సిడ్నీలో ఘనంగా పుస్తక ఆవిష్కరణ..! | Book launch event in Sydney, Australia | Sakshi
Sakshi News home page

సిడ్నీలో ఘనంగా పుస్తక ఆవిష్కరణ..!

Published Sat, Jul 27 2024 1:16 PM | Last Updated on Sat, Jul 27 2024 1:16 PM

Book launch event in Sydney, Australia

గురు పౌర్ణమి జూలై 21 వ తేదీ వినూత్నంగా సిడ్నీ మహానగరంలో తొలి పుస్తక ఆవిష్కరణ మహోత్సవం. ఒకటి కాదు, రెండు పుస్తకాలు. సిడ్నీ తెలుగింటి ఆడపడుచుగా ఆస్ట్రేలియా లోనే  మొదటి రచయిత్రి కథా సంపుటి 'నీ జీవితం నీ చేతిలో' 21 కథల సమాహారం. పాఠకులకు సందేశాన్ని, వినోదాన్ని, కనువిప్పును, స్ఫూర్తి ని నింపే కథలు అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరూ చేతిలోకి తీసుకోవలసినదే 'నీ జీవితం నీ చేతిలో'.రెండో పుస్తకం 'రంగానందలహరి' శ్రీ పెయ్యేటి రంగారావు గారు అందిస్తున్న94 భక్తిగీతాలు, భావ గీతాలు ప్రతి ఇంటిలో ఉండవలసిన భాషా కుసుమాలు. లండన్ డర్రీ నైబర్ హుడ్ కమ్యూనిటీ సెంటర్ లో మధ్యాహ్నం 2.30 గంటలకు సకల కళా దర్శిని సిడ్నీ, ఆస్ట్రేలియా వారు నిర్వహించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. 

ఈ కార్యక్రమంలో శ్రీ పెయ్యేటి రంగారావు గారు రచించిన పాటలు, పద్యాలు, భావగీతాలు కళాకారులు శ్రీ వద్దిపర్తి శ్రీనివాస్ గారు, చిన్నారులు ఆశ్రిత గరగ, శ్రిత భాగవతుల ఆలపించారు. మయూర అకాడమీ గురువులు శ్రీ రమణ కరణం గారు కొరియోగ్రఫీ, డా. పద్మ మల్లెల సంగీతం సమకూర్చిన శ్రీ పెయ్యేటి రంగారావుగారి శ్రీ సీతా రాముల పరిణయ వేడుక గీతాన్ని అనిరుధ్ కరణం, లోహిత గొళ్లపల్లి కూచిపూడి నృత్యం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.నృత్యాలయ డాన్స్ టెంపుల్ నుంచి విద్యార్థులు భరతనాట్యం ఫ్యూజన్ నృత్యం తో అందరినీ అలరించారు. లాలిత్య, సౌమ్య, సంతోషి గార్లు గణేశ, సరస్వతీ ప్రార్థన తో నృత్య అభినయంతో కార్యక్రమానికి శుభారంభం చేసారు. కార్యక్రమానికి సుశ్మిత విన్నకోట వ్యాఖ్యాత గా వ్యవహరించారు.

సకల కళా దర్శిని అధ్యక్షురాలు శ్రీమతి విజయ గొల్లపూడి మాట్లాడుతూ, జూలై 2022 వ సంవత్సరంలో పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ఆశీస్సులతో సకల కళా దర్శిని, సిడ్నీ, ఆస్ట్రేలియా సకల కళలకు వేదికగా నెలకొల్పటం జరిగింది అన్నారు. ఇంకా ఈ సకల కళాదర్శిని వేదికపై గత ఫిబ్రవరిలో ప్రముఖ లలిత సంగీత గాయని శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారి తో, పేరొందిన లలిత సంగీత కళాకారులతో గాన విభావరి నిర్వహించాము. ప్రస్తుతం మన సనాతన ధర్మ ప్రచారం లో భాగంగా భగవద్గీత పారాయణ నెల నెల ఒక అధ్యాయం చొప్పున ప్రపంచ వ్యాప్తంగా నెల నెల నిర్వహించటము జరుగుతోంది. ఇప్పటివరకు ఐదు అధ్యాయాలు జయప్రదంగా జరుపుకున్నాము.

వచ్చే ఆదివారం ఆరవ అధ్యాయ పారాయణ జరుపుకోబోతున్నాము.ఈ సకల కళా దర్శిని నెల కొల్పటంలో ముఖ్య ఉద్దేశ్యం మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్యం ఎంతో అమూల్యమైనవి, తరగని విలువైన సంపద. ఇది తర తరాలకు అనంత వాహిని లా ప్రవహించేలా అందచేయటం బాధ్యతగా భావించాను. అమ్మ భాషతో అనుబంధం ఉండాలి. మన తెలుగునాట అద్భుతమైన కళాకారులు ఉన్నారు. వారి లోని కళా నైపుణ్యాన్ని గుర్తిస్తూ, ప్రపంచానికి తెలియచేయాలి. అలాగే స్థానికంగా ఉన్న చిన్నారులు, కళాకారులకు కూడా ఈ సకల కళా దర్శిని ఒక చక్కని వేదికగా నిలవాలి అనే అకాంక్ష. ముఖ్యంగా సాహిత్యం, మన తెలుగు భాషా, సంస్కృతులు పరిమళాలు ఎల్లెడలా వ్యాపించాలి. 

మన మాతృభూమికి దూరంగా ఉంటున్నాము అన్న వెలితి లేకుండా, ఎక్కడ ఉన్నా తెలుగు వారమే, ఖండ ఖండాతరాలలో మన తెలుగు ఉనికిని, ప్రతిభా పాటవాలను చాటుకుంటు, అటకెక్కకుండా అవకాశాలను ఏర్పరుచుకోవడమే ముఖ్య ఆశయం అని సకల కళా దర్శిని సంస్థ లక్ష్యాలను విశదీకరించారు.విజయ మాధవి గొల్లపూడి రచించిన కథల సంపుటి 21 కథలు, జూలై 21 వ తేదీన పవిత్ర గురు పౌర్ణమి రోజున ‘టేస్ట్ ఆఫ్ ఇండియా’ రెస్టారెంట్ గ్రూప్ అధినేత ‘రాజ్ వెంకట రమణ’ చేతులతో పుస్తక ఆవిష్కరణ చేసారు.‘నీ జీవితం నీ చేతిలో’ కథల సంపుటి కి ప్రముఖ చిత్ర కళాకారులు శ్రీ కూచి సాయి శంకర్ గారు ముఖ చిత్రాన్ని అందించారు.

పుస్తకం లోని గురువచనం ముందుమాటగా ‘ప్రియమైననీకు’ లేఖారూప కథ తీపి జ్ఞాపకాల స్నేహబంధాన్ని వివరించిన తీరు మధురంగా ఉంది. ఇలా ఒక్కో కథలో ఒక్కోప్రత్యేకత, సున్నితమైన భావాలు, మానవీయత, విలువలు కలిగిన జీవితం లోని పరమార్థం…వంటి సార్వకాలీన, సార్వజనీన విషయాలను మృదువైన, శక్తివంతమైన శైలిలో, హృదయానికి హత్తుకునేలా రచించిన రచయిత్రి సంస్కారానికి, ప్రతిభకి అభినందనలు” అని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి మాటలను చదివి వినిపించారు సుశ్మిత.శ్రీమతి చావలి విజయ ‘నీ జీవితం నీ చేతిలో’ 21 కథల సారాంసాన్ని, రచయిత్రి శైలిని వివరిస్తూ, చక్కని సమీక్ష ను అందచేసారు. రచయిత్రి విజయ గొల్లపూడి గారికి సీస, తేటగీతి పద్యమాలికలతో శ్రీమతి విజయ చావలి గారు అభినందన మందారమాలను అందచేశారు.  

గతంలో తెలుగు పలుకు పత్రికకు 15 ఏళ్ళు సంపాదకునిగా వ్యవహరించిన శ్రీ నారాయణ రెడ్డి గారు కూడా ‘నీ జీవితం నీ చేతిలో’ కథల సంపుటిపై పుస్తక సమీక్ష చేశారు.కవి, రచయిత శ్రీ పెయ్యేటి రంగారావు గారు రచించిన ‘రంగానందలహరి’ పుస్తకాన్ని ఎసెట్ పాయింట్ హోమ్స్ సంస్థ అధినేత రామ్ వేల్ గారు ఆవిష్కరించారు.రంగానందలహరి పుస్తకానికి ప్రణవి గొల్లపూడి ముఖచిత్రాన్ని అందించారు. రంగానందలహరి లోని కావ్య గీతికలను తెలుగు పండితులు శ్రీ తూములూరి శాస్త్రి గారు సమీక్ష చేసారు. తెలుగు భాషాభిమానులను ఈ పుస్తకం అందరినీ చదివింపచేస్తుంది. రాకేందు శేఖరా, ఏడుకొండల ఏలికా రంగానందలహరి లో రచయిత వాడిన పదప్రయోగాలపై శ్రీ పెయ్యేటి రంగారావు గారిని ప్రశంసించారు.శ్రీ తూములూరి శాస్త్రి గారు రంగారావుగారికి అభినందనలతో ప్రశంసా పత్రాన్ని అందించారు.


గీ.    తెలుగు పదముల సొగసులు తీయదనము
    వెలుగు జిలుగులు ఆనంద వీచికలతొ
    రంగరించిన కవితా తరంగ రంగ
    విహరి! ఈ రంగ యానంద లహరి లహరి!  
సీ.    భక్తిభావము నించ పదకవితాపితా
            మహుడు కొండొకచోట మదిని నిల్చు
    సందేశములు పంచ సందోహమెంచగా
            గురజాడ జాడలే గుర్తు తెచ్చు
    మానవతావాద మహితోక్తు లందించ
            నాయని నండూరి నడకలెచ్చు
    భావకవిత్వంపు పరువాలు పండించ
            దేవులపల్లియే దీప్తినిచ్చు
గీ.    భక్తి ఆసక్తి సంసక్తి రక్తి యుక్తి
    నించి మించిన సాహితీ నియత శక్తి
    భావ విద్వత్ స్వభావ ప్రభావ మంత 
    రంగరించిరి కవితల రంగరాయ!
క.    తియ్యని కవితా విరులతొ
    నెయ్యము సేయంగ మిగుల నేర్పరులౌగా
    పెయ్యేటి రంగరాయా!
    వెయ్యారుల వందనములు వినతులు సేతున్!
                    
వేద పండితులు శ్రీ నేతి రామకృష్ణ గారు రంగానందలహరి కావ్యగీతికలను సమీక్ష చేసారు. వేదికపై అలంకరించిన రచయితలకు, పండితులకు పుష్పగుచ్ఛం, శాలువాలతో సత్కరించారు.కార్యక్రమానికి విచ్చేసిన డా. చెన్నప్రగడ మూర్తి, డా. జ్యోతి, సిడ్నీ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ ఓలేటి మూర్తి గారు, శ్రీ పోతుకూచి మూర్తిగారు కళాకరులందరికీ ప్రశంసా పత్రాలను అందచేసారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement