షిరిడీలో కొలువై ఉన్న సాయిబాబాను భక్తులు ప్రత్యక్ష దైవంగా కొలుస్తుంటారు. దేశం నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు మహారాష్ట్రలోని షిరిడీ వెళ్లి బాబాను దర్శించుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల భక్తుల కోసం భారీ స్థాయిలో మరో షిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించినట్లు నామక్కల్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ అధినేత, ‘దక్షిణాది షిరిడీ సాయిబాబా ఆలయ’ బోర్డు చైర్మన్ కే చంద్రమోహన్ తెలిపారు. ఈనెల 8న వెయ్యిశంఖాలతో మండలపూజ నిర్వహించనున్న సందర్భంగా ఆలయ నిర్మాణానికి దారితీసిన అనుభవాలు, అనుభూతులను మీడియాకు వివరించారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘అందరు దేవుళ్లను సాధారణంగా కొలవడమేగానీ షిరిడీ బాబా పట్ల ప్రత్యేకమైన భక్తిప్రపత్తులు ఉన్నవాడిని కాదు. ఒకరోజు స్నేహితునితో కలిసి 2008లో షిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని వచ్చాను. కొద్ది రోజుల్లోనే నాకు ఒక అద్భుతమైన కల వచ్చింది. కలలో ఒక పాప నన్ను ఉద్దేశించి బాబా ఆలయాన్ని నిర్మించాలని కోరింది. ఆలయ నిర్మాణానికి అనువైన స్థలం మీ ఊరికి సమీపంలోనే ఉందంటూ ఒక వేపచెట్టు, పక్కనే బండరాయి, సమీపంలో తాటిమాను ఉన్న ప్రాంతాన్ని చూపింది. ఉలిక్కిపాటుతో మేల్కొన్న నేను కలలో చూసిన ప్రాంతం కోసం ఎంతగానో అన్వేషించగా తిరుచ్చిరాపల్లి జిల్లా అక్కరపట్టి, సమయపురం, టోల్‌గేట్ సమీపంలో సరిగ్గా అదేస్థలం కనపడింది. ఆ స్థల యజమానైన ఒక రైతు ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు నిరాకరించాడు. బాబా ఆదేశాల ప్రకారం అక్కడే నిర్మించడం ఎలాగని ఆలోచనలో పడగా సరిగ్గా వారం రోజుల తరువాత అదే రైతు నన్ను వెతుక్కుంటూ వచ్చి అర ఎకరా స్థలాన్ని ఇవ్వడం విశేషం. వెంటనే 2009లో చిన్నపాటి షిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించాను. పెద్ద సంఖ్యలో భక్తుల రాక పెరగడంతో అన్నదాన కార్యక్రమాలను చేపట్టాను.
షిరిడీ పద్ధతుల్లో రోజుకు మూడు సార్లు అదే భాషలో హారతులు ప్రవేశపెట్టి పెద్ద ఆలయాన్ని నిర్మించాలని 2016లో నిర్ణయించుకున్నాను. జర్మనీ నుంచి అత్యంత ఖరీదైన అలంకరణ రాళ్లను తెప్పించి రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ ఆలయ నిర్మాణం పూర్తికాగా జనవరిలో కుంభాభిõÙకం చేసి బాబాకు అంకింతం చేశాం. కుంభాభిõÙక మహోత్సవానికి తమిళనాడుతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 80 వేల మంది భక్తులు హాజరైనారు. ఆలయానికి అనుబంధంగా శాశ్వత ప్రాతిపదికన ఉచిత వైద్యం, వృద్ధాశ్రమం నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాన’ని ఆయన తెలిపారు.
ఆలయంలో భక్తులు
మహిమాన్వితుడైన బాబా
ఆలయ నిర్మాణం తలపెట్టినప్పటి నుంచి బాబా ఆశీస్సులతోపాటు ఎన్నో మహిమలు చోటుచేసుకున్నాయని చంద్రమోహన్ తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల బాబా జన్మస్థలంపై వివాదం తలెత్తగా షిరిడీలోని బాబా ఆలయాన్ని మూడు రోజులపాటు మూసివేశారు. అనుకోకుండా అవే మూడు రోజుల్లో ఇక్కడి కొత్త ఆలయంలో బాబాకు కుంభాభిషేకం జరగడం అనూహ్యమైన పరిణామం. తిరుపతి నుంచి చెన్నైకి కారులో వస్తూ పూందమల్లికి 10 కి.మీ దూరంలో రోడ్డుపక్కన ఉన్న ఒక పెద్ద బోర్డును చూసి ఆలయ ప్రచారానికి ఎంత ఖరీదైనా చెల్లించి వాడుకోవాలని ఆశించగా వారు నిరాకరించారు. ప్రయాణం సాగుతుండగానే కొద్దిసేపట్లో వారే ఫోన్ చేసి ఉచితంగా ఇస్తామన్నారు. మరికొద్ది దూరంలో మరో బోర్డును దాని యజమాని కూడా ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు.
8న మండల పూజ
కుంభాభిషేకం ముగిసిన సందర్భంగా ఈనెల 8వ తేదీన వెయ్యి శంఖాలతో మండల పూజను చేపడుతున్నట్లు దక్షిణాది షిరిడీ సాయిబాబా ఆలయ బోర్డు సభ్యులు, ఆలయ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇన్‌చార్జ్ టి సురేష్ తెలిపారు. అనతికాలంలోనే ఆలయ విశిష్టత నలు చెరగులా ప్రచారం కావడంతో తమిళనాడు టూరిజం శాఖలో చేర్చారు. అంతేగాక భక్తుల సౌకర్యార్థం తిరుచ్చిరాపల్లి నగరం నుంచి ఆలయం వద్దకు టూరిజంశాఖ ఉచిత బస్సులను నడుపుతోంది. ఆలయ సందర్శనార్థం వచ్చే తెలుగువారు 9600005060 సెల్‌ఫోన్ నంబరులో సంప్రదిస్తే అవసరమైన సహాయ సహకారాలు అందజేయగలనని సురేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment