రూ.180 కోట్లకు లెక్కల్లేవ్! | Problems caused by internal audit reviews | Sakshi
Sakshi News home page

రూ.180 కోట్లకు లెక్కల్లేవ్!

Published Tue, Feb 10 2015 1:41 AM | Last Updated on Mon, Jul 29 2019 6:07 PM

రూ.180 కోట్లకు లెక్కల్లేవ్! - Sakshi

రూ.180 కోట్లకు లెక్కల్లేవ్!

టీటీడీలో పేరుకుపోయిన ఆడిట్ అభ్యంతరాలు  
కొందరు విభాగాధిపతుల నిర్లక్ష్యంతో పెరుగుతున్న అభ్యంతరాల చిట్టా
{పతి రెండు నెలలకు బదులు ఆరు నెలలకోసారి ఇంటర్నల్ ఆడిట్ సమీక్షల వల్లే సమస్యలు
ఆడిట్ నిపుణులతో నేడు ఈవో సమీక్ష

 
 శ్రీవారి భక్తుల కానుకలతో నడిచే టీటీడీ వ్యవహారాలు కంచే చేను మేసే చందంగా తయారయ్యాయి. లోపభూయిష్టమైన ఆడిట్ వ్యవహారాల వల్ల టీటీడీలో దాదాపుగా రూ.180 కోట్లకు సరైన లెక్కల్లేవు. సుమారు రెండు దశాబ్దాలుగా ఆడిట్ అభ్యంతరాలున్నాయని ఇప్పటికే నిపుణులు తేల్చినా.. అలాంటి పరిస్థితులే పునరావృతం అయ్యేలా టీటీడీ తయారైందని విమర్శలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
 
తిరుమల: సుమారు రూ.2,400 కోట్ల బడ్జెట్‌తో కూడిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో మినీ గవర్నమెంట్ తరహాలో ఖర్చులు, వాటికి సంబంధించిన పద్దులు సాగుతుంటాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీటీడీ నిర్వహించే అన్ని రకాల పద్దులకు ఇంటర్నల్ ఆడిట్, మలి దశలో రాష్ట్ర ప్రభుత్వ ఆడిట్ చేయాల్సి ఉంటుంది. అన్నీ సవ్యంగా ఉంటేనే ఆయా పద్దులకు క్లియరెన్స్ ఉంటుంది. లేకుంటే అభ్యంతరాలు తలెత్తుతాయి. అలాంటి అభ్యంతరాలు గుర్తించి సకాలంలో పరిష్కరించుకోగలితే ఎలాంటి సమస్యా రాదు. లేకుంటే అభ్యంతరాలు సాగుతూనే ఉంటాయి. అయితే, టీటీడీలో ఉండే దాదాపు అన్ని విభాగాల్లోనూ ఆడిట్ ఆభ్యంతరాలున్నాయి. అభ్యంతరం లేని విభాగం లేదంటే అతిశయోక్తి లేదు. ఖర్చుకు, అందుకు సంబంధించిన పద్దుకు సరైన ఆధారాలు, పత్రాలు లేకపోవడం, ఎదురైన అభ్యంతరాలను పరిష్కరించడంలో సంబంధిత విభాగాధిపతి నిర్లక్ష్యం, పద్దుకు సంబంధించి టీటీడీ బోర్డు అనుమతిలో పెండింగ్ ఉండడం, ప్రభుత్వ అనుమతిలో జాప్యం ఉండటం.. ఇలా ఎన్నో కారణాలతో అభ్యంతరాల చిట్టా చాంతాండంత పెరిగిపోతూనే ఉంది. ఇలా రెండు దశాబ్దాల కాలంగా దాదాపు మొత్తం రూ.180 కోట్లకు సంబంధించి టీటీడీ పద్దుల్లో అభ్యంతరాలున్నట్టు గతంలోనే నిపుణులు గుర్తించారు. ఇదే విషయాన్ని ప్రస్తుత రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా అంగీకరించారు. 2004కు ముందు ఇదే శాఖ నిర్వహించి రోజుల్లోనూ, ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉంటూ శాసనసభ పద్దుల కమిటీకి ప్రాతినిథ్యం వహిస్తూ టీటీడీ సమీక్షల్లోనూ ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అభ్యంతరాలు పరిష్కరించడంలో టీటీడీ తీవ్ర జాప్యం చేస్తోందని విమర్శలు గుప్పించారు. టీటీడీ ఆడిట్ అభ్యంతరాల పరిష్కరించడంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘కాగ్’ కూడా సమీక్ష  చేయించాలని ప్రతిపాదనలు వచ్చాయి.

ఇంటర్నల్ ఆడిట్‌లోనూ టీటీడీ అధికారుల నిర్లక్ష్యం

ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీటీడీ చేసే ఖర్చుల లెక్కల పద్దులు తేల్చడంలో ఎప్పటికప్పుడు ఆయా విభాగాలకు నేతృత్వం వహించే ఉన్నతాధికారులు చొరవ చూపాలి. ఆ తర్వాత ప్రతి రెండు నెలలకొకసారి టీటీడీ ఈవో, ఇద్దరు జేఈవోల నేతృత్వంలో ఇంటర్నల్ ఆడిట్ సమావేశాలు నిర్వహించాలి. ఇలాంటి కనీస సమావేశాలు కూడా లేకపోవడం వల్లే గోవిందుని కొలువులో కానుకల రూపంలో భక్తులిచ్చిన రూ.180 కోట్ల అభ్యంతరాలు మురుగుతూనే ఉన్నాయి. భవిష్యత్‌లో అలాంటి పరిస్థితి కొనసాగకుండా ఈవో స్థాయి అధికారుల్లో ఒకరిద్దరు ప్రయత్నించినా పూర్తి స్థాయిలో చొరవ చూపలేకపోయారనే విమర్శలున్నాయి.

ఆడిట్ అభ్యంతరాలపై ఈవో సాంబశివరావు సీరియస్.. నేడు నిపుణులతో సమీక్ష

ప్రభుత్వ శాఖల్లో సమర్థవంతంగా పనిచేసిన అధికారిగా పేరున్న ప్రస్తుత టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు పేరుకుపోయిన ఆడిట్ అభ్యంతరాలను తీవ్రంగా పరిగణించారు. గతానికి సంబంధించి లెక్కల అభ్యంతరాలు పరిష్కరించడం, లెక్కలు లేని విభాగాలపై సంబంధితులపై చర్యలు తీసుకోవడం, భవిష్యత్ ఆడిట్ అభ్యంతరాలకు అవకాశం లేకుండా చేయడంపైనే ప్రధానంగా దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఆడిట్‌లో సుదీర్ఘ అనుభవం కలిగిన నరసింహన్, శరత్‌కుమార్ నేతృత్వంలో సోమవారం తిరుపతి పరిపాలన భవనంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు  అన్ని విభాగాలతో సమీక్షించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు  ఇద్దరు జేఈవోలతో కలసి నిపుణులతో బేటీ అయ్యి అభ్యంతరాలపై సుదీర్ఘంగా చర్చించాలని ఈవో సాంబశివరావు నిర్ణయించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement