Shirdi Sai Baba: షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త | Shirdi Sai Sansthan Trust says Good news for Shirdi Sai Baba devotees | Sakshi
Sakshi News home page

Shirdi Sai Baba: షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త

Published Sat, Nov 12 2022 3:11 PM | Last Updated on Sat, Nov 12 2022 3:11 PM

Shirdi Sai Sansthan Trust says Good news for Shirdi Sai Baba devotees - Sakshi

సాక్షి, ముంబై: షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త. బాబా ఆలయంలో సమాధిని చేతితో తాకి దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదివరకు బాబా విగ్రహాన్ని దూరం నుంచి దర్శించుకుని బయటకు వెళ్లేవారు. విగ్రహం ఎదురుగా ఉన్న సమాధి చుట్టూ అమర్చిన అద్దాల ఫ్రేమ్‌ వల్ల తాకేందుకు వీలు లేకుండా పోయేది. దీంతో సమాధి చుట్టూ అమర్చిన అద్దాల ఫ్రేమ్‌ను తొలగించాలని బాబా సంస్థాన్‌ యాజమాన్యం, షిర్డీ గ్రామస్తుల మధ్య జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో సాయి భక్తులకు గతంలో మాదిరిగా సమాధిని చేతులతో తాకి దర్శించుకునేందుకు వీలు లభించనుంది. సంస్థాన్‌ తీసుకున్న నిర్ణయంతో సాయి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ దేవస్థానాలలో ఒకటైన షిర్డీ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య రోజరోజుకూ పెరిగిపోతుంది. దీంతో సాయి సంస్థాన్‌ భక్తులకు మెరుగైన మౌలికసదుపాయాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా సాధ్యమైనంత త్వరగా బాబా దర్శనం చేసుకుని బయటకు వచ్చే విధంగా రద్దీని తగ్గించడం, ద్వారకామాయి ఆలయంలోకి రెండు దిశల నుంచి భక్తులను అనుమతిడం వంటి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా షిర్డీ గ్రామస్తులు ఆలయ పరిసరాల్లో ఉన్న ప్రవేశ ద్వారం నుంచి సులభంగా రాకపోకలు సాగించే విధంగా ఏర్పాట్లు చేయడంతోపాటుగా సాయి సచ్చరిత పారాయణం ఇతర భాషల్లోకి అనువదిస్తున్నారు.

చదవండి: (అమ్మనా జర్మనీ కోడలా?.. వైరల్‌)

తెల్లవారు జామున బాబాకు కాకడ్‌ హారతీ ఇస్తున్న సమయంలో గురుస్థాన్‌ మందిరంలోకి భక్తులను అనుమతించడం, ఆలయ పరిసరాల్లో ఏర్పాటుచేసిన బారికేడ్లను తొలగించడం లాంటి అనేక పనులు చేపట్టనున్నారు. కానీ బాబా సమాధి చుట్టూ అమర్చిన అద్దాల ఫ్రేమ్‌ వల్ల భక్తులు సమాధిని తాకలేకపోతున్నారు. దీంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో అద్దాల ఫ్రేమ్‌ లేకపోవడంతో భక్తులు నేరుగా సమాధిని చేతులతో తాకి పావనమయ్యే వారు.

ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. షిర్డీ గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని తరుచూ తెరమీదకు తెచ్చేవారు. ఎట్టకేలకు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న సంస్థాన్‌ పదాధికారులు సానుకూలంగా స్పందించారు. దీంతో సమాధి చుట్టూ ఉన్న అద్దాల ఫ్రేమ్‌ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సాయి సంస్థాన్‌ ప్రధాన కార్యనిర్వాహక అధికారి భాగ్యశ్రీ బానాయత్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement