Shirdi Sai Baba temple
-
కూతురుతో కలిసి షిర్డీ ఆలయంలో షారుక్ ఖాన్ పూజలు (ఫోటోలు)
-
Shirdi Sai Baba: షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త
సాక్షి, ముంబై: షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త. బాబా ఆలయంలో సమాధిని చేతితో తాకి దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదివరకు బాబా విగ్రహాన్ని దూరం నుంచి దర్శించుకుని బయటకు వెళ్లేవారు. విగ్రహం ఎదురుగా ఉన్న సమాధి చుట్టూ అమర్చిన అద్దాల ఫ్రేమ్ వల్ల తాకేందుకు వీలు లేకుండా పోయేది. దీంతో సమాధి చుట్టూ అమర్చిన అద్దాల ఫ్రేమ్‌ను తొలగించాలని బాబా సంస్థాన్ యాజమాన్యం, షిర్డీ గ్రామస్తుల మధ్య జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో సాయి భక్తులకు గతంలో మాదిరిగా సమాధిని చేతులతో తాకి దర్శించుకునేందుకు వీలు లభించనుంది. సంస్థాన్ తీసుకున్న నిర్ణయంతో సాయి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ దేవస్థానాలలో ఒకటైన షిర్డీ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య రోజరోజుకూ పెరిగిపోతుంది. దీంతో సాయి సంస్థాన్ భక్తులకు మెరుగైన మౌలికసదుపాయాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా సాధ్యమైనంత త్వరగా బాబా దర్శనం చేసుకుని బయటకు వచ్చే విధంగా రద్దీని తగ్గించడం, ద్వారకామాయి ఆలయంలోకి రెండు దిశల నుంచి భక్తులను అనుమతిడం వంటి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా షిర్డీ గ్రామస్తులు ఆలయ పరిసరాల్లో ఉన్న ప్రవేశ ద్వారం నుంచి సులభంగా రాకపోకలు సాగించే విధంగా ఏర్పాట్లు చేయడంతోపాటుగా సాయి సచ్చరిత పారాయణం ఇతర భాషల్లోకి అనువదిస్తున్నారు. చదవండి: (అమ్మనా జర్మనీ కోడలా?.. వైరల్) తెల్లవారు జామున బాబాకు కాకడ్ హారతీ ఇస్తున్న సమయంలో గురుస్థాన్ మందిరంలోకి భక్తులను అనుమతించడం, ఆలయ పరిసరాల్లో ఏర్పాటుచేసిన బారికేడ్లను తొలగించడం లాంటి అనేక పనులు చేపట్టనున్నారు. కానీ బాబా సమాధి చుట్టూ అమర్చిన అద్దాల ఫ్రేమ్ వల్ల భక్తులు సమాధిని తాకలేకపోతున్నారు. దీంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో అద్దాల ఫ్రేమ్ లేకపోవడంతో భక్తులు నేరుగా సమాధిని చేతులతో తాకి పావనమయ్యే వారు. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. షిర్డీ గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని తరుచూ తెరమీదకు తెచ్చేవారు. ఎట్టకేలకు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న సంస్థాన్ పదాధికారులు సానుకూలంగా స్పందించారు. దీంతో సమాధి చుట్టూ ఉన్న అద్దాల ఫ్రేమ్‌ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సాయి సంస్థాన్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి భాగ్యశ్రీ బానాయత్ తెలిపారు. -
షిర్డీ సాయికి రూ. 33 లక్షలతో బంగారు కిరీటం
షిర్డీ: హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మందా రామకృష్ణ(80) షిర్డీ సాయిబాబాకు రూ.33 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని శుక్రవారం అందజేశారు. ఈ విషయాన్ని శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్టు సీఈఓ భాగ్యశ్రీ బనాయత్ వెల్లడించారు. ఈ కిరీటం బరువు 707 గ్రాములు. 35 గ్రాముల అమెరికా వజ్రాలను కిరీటంలో పొదిగారు. ఈ సందర్భంగా డాక్టర్ మందా రామకృష్ణ మాట్లాడుతూ.. తాను భార్యతో కలిసి 1992లో షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నానని చెప్పారు. ఆ సమయంలో సాయిబాబా ఆలయ పూజారి ఒక కిరీటాన్ని తమకు చూపించారని అన్నారు. అలాంటి కిరీటాన్నే సాయిబాబాకు అందజేస్తానని తన భార్యకు మాట ఇచ్చానన్నారు. అప్పట్లో తన వద్ద తగినంత డబ్బు లేదని తెలిపారు. ఉద్యోగ విరమణ తర్వాత అమెరికాలో 15 ఏళ్లపాటు వైద్యుడిగా ప్రాక్టీస్ చేశానని, అలా వచ్చిన డబ్బుతో కిరీటం తయారు చేయించి, సాయిబాబా పాదాల వద్ద పెట్టానని వివరించారు. డాక్టర్ రామకృష్ణ భార్య కొన్ని సంవత్సరాల క్రితమే మృతిచెందారు. -
1.08 లక్షల కిలోల బియ్యంతో తండులాభిషేకం
మధురానగర్(విజయవాడ సెంట్రల్): విజయవాడ ముత్యాలంపాడు శ్రీషిర్డీసాయిబాబా మందిరంలో శనివారం ఆంగ్ల సంవత్సరాది పురస్కరించుకుని లోక కల్యాణార్ధం 1.08 లక్షల కిలోల బియ్యంతో బాబాకు విశేషంగా అభిషేకం (తండులాభిషేకం) జరిగింది. ఉదయం తండులాభిషేకాన్ని మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు సుమారు 20 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు నూతన సంవత్సర క్యాలెండర్లు, ప్రసాదాన్ని అందజేశారు. తండులాభిషేకాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్‌లో నమోదు చేసి దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చేతులమీదుగా మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డికి అందజేశారు. బాబాను మంత్రి వెలంపల్లి, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ రెడ్డి దర్శించుకున్నారు. తండులాభిషేకంకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ సర్టిఫికెట్‌ను మంత్రి వెలంపల్లి చేతుల మీదుగా అందజేస్తున్న దృశ్యం -
షిర్డీ.. ఆమెకు అనుమతి లేదు
ముంబై: సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌పై షిర్డీ అధికారులు అంక్షలు విధించారు. డిసెంబర్ 8 నుంచి 11 అర్ధరాత్రి వరకు తృప్తి దేశాయ్‌కు షిర్డీ ఆలయ ప్రవేశాన్ని నిషేధిస్తూ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గోవింద్ షిండే నోటీసులు జారీ చేశారు. తృప్తి దేశాయ్ ఆలయంలోకి ప్రవేశిస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ఆ నోటిసుల్లో పేర్కొన్నారు. షిర్డీతో పాటు దాని పక్కనే ఉన్న అహ్మద్‌నగర్ జిల్లాలో కూడా ఆమె ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ ఆమె తమ ఆదేశాలను ఉల్లంఘించి ఆలయంలోకి ప్రవేశించడానికి చూస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక, షిర్డీ ఆలయంలోకి వచ్చే భక్తుల సంప్రదాయ వస్త్రాలు మాత్రమే ధరించాలని ఆలయ అధికారులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. వీటిపై తృప్తి దేశాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు ఆ పోస్టర్లను తొలగించాలని.. లేకపోతే తానే ఇతర కార్యకర్తలతో డిసెంబర్ 10న ఆలయం వద్దకు చేరుకుని వాటిని తొలగిస్తానని తృప్తి దేశాయ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆమెకు నోటీసులు జారీచేశారు. (ప్లీజ్.. సంప్రదాయ దుస్తుల్లో రండి: షిర్డి) అయితే తమ భక్తులపై ఎలాంటి డ్రెస్ కోడ్ విధించలేదని షిర్డీ ట్రస్ట్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. షిర్డీకి వచ్చే కొందరి వస్త్రాధారణపై భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈ నేపథ్యంలో కేవలం షిర్డీ వచ్చేవారికి అభ్యర్థన చేసే విధంగా ఆలయ పరిసరాల్లో పోస్టర్లు అంటించినట్టు చెప్పారు. ఇక, ఈ పోస్టర్లకు సంబంధించి ట్రస్ట్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాసినట్లు తృప్తి దేశాయ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘దేవాలయం పవిత్రతను ఎలా కాపాడాలో భక్తులకు బాగా తెలుసు. ఈ పోస్టర్లును తొలగించకపోతే.. మేం ఇక్కడికి వచ్చి వాటిని తొలగిస్తాం. డిసెంబర్ 10 మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతానికి మేం ఇక్కడకు చేరుకుంటాం’అని హెచ్చరించారు. -
పాస్‌లు ఉంటేనే షిర్డీ ఆలయంలోకి..
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో సోమవారం నుంచి ప్రార్థనా స్థలాలు తెరుచుకున్నాయి. దీపావళి పర్వదిన పురస్కరించుకుని సోమవారం నుంచి ప్రార్థన స్థలాలు తెరిచేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోవిడ్–19 కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల గత ఏడు నెలలకుపైగా అలయాలు, వివిధ మతాల ప్రార్థనా స్థలాలన్నీ మూసి ఉన్నాయి. భక్తులు లేక ఆలయ పరిసరాలన్నీ వెలవెలబోయాయి. అయితే సోమవారం నుంచి ప్రార్థనా స్థలాలు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించగానే ఇటు భక్తులు, అటు ఆలయాల సరిసరాల్లో పూలు, పూలదండలు, కొబ్బరి కాయలు, ప్రసాద సామగ్రి విక్రయించే చిరు వ్యాపారుల్లో ఆనందం వెల్లువిరిసింది. మొన్నటి వరకు ఉపాధిలేక ఖాళీగా ఉన్న పేద వ్యాపారులు సంతోషం పట్టలేక బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ ప్రమాదం ఇంకా పొంచి ఉండటంతో కోవిడ్ నిబంధనలు, ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని సీఎం ఆదేశించారు. లక్ష్మీ పూజ సందర్భంగా.. కోవిడ్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆలయాలతోపాటు ముస్లింల మసీదులు, క్రైస్తవుల చర్చిలు, పార్శీల అగేరీ లు ఇలా అన్ని రకాల ప్రార్థన స్థలాలు ప్రభు త్వం ఆదేశాల మేరకు మూసి ఉన్నాయి. కానీ, ఇటీవల వైన్ షాపులు, బార్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, నాటకాలు ప్రదర్శించే హాళ్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచి్చంది. ఇదే తరహాలో ప్రార్థనా స్థలాలు తెరిచేందుకు అనుమతివ్వాలని ఉద్ధవ్ ఠాక్రేపై సామాన్య ప్రజలు మొదలుకుని వివిధ సామాజిక సంస్థల నుంచి ఒత్తిడి రాసాగింది. దీంతో కరోనా వైరస్ తీవ్రత తాజా పరిస్థితులను అధ్యయనం చేసి ప్రార్థనా స్థలాలు తెరిచేందుకు అనుమతిస్తామని అప్పట్లో ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు. చివరకు శనివారం లక్ష్మీ పూజ పర్వదినం సందర్భంగా సోమవారం నుంచి ఆలయాలు తెరిచేందుకు అనుమతించారు. కరోనా విస్తరించకుండా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలు స్వయంగా రూపొందించుకున్నాయి. షిర్గీలో పాసులుంటేనే అనుమతి షిర్డీలోని బాబా ఆలయంలోకి పాస్‌లుంటునే అనుమతించాలని ఆలయ సంస్థాన్ నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరిగా భక్తులందరిని కాకుండా రోజుకు ఆరు వేల మందిని మాత్రమే అనుమతించనున్నారు. పాస్‌లు పొందేందుకు ఆన్లైన్లో ఏర్పాట్లు చేసినట్లు సంస్థాన్ పదాధికారులు తెలిపారు. అదేవిధంగా ముంబైలోని ముంబాదేవి గర్భగుడిలోకి ఒకేసారి కేవలం ఐదుగురు భక్తులను అనుమతించనున్నారు. తోపులాటలు జరగకుండా క్యూను క్రమబద్దీకరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రతీ రెండు గంటలకు ఒకసారి ఆలయంలో క్రిమిసంహరక మందులు పిచికారి చేయనున్నారు. ఆ సమయంలో ఆలయం మూసి ఉంచనున్నారు. ప్రవేశ ద్వారం వద్ద శానిటైజేషన్ టన్నెల్ ఏర్పాటు చేయనున్నారు. భక్తులు తమ చేతిలో ఎలాంటి పూలు, హారాలు, కొబ్బరికాయలు, ప్రసాదాలు, ఇతర పూజ సామగ్రి పల్లెంతో రావొద్దని ఆలయ మేనేజర్ హేమంత్ మహాజన్ విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభాదేవిలోని ప్రముఖ సిద్ధివినాయక ఆలయం, పండరీపూర్‌లోని విఠల్, రుక్మాయి మందిరం, కొల్హాపూర్‌లోని తుల్జాభవాని మాత తదితర ఆలయాల యాజమాన్యాలు ఏర్పాట్లు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. కరోనా వైరస్ విస్తరించుకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మీ సహకారంతోనే అదుపులోకి కరోనా: సీఎం ఉద్ధవ్ లాక్డౌన్ అమలులోకి వచ్చిన తరువాత ఉగాది, నాగపంచమి. రాఖీ పండుగ, గణేశోత్సవాలు, నిమజ్జనోత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు ఆ తరువాత దసరా, ఈద్, మౌంట్‌మేరీ జాత ర, ఇప్పుడు దీపావళి ఇలా వివిధ మతాల పండుగలన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సాదాసీదాగా జరుపుకున్నామని సీఎం ఉద్ధవ్ గుర్తుచేశారు. ప్రజల సహకారం వల్లే కరోనా వైరస్ అదుపులోకి వచ్చిందని సీఎం తెలిపా రు. ఆలయాలు తెరిచిన తరువాత కూడా ప్రజల సహకారం ఇలాగే ఉండాలని ఉద్ధవ్ ఠాక్రే ఆకాంక్షించారు. ఆలయాలకు వ చ్చే భక్తులు ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రార్థనా స్థలం ప్రవేశ ద్వారం వద్ద హ్యాండ్ శానిటైజ్, థర్మల్ స్క్రీనింగ్ కచ్చితంగా చేయాలి. మార్గదర్శక సూచనలు ముఖాలకు కచ్చితంగా మాస్క్ ధరించాలి. మాస్క్ లేకుంటే ఆలయంలోకి అనుమతి ఇవ్వకూడదు. కరోనాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేని భక్తులనే అనుమతించాలి. ఇద్దరి మధ్య ఆరడుగుల దూరం కచ్చితంగా పాటించాలి. ఏ సమయంలో ఎంతమంది భక్తులను అనుమతించాలనేది ముందే ప్లాన్ చేసుకోవాలి. లోనికి, బయటకు వచ్చే దారులు వేర్వేరుగా ఉండాలి. మందిరంలో దేవీ, దేవత విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను చేతితో తాకకుండా చూడాలి. ప్రార్థనా స్థలం పరిసరాల్లో భజనలు, కీర్తనలు ఆలపించే కార్యక్రమాలు నిర్వహించకూడదు. దర్శనం అనంతరం బయటపడే భక్తులకు చేతితో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయరాదు. సాధ్యమైనంతవరకు ఆలయానికి బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు రాకుండా నిరోధించాలి. ఆలయం ఆవరణలో భక్తులు క్రమశిక్షణతోపాటు బాధ్యతగా ప్రవర్తించాలి. ఆలయ కమిటీకి సహకరించాలి. -
మన కోసం మరో షిరిడీ
షిరిడీలో కొలువై ఉన్న సాయిబాబాను భక్తులు ప్రత్యక్ష దైవంగా కొలుస్తుంటారు. దేశం నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు మహారాష్ట్రలోని షిరిడీ వెళ్లి బాబాను దర్శించుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల భక్తుల కోసం భారీ స్థాయిలో మరో షిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించినట్లు నామక్కల్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ అధినేత, ‘దక్షిణాది షిరిడీ సాయిబాబా ఆలయ’ బోర్డు చైర్మన్ కే చంద్రమోహన్ తెలిపారు. ఈనెల 8న వెయ్యిశంఖాలతో మండలపూజ నిర్వహించనున్న సందర్భంగా ఆలయ నిర్మాణానికి దారితీసిన అనుభవాలు, అనుభూతులను మీడియాకు వివరించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘అందరు దేవుళ్లను సాధారణంగా కొలవడమేగానీ షిరిడీ బాబా పట్ల ప్రత్యేకమైన భక్తిప్రపత్తులు ఉన్నవాడిని కాదు. ఒకరోజు స్నేహితునితో కలిసి 2008లో షిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని వచ్చాను. కొద్ది రోజుల్లోనే నాకు ఒక అద్భుతమైన కల వచ్చింది. కలలో ఒక పాప నన్ను ఉద్దేశించి బాబా ఆలయాన్ని నిర్మించాలని కోరింది. ఆలయ నిర్మాణానికి అనువైన స్థలం మీ ఊరికి సమీపంలోనే ఉందంటూ ఒక వేపచెట్టు, పక్కనే బండరాయి, సమీపంలో తాటిమాను ఉన్న ప్రాంతాన్ని చూపింది. ఉలిక్కిపాటుతో మేల్కొన్న నేను కలలో చూసిన ప్రాంతం కోసం ఎంతగానో అన్వేషించగా తిరుచ్చిరాపల్లి జిల్లా అక్కరపట్టి, సమయపురం, టోల్గేట్ సమీపంలో సరిగ్గా అదేస్థలం కనపడింది. ఆ స్థల యజమానైన ఒక రైతు ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు నిరాకరించాడు. బాబా ఆదేశాల ప్రకారం అక్కడే నిర్మించడం ఎలాగని ఆలోచనలో పడగా సరిగ్గా వారం రోజుల తరువాత అదే రైతు నన్ను వెతుక్కుంటూ వచ్చి అర ఎకరా స్థలాన్ని ఇవ్వడం విశేషం. వెంటనే 2009లో చిన్నపాటి షిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించాను. పెద్ద సంఖ్యలో భక్తుల రాక పెరగడంతో అన్నదాన కార్యక్రమాలను చేపట్టాను. షిరిడీ పద్ధతుల్లో రోజుకు మూడు సార్లు అదే భాషలో హారతులు ప్రవేశపెట్టి పెద్ద ఆలయాన్ని నిర్మించాలని 2016లో నిర్ణయించుకున్నాను. జర్మనీ నుంచి అత్యంత ఖరీదైన అలంకరణ రాళ్లను తెప్పించి రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ ఆలయ నిర్మాణం పూర్తికాగా జనవరిలో కుంభాభిõÙకం చేసి బాబాకు అంకింతం చేశాం. కుంభాభిõÙక మహోత్సవానికి తమిళనాడుతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 80 వేల మంది భక్తులు హాజరైనారు. ఆలయానికి అనుబంధంగా శాశ్వత ప్రాతిపదికన ఉచిత వైద్యం, వృద్ధాశ్రమం నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాన’ని ఆయన తెలిపారు. ఆలయంలో భక్తులు మహిమాన్వితుడైన బాబా ఆలయ నిర్మాణం తలపెట్టినప్పటి నుంచి బాబా ఆశీస్సులతోపాటు ఎన్నో మహిమలు చోటుచేసుకున్నాయని చంద్రమోహన్ తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల బాబా జన్మస్థలంపై వివాదం తలెత్తగా షిరిడీలోని బాబా ఆలయాన్ని మూడు రోజులపాటు మూసివేశారు. అనుకోకుండా అవే మూడు రోజుల్లో ఇక్కడి కొత్త ఆలయంలో బాబాకు కుంభాభిషేకం జరగడం అనూహ్యమైన పరిణామం. తిరుపతి నుంచి చెన్నైకి కారులో వస్తూ పూందమల్లికి 10 కి.మీ దూరంలో రోడ్డుపక్కన ఉన్న ఒక పెద్ద బోర్డును చూసి ఆలయ ప్రచారానికి ఎంత ఖరీదైనా చెల్లించి వాడుకోవాలని ఆశించగా వారు నిరాకరించారు. ప్రయాణం సాగుతుండగానే కొద్దిసేపట్లో వారే ఫోన్ చేసి ఉచితంగా ఇస్తామన్నారు. మరికొద్ది దూరంలో మరో బోర్డును దాని యజమాని కూడా ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. 8న మండల పూజ కుంభాభిషేకం ముగిసిన సందర్భంగా ఈనెల 8వ తేదీన వెయ్యి శంఖాలతో మండల పూజను చేపడుతున్నట్లు దక్షిణాది షిరిడీ సాయిబాబా ఆలయ బోర్డు సభ్యులు, ఆలయ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇన్చార్జ్ టి సురేష్ తెలిపారు. అనతికాలంలోనే ఆలయ విశిష్టత నలు చెరగులా ప్రచారం కావడంతో తమిళనాడు టూరిజం శాఖలో చేర్చారు. అంతేగాక భక్తుల సౌకర్యార్థం తిరుచ్చిరాపల్లి నగరం నుంచి ఆలయం వద్దకు టూరిజంశాఖ ఉచిత బస్సులను నడుపుతోంది. ఆలయ సందర్శనార్థం వచ్చే తెలుగువారు 9600005060 సెల్‌ఫోన్ నంబరులో సంప్రదిస్తే అవసరమైన సహాయ సహకారాలు అందజేయగలనని సురేష్ తెలిపారు. -
దేశవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీతోపాటు దేశంలోని అన్ని సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు సాయిబాబా ఆలయాలకు భారీగా తరలివస్తున్నారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని సాయిబాబా ఆలయాలను సుందరంగా అలంకరించారు. సాయినామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. షిర్డీలో సోమవారం గురుపౌర్ణమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్కడ మూడు రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని బాబా సమాధి ఆలయాన్ని వివిధ రంగుల విద్యుత్ దీపాలతో, రకరకాల పూలతో చూడముచ్చటగా అలంకరించారు. ఆలయంతోపాటు షిర్డీ పుర వీధులన్ని భక్తులతో పులకించిపోతున్నాయి. -
షిర్డీలో గోడపై సాయిబాబా ఆకృతి
సాక్షి, ముంబై: షిర్డీలోని ద్వారకా మాయిలోని ఓ గోడపై బుధవారం అర్ధరాత్రి సాయిబాబా ఆకృతి (చిత్రం) కన్పించదని ఓ భక్తుడు తెలపడంతో షిర్టీ పరిసరాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సుమారు మూడు గంటలపాటు సాయిబాబా చిత్రం కన్పించిందని స్థానికులు చెబుతున్నారు. సాయిబాబా దర్శనమిచ్చిన ద్వారకామాయిలోని గోడను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున షిర్డీకి చేరుకున్నారు. అయితే ఇలాంటిదేమి ఉండదని కొందరు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు షిర్డీ సాయిబాబా సంస్థాన్ మాత్రం ఈ విషయంపై అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. -
యాచకుడి విరాళం రూ.లక్ష
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): విజయవా డ ముత్యాలంపాడులోని షిర్డీసాయిబాబా మంది రానికి ఓ యాచకుడు భా రీగా విరాళం ఇచ్చాడు. సాయిబాబా సమాధి చెంది వంద ఏళ్లు పూర్తవు తున్న సందర్బంగా షిర్డీ సాయిబాబా మందిరం లో ఈనెల 26వ తేదీన నిర్వహించ నున్న లక్ష నారికేళ జలాభిషేకంకు యాచకుడు యడ్ల యాది రెడ్డి రూ.1,08,000 విరాళంగా అందజేశాడు. మందిర గౌరవాధ్యక్షుడు గౌతంరెడ్డి మాట్లా డుతూ.. యాదిరెడ్డి ఇప్పటికే ఆలయంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి వెండి ఆభరణాలు చేయించటమే కాకుండా నిత్య అన్నదానానికి రూ.లక్ష విరాళం అందజేసినట్లు గుర్తు చేశారు. యాదిరెడ్డి మాట్లాడుతూ.. తనకు భక్తులు వేసిన ప్రతీ రూపాయిని భద్రపరచి.. దేవాలయంలో సేవలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇస్తున్నట్టు తెలిపారు. -
బాబా హుండీలో భారీ కానుక
షిర్డీ: షిర్డీ సాయి బాబాకు ఓ అజ్ఞాత భక్తుడు భారీ కానుకను సమర్పించుకున్నాడు. గుర్తు తెలియని భక్తుడొకడు ఖరీదైన కానుకను చిన్న ప్లాస్టిక్ కవర్లో చుట్టి హుండీలో వేశాడు. అందులో విలువైన డైమండ్ నెక్లెస్ ఉంది. హుండీ లెక్కింపు సందర్భంగా ఆ విలువైన కానుకను చూసి దేవాలయ బోర్డు సభ్యుల ఆశ్చర్యానికి గురయ్యారు. మొదట దానిని మామూలు ఆభరణంగానే దేవాలయ అధికారులు భావించారు. అయితే అది డైమండ్ నెక్లెస్ అని తెలుసుకున్న తర్వాత ఆలయ అధికారులు... దాని విలువ లెక్క కట్టేందుకు ముంబైలోని ప్రముఖ నగల వ్యాపారలను సంప్రదించాల్సి వచ్చింది. దాదాపు 9 క్యారట్ల విలువైన ఈ బంగారు ఆభరణం విలువ సుమారు రూ.85 లక్షలుగా వారు నిర్ధారించారు. మొదట ఆ ఆభరణం విలువ మామూలుగానే ఉంటుందని అనుకున్నామని, తీరా రూ.85 లక్షలు ఉందని తెలియడంతో ఆశ్చర్యానికి గురయినట్లు ఆలయ అధికారి నరేష్ మెహతా తెలిపారు. -
పరవశించిన భక్తజనం
♦ రెండో రోజు భారీగా తరలివచ్చిన సాయి భక్తులు ♦ నేటితో ముగియనున్న గురుపౌర్ణమి ఉత్సవాలు ♦ ఉట్టి ఉత్సవాలతో ఘనంగా ముగింపు సాక్షి ముంబై : గురుపౌర్ణమి ఉత్సవాలతో షిర్డీ పుణ్యక్షేత్రం శుక్రవారం జనసంద్రమైంది. భారీగా తరలివచ్చిన భక్తజనం సాయి దర్శించుకుని పరవశించారు. సాయిబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో ఈ రోజు ప్రధానం కావడంతో పలు కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. దీంతో షిర్డీ పురవీధులన్ని భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం ‘శ్రీ సాయి సచ్ఛరిత్ర’ పవిత్ర గ్రంథం అఖండ పారాయణం సమాప్తి అయింది. అనంతరం శ్రీసాయి చిత్రపటం, పోతి (ధాన్యపు సంచి)ని ఊరేగించారు. సాయిబాబా సంస్థాన్ అధ్యక్షుడు, జిల్లా కోర్టు జడ్జి వినయ్ జోషీ ‘పోతి’ చేతబట్టుకోగా, మందిరం కార్యనిర్వహణ అధికారి (ఈవో) రాజేంద్ర జాదవ్, డిప్యూటీ ఈవో అప్పాసాహెబ్ షిండే సాయి చిత్రపటాన్ని చేతపట్టుకున్నారు. సాయిబాబా మందిర పరిసరాల్లోని ఐదు మందిరాలు గురుస్థాన్ మందిరంతోపాటు శని మందిరం, గణపతి మందిరం, మహాదేవ్ మందిరం, నందాదీప్ మందిరాలకు సాయిభక్తుడు విజయ్ కుమార్ సహకారంతో బంగారు పూతను అద్దారు. శ్రీ సాయి సచ్ఛరిత్రను మరాఠీ నుంచి గుజరాతీలోకి హీనాబెన్ మెహతా అనువదించారు. ఈ గ్రంథాన్ని ఈవో రాజేంద్ర జాదవ్, డిప్యూటీ ఈవో అప్పాసాహెబ్, హీనాబేన్ మెహతా సమక్షంలో అవిష్కరించారు. ఢిల్లీలోని తన మొత్తం ఆస్తిని బాబా సంస్థాన్‌కు విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్న సుధాకిరణ్‌ను ఈ సందర్భంగా సత్కరించారు. భక్తులు అందజేసిన విరాళాలతో షిర్డీ వచ్చే వారందరికీ ఉచిత ప్రసాదం, భోజనం అందిస్తున్నారు. గురుపౌర్ణమి ఉత్సవాల చివరి రోజైన శనివారం గురుస్థాన్ ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అదే విధంగా ఉట్టిఉత్సవాలు, ప్రత్యేక కీర్తనల కార్యక్రమాలు ఉండనున్నాయి. -
ఘనంగా గురు పూర్ణిమ పూజలు
కర్నూలు (బేతంచెర్ల) : కర్నూలు జిల్లా బేతంచెర్ల పట్టణానికి సమీపాన కర్నూల్ రహదారిలో వెలసిన షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ మహోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఐదున్నర గంటలకు ఓంకార ప్రణవం, బాబాకు కాకడ హారతి, సుప్రభాత సేవ, ఆరున్నర గంటలకు బాబాకు అభిషేకం, విష్ణుసహస్రపారాయణము, అష్టోత్తర శతనామావళి, మహామంగళహారతి, ఎనిమిదిన్నర గంటలకు బాబా వారికి రూ.5 నాణెములతో తులభార కార్యక్రమము, 9 గంటలకు సత్యసాయి వ్రతము నిర్వహించారు. పట్టణంలోని ఆయా కాలనీల భక్తులే కాకుండా సిమెంట్ నగర్, బుగ్గానిపల్లె, కొలుములపల్లె, ఆర్ఎస్ రంగాపురం గ్రామాల నుండి కూడా అధిక సంఖ్యలో మహిళలు, భక్తాదులు హాజరు కావడంతో ఆలయం సాయినామస్మరణతో మారు మ్రోగింది. బాబా సందర్శనకు వచ్చిన సుమారు 5వేల మంది భక్తులకు మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటుచేశారు. -
గురుపౌర్ణమి ఏర్పాట్లు పూర్తి
♦ నేటి నుంచి మూడు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు ♦ శోభాయాత్రకు సర్వం సిద్ధం ♦ భక్తుల బస కోసం తాత్కాళిక టెంట్లు ఏర్పాటు సాక్షి, ముంబై : గురుపౌర్ణమి ఉత్సవాలకు షిర్డీ పుణ్యక్షేత్రం సిద్ధమైంది. ఉత్సవాలను పురస్కరించుకుని షిర్డీకి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా సాయిబాబా సంస్థాన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. భారీ స్థాయిలో భక్తులు రానున్న నేపథ్యంలో వీఐపీ, హారతి పాస్‌లను ఉత్సవాల సమయంలో నిలిపివేయనున్నట్టు సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి రాజేంద్ర జాదవ్ వెల్లడించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా పూర్తిచేసినట్లు రాజేంద్ర జాదవ్ తెలిపారు. సాయి ధర్మశాలలో పల్లకీలతో పాదయాత్ర చేస్తూ షిర్డీ చేరుకునే భక్తులకు ఉచితంగా బస కల్పించనున్నట్టు జాదవ్ చెప్పారు. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు ఏటా షిర్డీ పుణ్యక్షేత్రానికి రాష్ట్రంతోపాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తజనం తరలివస్తారు. ఈ సారి గురుపౌర్ణమి వేడుకలు జులై 30 (గురువారం) నుంచి ఆగస్టు 1వ తేదీ(శనివారం) వరకు జరగనున్నాయి. భక్తులు బస చేసేందుకు ఆలయానికి సమీపంలో ఉన్న పార్కింగ్ లాట్, ఖాళీ మైదానాల్లో తాత్తాలికంగా టెంట్లు నిర్మించారు. తాగునీరు, తాత్కాలిక మరగుదొడ్లు, అల్పాహార కౌంటర్లు, సెల్ ఫోన్ చార్జింగ్ ఏర్పాట్లు చేశారు. 250 కిలోల లడ్డూలు... లడ్డుల కొరత రాకుండా 250 క్వింటళ్లతో లడ్డులు తయారు చేస్తున్నారు. మూడు రోజులపాటు వివిధ భక్తి కార్యక్రమాలు నిర్వహించేందుకు బాబా సమాధి మంది రం పక్కన భారీ వేదిక నిర్మించారు. ఈ మూడు రోజుల పాటు కీర్తనలు, భజనలు, సాయి సచ్చరిత పారాయణ పఠనం, గోకులాష్టమి ఉట్టి ఉత్సవం మొదలగు కార్యక్రమాలు జరగనున్నాయి. పల్లకీ ఊరేగింపు, శోభాయాత్ర కోసం అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి. ఢిల్లీకి చెందిన గౌతం సాయి, అనూప్ జోషీలు అందించిన విరాళాలతో రకరకాల పూలతో ఆలయాన్ని అలంకరించనున్నారు. ముం బైకి చెందిన సాయిరాజ్ డెకరేటర్స్ తరఫున మందిరం, ఆలయ పరిసరాలను రంగులరంగుల విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. భక్తుల విరాళాలతో.. సాయి భక్తులు సమర్పించిన విరాళాలతో మూడు రోజులపాటు ఉచిత భోజనాలు (మహాప్రసాదం) ఏర్పాటు చేశారు. లక్నోకు చెందిన విక్రమ్ కపూర్, హైదరాబాద్‌కు చెందిన శివానీ దత్, సి.సురేశ్ రెడ్డి, సహానా, ముంబైకి చెందిన అధ్యన్ నారంగ్, చెన్నైకి చెందిన రాజగోపాల్ నటరాజన్, విజయవాడకు చెందిన రతన్ మాణిక్యం, విశాఖపట్నానికి చెందిన కె.రమణమూర్తి, మాధవి, తిరుపతికి చెందిన భట్యాల చంగల్రాయుడు, బెంగళూర్‌కు చెందిన రాధాకృష్ణయ్య, అమర్‌నాథ్‌లతోపాటు పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఏర్పాటు భక్తులకు వైద్యసేవలు అందించేందుకు మూడు ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లు, రెండు షిప్టుల్లో వైద్యులను అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వయం సేవా సంస్థల కార్యకర్తలు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, హోంగార్డులు తదితర బలగాలు భక్తులకు అందుబాటులో ఉండనున్నారు. -
31న రోజంతా షిర్డీ సాయి దర్శనం
సాక్షి, ముంబై: నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న బుధవారం రోజంతా షిర్డీ సాయిబాబా ఆలయాన్ని తెరిచే ఉంచనున్నారు. లక్షలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సాయి సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి రాజేంద్ర జాదవ్ చెప్పారు. ‘‘బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రి వరకు నిరంతరంగా బాబా దర్శనం ఉంటుంది. కేవలం ఆరతి సమయంలో 15 నిమిషాలపాటు క్యూను నిలుపుతారు’’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం షిర్డీలో విపరీతమైన చలి ఉంది. ఈ నేపథ్యంలో చలిని తట్టుకునేందుకు భక్తులకు అదనంగా చద్దర్లు, తివాచీలు సమకూర్చడంతో పాటు తాగునీరు, స్నానాల గదులు, మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నామన్నారు. రెండు పూటలా భోజనం, ఉదయం అల్పాహారం, టీ, కాఫీ, లడ్డు ప్రసాదం కోసం అదనంగా కూపన్ విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. -
ఆలయ పూజల్లో పాల్గొన్న సీఎం సతీమణి
నక్కపల్లి: సీఎం చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి గురువారం నక్కపల్లి మండలంలోని చినదొడ్డిగల్లు, ఉపమాక వచ్చారు. షిర్డీ సాయి ఆలయంలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఇదేరోజు చంద్రబాబునాయుడు జన్మనక్షత్రం కావడంతో బాబుగోత్రనామాలతో హోమాలు, పూజలు చేయించారు. గ్రామ ఉపసర్పంచ్ బివి రమేష్‌రాజు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని భువేనేశ్వరి ప్రారంభించారు. అనంతరం ఆమె ఉపమాక వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రధానార్చకులు వరప్రసాద్ క్షేత్రమహత్యాన్ని వివరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆమె పర్యటనలో అనకాపల్లి ఎంపీ ఎం శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వంగలపూడి అనిత,జడ్పి చైర్పర్సన్ లాలం భవానీ,ఎంపిపిలు వినోద్‌రాజు, లావణ్య, జిల్లాగ్రంధాలయసంస్ద మాజీ చైర్మన్ తోటనగేష్, పార్టీ సీనియర్ నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్, రెడ్డిరామకృష్ణ, బాబ్జిరాజు, మీగడసత్తిబాబు, కురందాసు నూకరాజు, కానీనాయుడు, సర్పంచ్ శ్రీనివాసరావు, ఎంపిటీసి ఈశ్వరరావు,ఆర్డివో సూర్యారావు, ప్రత్యేకాధికారి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ...
రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి తొమ్మిది మందికి గాయాలు సాక్షి, ముంబై: పుణే-నాసిక్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. షిర్డీ సాయిని దర్శనం చేసుకుని కొంత మంది బోలేరో వాహనంలో తిరిగి ఇంటికి వెళుతుండగా ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడ్డారు. మృతులను నాసిక్ జిల్లా ఇగత్‌పూర్ తాలాకాకు చెందిన వాజే కుటుంబసభ్యులు పాండరంగ్ వాజే (35), వనితా వాజే (25), రోహినీ వాజే (3)లతోపాటు బైరవ్ పడవల్ (60), కాలు పడవల్ (25), సరిత పడవల్ (5), ఆరే పడవల్ (8)లుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన డ్రైవర్ గోరఖ్ వాజేతోపాటు మొత్తం తొమ్మిది మంది స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసుల కథనం ప్రకారం...అహ్మద్‌నగర్ జిల్లా ఘార్గావ్ పోలీసు స్టేషన్ పరిధిలోని బోర్ఘాట్ శివార్లలో సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో విఠ్టల్ కామత్ హోటల్ సమీపంలో ప్రమాదం జరిగింది. పుణేవైపు వెళ్తున్న ఓ ట్రక్కు రాంగ్ సైడ్‌లో వచ్చి బోలేరో వాహనాన్ని వేగంగా ఢీకొంది. నిద్రలో ఉన్న వారు ఉలిక్కిపడేలేచినప్పటికీ ఏమిజరిగిందో తెలుసుకునేలోపే తమ బంధువులు రక్తం మడుగులో కన్పించారు. అనంతరం ట్రక్కు డ్రైవర్ పారిపోయాడు. ఘార్గవ్ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
షిర్డీ ఆలయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు లేఖ
ముంబై/ఇండోర్(పిటిఐ): ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని పేల్చివేస్తామని షిర్డీ ట్రస్ట్‌కు వచ్చిన ఓ బెదిరింపు లేఖ కలకలం సష్టించింది. నవంబర్ 9న షిర్డీ ఆలయంతోపాటు ముంబైలో ఠాక్రే నివాసమైన మాతోశ్రీని కూడా పేల్చేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు రాసిన లేఖ వచ్చిందని పోలీసులు చెప్పారు. అదేరోజున ముంబై దాదర్‌లోని శివసేన కార్యాలయాన్ని, శివాజీ పార్క్ మైదానంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రేకు అంత్యక్రియలు జరిగిన ప్రాంతాన్ని, ఇండోర్‌లోని ప్రముఖ ఖజ్రానా గణేష్ ఆలయాన్ని కూడా బాంబులతో పేల్చేస్తామని హిందీలో రాసిన ఆ లేఖలో హెచ్చరించారు. దీంతో అటూ బాబా సంస్థాన్ పదాధికారుల్లో ఇటూ శివసైనికుల్లో కలవరం మొదలైంది. సోమవారం సాయిబాబా పుణ్యతిథి ఉత్సవాలు ముగిశాయి. భారీగా తరలివచ్చిన లక్షలాది భక్తులు ఇంకా తిరుగుముఖం పట్టలేదు. అంతలోనే బాంబులతో ఆలయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు లేఖ రావడం భక్తుల్లో కలవరం సష్టించింది. ఈ లేఖ మంగళవారం రాత్రి 9.30 గంటలకు కొరియర్ ద్వారా తమకు అందిందని షిర్డీ ట్రస్ట్ తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ అధికారి అజయ్ మోరే విలేకరులకు తెలిపారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఆలయంలోకి సెల్ఫోన్లను అనుమతించకుండా నిషేధం విధించారు. నవంబరు 9న రాత్రి 9.11 గంటలకు సాయి సమాధి మందిరాన్ని, 9.22 గంటలకు సేనా భవన్, ఆ తరువాత 10 నిమిషాలకు ముంబైలోని శివాజీపార్క్‌లో శివసేన అధినేత బాల్ ఠాక్రే అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతాన్ని పేల్చివేస్తామని ఆ లేఖలో రాశారు. ఇండోర్‌లో ఖలీల్ అనే వ్యక్తితోపాటు అతని బంధువును చంపినందుకు నిరసనగా ఈ పేలుళ్లు జరుపుతామని లేఖలో హెచ్చరించారు. దీనిపై దర్యాప్తు జరిపేందుకు రెండు బృందాలను నియమించామని అహ్మద్‌నగర్ ఎస్పీ రావ్‌సాహెబ్ షిండే చెప్పారు. ఇండోర్‌లోని గణేష్ గుడి వద్ద కూడా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ గర్భగుడిలోకి భక్తులను అనుమతించకుండా నిషేధం విధించినట్లు ఆలయ నిర్వాహకులు చెప్పారు.