
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీతోపాటు దేశంలోని అన్ని సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు సాయిబాబా ఆలయాలకు భారీగా తరలివస్తున్నారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని సాయిబాబా ఆలయాలను సుందరంగా అలంకరించారు. సాయినామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
షిర్డీలో సోమవారం గురుపౌర్ణమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్కడ మూడు రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని బాబా సమాధి ఆలయాన్ని వివిధ రంగుల విద్యుత్ దీపాలతో, రకరకాల పూలతో చూడముచ్చటగా అలంకరించారు. ఆలయంతోపాటు షిర్డీ పుర వీధులన్ని భక్తులతో పులకించిపోతున్నాయి.