‘న్యూ జనరేషన్ టీటీడీ వెబ్‌సైట్ రూపొందిస్తున్నాం’
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం కోసం విదేశీ భక్తుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో న్యూజనరేషన్ టీటీడీ వెబ్‌సైట్ రూపొందిస్తున్నట్లు ఈవో డాక్టర్ డి.సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడారు. టీసీఎస్, సిఫీ సంస్థ సహకారంతో.. శ్రీవారి దర్శనంతో పాటు వసతి, లడ్డూ ప్రసాదం, ఆర్జిత సేవలు, రూ.300 టికెట్ల బుకింగ్ విధానాలను సరళీకృతం చేశామని వివరించారు.
అలాగే భక్తుడి ఫొటో లేకుండా కేవలం గుర్తింపు కార్డు నంబర్ల సాయంతోనే ఈ టికెట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. దాతలకు సులభంగా సేవలు అందించేందుకు ఐటీ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 16న ఏపీ, తెలంగాణ లోని సుమారు 300 ఆలయ ప్రాంతాల్లో గోపూజ నిర్వహిస్తామని వెల్లడించారు. ధర్మప్రచారం విస్తరణలో భాగంగా త్వరలో ఎస్వీబీసీ తమిళ చానల్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు ఇదే రికార్డు
వచ్చే నెల 1 నుంచి 29 వరకు మొత్తం 54,047 ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేసినట్లు ఈవో సాంబశివరావు తెలిపారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు సంఖ్యని ఆయన చెప్పారు.