నా మీద చాలామంది కోపంగా ఉన్నారు.. | kanaka durga temple EO Surya Kumari press meet over Tantrik pooja | Sakshi
Sakshi News home page

దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగలేదు: ఈవో

Published Wed, Jan 3 2018 4:50 PM | Last Updated on Mon, Jul 29 2019 6:07 PM

kanaka durga temple EO Surya Kumari press meet over Tantrik pooja - Sakshi

సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదని ఆలయ ఈవో సూర్యకుమారి తెలిపారు. తాంత్రిక పూజల వ్యవహారంపై ఆమె బుధవారం ప్రెస్‌మీట్‌ లో మాట్లాడుతూ.. తాంత్రిక పూజలు అంటే ఏంటో తనకు తెలియదని, దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నామన్నారు. అలాగే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఈవో తెలిపారు. గత నెల 26వ తేదీ రాత్రి సాధారణంగా చేసే అలంకారమే జరిగిందని, అందుకు సంబంధించిన సామాగ్రిని మాత్రమే లోనికి వెళ్లిందని ఆమె పేర్కొన్నారు. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా 14మందికి నోటీసులు ఇచ్చామన్నారు. అలాగే సీసీ టీవీ ఫుటేజ్‌ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈవో స్పష్టం చేశారు. బదిలీకి సంబంధించి తనకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని ఆమె తెలిపారు. 

నా మీద చాలామంది కోపంగా ఉన్నారు..
‘గుడిలో నా మీద చాలామందికి కోపం ఉంది. పాలకమండలికి, నాకు మధ్య కొంత దూరం ఉంది. పాలకమండలి కోసం ప్రత్యేకంగా రిసెప్షన్‌ వింగ్‌ ప్రారంభించాం. గుడిలో వంద గ్రూపులు ఉన్నాయి. నా మీద కొంత ఒత్తిడి వచ్చింది. కానీ నిబంధనల ప్రకారమే పని చేశాం. బయోమెట్రిక్ పెట్టడం, పని సక్రమంగా చేయడం, కొత్త పూజలు ప్రవేశ పెట్టడం కూడా కొందరికి నచ్చలేదు. హుండీ 20శాతం, టిక్కెట్ ఆదాయం 80శాతం పెరిగింది.  సుమారు 130 కోట్ల వరకు డిపాజిట్ లు వున్నాయి.  ఒక్క కార్తీకమాసంలో కోటి రూపాయల ఆదాయం పెరిగింది. ఇక గుడిలో పూజలకు సంబంధించి ఎస్పీఎఫ్, దేవాదాయ సిబ్బంది, ఓపిడిఎస్ స్టాఫ్ ను ఆలయ ఈఈ వెంకటేశ్వర రాజు విచారిస్తున్నారు.  పాలకమండలి కూడా రెండు రోజుల కిందటే సీసీ టీవీ ఫుటేజీ చూసింది. బయటి వ్యక్తులు ఎలా వచ్చారని పాలకమండలి సభ్యులు ప్రశ్నించారు.’ అని అన్నారు.

కాగా ఈ వివాదం నేపథ్యంలో ఈవో సూర్యకుమారిపై వేటు పడింది. ఆమెను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. సూర‍్యకుమారి స్థానంలో ఇన్‌చార్జ్‌ ఈవోగా రామచంద్ర మోహన్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సింహాచలం దేవాలయ ఈవోగా ఉన్న ఆయనను వెంటనే రిపోర్ట్‌ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement