శ్రీ సాయి సచ్ఛరిత్రను మరాఠీ నుంచి గుజరాతీలోకి హీనాబెన్ మెహతా అనువదించారు. ఈ గ్రంథాన్ని ఈవో రాజేంద్ర జాదవ్, డిప్యూటీ ఈవో అప్పాసాహెబ్, హీనాబేన్ మెహతా సమక్షంలో అవిష్కరించారు. ఢిల్లీలోని తన మొత్తం ఆస్తిని బాబా సంస్థాన్‌కు విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్న సుధాకిరణ్‌ను ఈ సందర్భంగా సత్కరించారు. భక్తులు అందజేసిన విరాళాలతో షిర్డీ వచ్చే వారందరికీ ఉచిత ప్రసాదం, భోజనం అందిస్తున్నారు. గురుపౌర్ణమి ఉత్సవాల చివరి రోజైన శనివారం గురుస్థాన్ ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అదే విధంగా ఉట్టిఉత్సవాలు, ప్రత్యేక కీర్తనల కార్యక్రమాలు ఉండనున్నాయి.