
‘వైకుంఠా’ వాసా.. భక్తులపై కేసా !
వేంకటేశ్వరుడు అందరి వాడు... కుల, మత, లింగ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా ఏడుకొండలవాడిని ఎవరైనా దర్శించుకోవచ్చు.
ఐదు శాతమే వీఐపీలు, అర్హత లేనివారికి ఏకాదశి టికెట్లు
సామాన్య భక్తులపై కేసుతో మరోసారి తెరపైకి పాసుల గోల
టికెట్ల కేటాయింపుల్లో ధర్మకర్తల మండలి, సీఎం తమ్ముళ్ల హవా
సాక్షి, తిరుమల: వేంకటేశ్వరుడు అందరి వాడు... కుల, మత, లింగ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా ఏడుకొండలవాడిని ఎవరైనా దర్శించుకోవచ్చు. కానీ.. ‘అధికార, ధన దర్పం’ సామాన్యుడికి వేంకటేశ్వరుని దర్శనాన్ని జఠిలం చేస్తోంది. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి, గంటల కొద్ది క్యూలో నిల్చుని అలసట చెందిన భక్తుడు ఒక్క నిమిషం శ్రీనివాసుడ్ని దర్శించుకోగానే ఆ అలసటనంతా మర్చిపోతాడు. కానీ, ఆ ఒక్క నిమిషం దర్శనం కూడా గగనం చేస్తే... ఆ ఆగ్రహమే కట్టలు తెంచుకుంది. కానీ, టీటీడీ అధికారులు మాత్రం తమ తప్పును కప్పిపుచ్చునేందుకు సామాన్య భక్తులపై కేసులు పెడుతున్నారు.
- ఈసారి ఏకాదశి రోజు 8 వేల మందికి వీఐపీ టికెట్లు కేటాయించారు.
- వారిలో ఐదు శాతం మంది మాత్రమే వీఐపీలు న్నారు. మిగిలినవారు వీఐపీల పేరుతో వచ్చిన అర్హతలేని వ్యక్తులేనని టికెట్ల చిట్టా చెబుతోంది.
- టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, సభ్యులు దాదాపుగా 3వేల టికెట్లు పంచుకున్నారు. వీటిలో అధికంగా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాలకు చెందిన కార్పొరేట్ కుటుంబాలకే కేటాయించారు.
- బోర్డు సభ్యుల్లో ముగ్గురు వీఐపీ పాసులను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- సీఎం కిరణ్ పేషీ పేరుతో సుమారు 200 టికెట్లు కేటాయించారు.
- సీఎం సోదరుడు కిశోర్‌రెడ్డి, మరో సోదరుడు సంతోష్ తమ సొంత నియోజవర్గం, బంధుగణం కోసం 200 టికెట్లు కేటాయించుకుని అందరికంటే ముందుగానే శ్రీవారి దర్శనాన్ని పూర్తిచేసుకున్నారు.
- తనకు వీఐపీ టికెట్లు వద్దని పైకి చెప్పుకుంటూ వచ్చిన దేవాదాయశాఖమంత్రి సి.రామచంద్రయ్య ఆఖరి క్షణంలో టీటీడీ ఉన్నతాధికారులపై వత్తిడి చేసి సుమారు 300 టికెట్లు తీసుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
- వీఐపీల టికెట్ల జాబితాను బహిర్గతం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
- వివాదం ముదిరిపోవడంతో టీటీడీ సర్దుబాటుచర్యలకు ఉపక్రమించింది. మంత్రి సి.రామచంద్రయ్య కూడా మధ్యవర్తిత్వం చేశారు.
చట్టప్రకారమే కేసులు... అయినా ఎత్తివేస్తాం: ఈవో గిరిధర్‌గోపాల్
టీటీడీ నిబంధనల ప్రకారం తిరుమలలో ధర్నాలు, ఆందోళనలు నిషేధం. నిబంధనలు ఉల్లంఘించి ధర్నా చేసినవారిపై కేసులు పెట్టాం. ధార్మిక క్షేత్రమైన తిరుమలలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఇలా చేశాం. అయితే, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వాటిని ఉపసంహరించుకున్నాం.
టీటీడీ క్షమాపణలు చెప్పాలి: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి రోజున వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులపై కేసులు పెట్టిన టీటీడీ పాలకమండలి చర్య దౌర్భాగ్యకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వెంటనే కేసులను ఉపసంహరించుకోవడంతోపాటు భక్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
వైకుంఠ ఏకాదశి రోజున(ఈ నెల 11న) తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్, ఈవో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తొమ్మిదివేల వీఐపీ పాస్‌లు జారీచేసి సామాన్య భక్తులకు దర్శనం లేకుండా చేసిన వారిపై చర్యలు చేపట్టాలని టీడీపీ, బీజేపీ నేతలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నేతలు గిరిధర్, శ్రీధర్‌రావులు కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డిని గురువారం వేర్వేరుగా కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. టీటీడీ చైర్మన్ ఒక్కరే రెండువేల పాస్‌లు తీసుకున్నారని, ఓ మంత్రి 300 పాస్‌లు తీసుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు సంతోష్‌రెడ్డికి మొదటగా దర్శనం కల్పించారని ఆరోపించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కమిషన్.. దీనిపై టీటీడీతో సంబంధం లేని అధికారులతో విచారణ జరిపించి 30వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.
పుణ్యక్షేత్రంలో ఆందోళన సరికాదు
సాక్షి, తిరుమల: తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులు ఆందోళనలు చేయడం సరికాదని గవర్నర్ నరసింహన్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని, అందుకు తగ్గట్టుగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. భక్తులు కూడా టీటీడీకి సహకరించాలన్నారు.