సాక్షి, విజయవాడ: సంప్రదాయాలకు విరుద్ధంగా దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగడం ఇంద్రకీలాద్రిపై హాట్ టాపిక్‌గా మారింది. దీనికితోడు ఈవో సూర్యకుమారిని బదిలీ చేశారంటూ సమాచారం రావడంతో బుధవారం దీనిపైనే చర్చ జరిగింది. ఈవో సూర్యకుమారి స్థానంలో సింహాచలం ఈవో రామచంద్ర మోహన్ ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకుంటారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే, బుధవారం రాత్రి వరకూ ఈవోను మార్చుతున్నట్లు ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అంతా సందిగ్ధంలో పడింది. దీనిపై పూర్తి విచారణ చేయించి, నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ప్రకటించడంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన దేవస్థానం వర్గాల్లో నెలకొంది.
మరోసారి బయటపడిన విభేదాలు
దుర్గగుడి పాలకమండలికి, ఈవో సూర్యకుమారికి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తాంత్రిక పూజలు జరగడంపై తాము గతనెల 30న పాలకమండలిలో చర్చించినా ఈవో సూర్యకుమారి వేగంగా నిర్ణయం తీసుకోలేదని, అందువల్ల ఆమెను ఈవో పదవి నుంచి తొలగించి విచారణ చేయాలంటూ పాలకమండలి సభ్యులు డిమాండ్ చేశారు. అదే సమయంలో కొంతమంది సభ్యులు దేవస్థానంలో జరుగుతున్న కొన్ని అవినీతి వ్యవహారాలను మీడియా వద్ద ఏకరువు పెట్టారు. సూర్యకుమారి కూడా సాయంత్రం 4 గంటలకు తనను కలిసిన మీడియాతో మాట్లాడేటప్పుడు పాలకమండలి సభ్యులను కలుపుకోలేదు. పాలకమండలి సభ్యులు చేసిన వ్యాఖ్యలకు స్పందించలేదు. తాంత్రిక పూజలు జరిగాయని పాలకమండలి సభ్యులు చెబుతుంటే.. కేవలం శుద్ధిచేసే కార్యక్రమమే జరిగిందంటూ ఈవో సూర్యకుమారి చెప్పారు. వైదిక కమిటీ, ఆలయ అర్చకులతో ఆరోజు సంఘటనపై ఈవో సుదీర్ఘంగా చర్చించారు. అదే సమయంలో దేవస్థానం ప్రతిష్ట దెబ్బతినేలా ఎవరూ మాట్లాడటం సరికాదంటూ ఈవో సూర్యకుమారి వ్యాఖ్యలు చేశారు. ఆరోజు ఏం జరిగిందనే అంశంపై తాము విచారణ చేయిస్తున్నామని, మొత్తం నివేదికను ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు.
మసకబారుతున్న ఆలయ ప్రతిష్ట
దుర్గగుడిలో ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు దేవాలయ ప్రతిష్టను మసకబార్చేలా ఉన్నాయి. ఇటీవల దేవస్థానంలో ఒక అటెండర్ చంద్రశేఖర్ టికెట్‌లు రీసైక్లింగ్ చేస్తుండగా అయ్యప్ప భక్తులకు పట్టుబడ్డాడు. చివరకు చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేశారు. అంతకుముందు విజిలెన్స్ నివేదికలోనూ ఏడాది కాలంగా దేవస్థానంపై జరుగుతున్న అవకతవకలను బహిర్గతం చేశారు. ప్రసాదాల తయారీ నుంచి ఇంజినీరింగ్ విభాగం వరకూ జరుగుతున్న అవినీతిని ఈ నివేదికల్లో విజిలెన్స్ అధికారులు ఏకరువు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment