దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం | Everything ready for the festivities | Sakshi
Sakshi News home page

దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం

Published Thu, Sep 25 2014 12:00 AM | Last Updated on Mon, Jul 29 2019 6:07 PM

దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం - Sakshi

దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం

శ్రీశైలం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.

శ్రీశైలం
 అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.  గురువారం నుంచి అక్టోబర్ 3 వరకు జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలకు సన్నాహాలు పూర్తి చేశామని ఈఓ సాగర్‌బాబు బుధవారం తెలిపారు.  ఉత్సవాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంటలకు అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబాదేవిని శైలపుత్రి అలంకారరూపంలో అలంకరించి ప్రత్యేకపూజలను చేస్తారు.  శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఉత్సవమూర్తులను భృంగీవాహనంపై ఆవహింపజేసి వాహనపూజలను చేసి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 8గంటలకు శ్రీ స్వామిఅమ్మవార్లకు కల్యాణోత్సవం, ఏకాంతసేవ తదితర ప్రత్యేకపూజలు చేస్తారు.
 ఆరంభ పూజలు ఉదయం 8.30 గంటల నుంచి:
 శ్రీశైలమహాక్షేత్రంలో దేవీశరన్నవరాత్రోత్సవాలు గురువారం ఉదయం  8.30 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఆశ్వియుజ శుద్ధపాఢ్యమి ఆరంభ ఘడియల్లో యాగశాలా ప్రవేశం చేస్తారు. అనంతరం శివసంకల్పం,  గణపతిపూజ,స్వస్తి పుణ్యహవాచన, దీక్షా సంకల్పం, తదితర వివేషపూజలను నిర్వహిస్తారు. సాయంత్రం 4గంటల నుంచి పారాయణలు, జపానుష్ఠానములు, అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, నవావరణార్చన, కుంకుమార్చన తదితర ప్రత్యేకపూజలు చేస్తారు.  రాత్రి 9గంటల నుండి సువాసినీ పూజ, కాళరాత్రిపూజ, మహా మంగళహారతులు నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాద వితరణలు ఉంటాయి.  
 విద్యుత్ దీపాలంకరణ.. ఉత్సవాల సందర్భంగా శ్రీశైలాలయ ప్రాంగణం విద్యుత్ దీపాలంకరణలతో శోభాయమానంగా కనిపిస్తోంది. ప్రధాన రాజగోపురం మొదలుకొని స్వామివార్ల ఆలయప్రాంగణం వెలిగిపోతోంది.   



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement