శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
ద్వారకా తిరుమల : ద్వారకా తిరుమల చినవెంకన్న క్షేత్రంలో ఈనెల 11 నుంచి 18 వరకు జరగనున్న శ్రీవారి ఆశ్వీయుజమాస బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయాన్ని, పరిసరాలను దేవస్థానం శోభాయమానంగా తీర్చిదిద్దుతోంది. ఆలయ గోపురాలకు విద్యుద్దీప అలంకరణలు, ప్రాకారాలకు రంగులు వేయడం వంటి పనులను సిబ్బంది శరవేగంగా నిర్వర్తిస్తున్నారు. ఆలయ ప్రధాన కూడలిలో 60 అడుగుల ద్వారకాధీశుని భారీ విద్యుత్ కటౌట్‌ను నిర్మిస్తున్నారు. శేషాచలకొండపై దేవతామూర్తుల భారీ విద్యుత్ కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. క్షేత్రంలోని పలు ప్రధాన కూడళ్లలోను, భీమడోలు, గుండుగొలనులోను బ్రహ్మోత్సవాలను తెలిపే ఆర్చిగేట్లును నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఈనెల 11న స్వామి, అమ్మవార్లను పెండ్లికుమారునిగాను, పెండ్లికుమార్తెలుగాను ముస్తాబు చేయడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతామని ఆలయ ఈవో వేండ్ర త్రినా«థరావు తెలిపారు. 15న రాత్రి 9 గంటలకు స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తామని, మరుసటి రోజు రాత్రి శ్రీవారి రధోత్సవాన్ని క్షేత్ర పురవీధుల్లో జరుపుతామని వివరించారు.