Indra Keeladri
-
ఇంద్రకీలాద్రిపై నిత్యాన్నదానం పున:ప్రారంభం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై సోమవారం నుంచి అమ్మవారి నిత్య అన్న ప్రసాద వితరణ పునఃప్రారంభమైంది. ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ మహా మండపం రెండో అంతస్తులోని అన్న ప్రసాద వితరణ విభాగంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్, ఈవోలు భక్తులకు అన్న ప్రసాదాన్ని స్వయంగా వడ్డించారు. అన్న ప్రసాద వితరణలో పాల్గొనే సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అమ్మవారి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. నిత్యం 2,500 మందికి, శుక్ర, ఆదివారాలలో 4,000 మందికి అన్న ప్రసాద వితరణ ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, పాలక మండలి సభ్యురాలు ఎన్.సుజాత, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రి: టికెట్ ఉంటేనే దర్శనం!
సాక్షి, అమరావతి: ఇంద్రకీలాద్రిపై ఈ నెల 17 నుంచి 25 వరకు జరగనున్న దసరా ఉత్సవాల్లో టికెట్లు కలిగి ఉన్న వారినే కనకదుర్గమ్మ వారి దర్శనానికి అనుమతించనున్నట్టు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ వెల్లడించారు. ఆన్లైన్లో రూ.300లు, 100ల టికెట్లతో పాటు ఉచిత దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో దుర్గ గుడి చైర్మన్ పైలా స్వామినాయుడు, ఈవో ఎం.సురేష్‌బాబులతో కలిసి కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్సవాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. క్యూలైన్లలో భక్తులకు శానిటైజర్లు సమకూరుస్తామన్నారు. సాధారణ రోజుల్లో రోజూ 10 వేల టికెట్లు, మూలా నక్షత్రం రోజున 13 వేల టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. గంటకు వెయ్యి మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. పదేళ్ల లోపు, 65 ఏళ్ల పైబడ్డ వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగులకు ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపైకి అనుమతించడం లేదని స్పష్టం చేశారు. కోవిడ్ దృష్ట్యా ఇతర జిల్లాల పోలీసులను బందోబస్తుకు రప్పించడం లేదని తెలిపారు. ఆన్లైన్లో లక్ష టికెట్లు.. అమ్మవారి దర్శనానికి లక్ష టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని దేవస్థానం చైర్మన్ పైలా స్వామినాయుడు తెలిపారు. భక్తులు ఇప్పటికే సుమారు 67 వేల టికెట్లు తీసుకున్నారని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జిల్లాల భవానీ దీక్ష గురువులతో మాట్లాడామన్నారు. దేవాలయంలో భవానీ దీక్షల మాలధారణ, విరమణలకు అనుమతించడం లేదని, వీటిని వారి గ్రామాల్లోనే చేపట్టాలని సూచించినట్టు తెలిపారు. అమ్మవారి తెప్పోత్సవం యథావిధిగా నిర్వహిస్తామని, కానీ భక్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు. వీఐపీలకు ప్రత్యేక సమయాలు కేటాయిస్తామన్నారు. ఉదయం 5 నుంచి రాత్రి 8 వరకే దర్శనాలు ఉత్సవాల మొదటి రోజు అక్టోబర్ 17న ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు, ఆ తర్వాత రోజుల్లో ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ఈవో సురేష్‌బాబు తెలిపారు. మూలా నక్షత్రం (21న) రోజున అమ్మవారి దర్శనం ఉదయం 3 నుంచి రాత్రి 9 వరకు ఉంటుందన్నారు. వినాయక గుడి నుంచి భక్తులను అనుమతిస్తామని.. భక్తులు మాస్క్‌లు ధరించాలని, థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలని, తమ వెంట మంచినీరు తెచ్చుకోవాలని సూచించారు. ఆలయ బస్సులు, లిఫ్టు సౌకర్యాన్ని, ఘాట్‌రోడ్డు దారిని నిలిపి వేస్తున్నామన్నారు. ఆన్లైన్ ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, వాటికి సంబంధించిన ప్రసాదాన్ని, వస్త్రాలను పోస్టు ద్వారా పంపుతామని చెప్పారు. మీడియా పరిమిత సంఖ్యలో రెండు షిఫ్టుల్లో కవరేజీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. -
ఏడు వారాల నగలతో దుర్గమ్మ దర్శనం
సాక్షి, విజయవాడ: ఈ నెల 12 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఏడు వారాల నగలతో దర్శనమివ్వనున్నారు. శనివారం దుర్గగుడి ఈవో ఎంవి.సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. సోమవారం-ముత్యాల అలంకారం, మంగళవారం-పగడాలు అలంకారం, బుధవారం-పచ్చల అలంకారం, గురువారం- కనక పుష్య రాగాల అలంకారం, శుక్రవారం-వజ్రాల అలంకారం, శనివారం-నీలాల అలంకారం, ఆదివారం- కెంపుల అలంకారంలో దర్శనమివ్వనున్నారని ఈవో వెల్లడించారు. అమ్మవారికి దేవస్థానంలో రెండు కిరీటాలు ఉన్నాయని.. వజ్ర కిరీటం చేయించాలనే యోచనలో ఉన్నామని తెలిపారు. దాతల నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ప్రసాదం పోటు, అన్నదానం, కేశ ఖండన శాల నిర్మాణాలకు ఈ నెలాఖరుకు ప్లాన్ పూర్తవుతుందన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి పూర్తి చేస్తామని తెలిపారు. కేశ ఖండనశాల వేలానికి ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా నిర్వహించామన్నారు. కేశ ఖండనశాల తలనీలాల కాంట్రాక్ట్‌ను రద్దు చేశామని.. మరలా టెండర్లను ఆహ్వానిస్తామని ఈవో సురేష్‌బాబు పేర్కొన్నారు. -
అమ్మవారిని దర్శించుకున్న ఇళయరాజా..
సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా దర్శించుకున్నారు. వేద మంత్రాలతో ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితుల చేత ఆశీర్వచనం తీసుకున్నారు. ఆ తర్వాత ఇళయరాజాకు అమ్మవారి చిత్రపటం, లడ్డు ప్రసాదాన్ని ఆలయ అర్చకులు అందజేసారు. -
ఉత్సవాలు మెప్పించేలా.. దుబారా తగ్గించేలా!
సాక్షి, విజయవాడ : మరో వారం రోజుల్లో దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. సుమారు 15 లక్షల మంది కంటే ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. గత ఏడాది దసరా ఉత్సవాలకు సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఈ ఏడాది దసరాకు అయ్యే దబారాపై దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మ ప్రత్యేక దృష్టి సారించారు. అనవసరపు ఖర్చుల్ని తగ్గించాలని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాది రూ.8.3 కోట్లు వ్యయంతో దసరా ప్రణాళికలు సిద్ధం చేశారు. దాతల కోసం అన్వేషణ.. గతంలో శాశ్వత నిర్మాణాల కోసం మాత్రమే దాతల కోసం దేవస్థానం అధికారులు అన్వేషించేవారు. ప్రస్తుతం దసరా ఉత్సవాలకూ దాతల్ని అన్వేషిస్తున్నారు. ఆసక్తి గలవారికి ఒక్కొక్క పనిని అప్పగించి అమ్మవారికి సేవ చేయమని ప్రోత్సహిస్తున్నారు. ద్వారాకామాయి చారిటబుల్ ట్రస్టు ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో అయ్యే బియ్యం, కందిపప్పు ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చింది. 12000 కేజీల బియ్యం, 2,500 కేజీల కందిపప్పు ఉచితంగా ఇచ్చారు. దీంతో అన్న ప్రసాదానికి అయ్యే ఖర్చు తగ్గుతుందని ఈవో కోటేశ్వరమ్మ చెబుతున్నారు. కోతలు మొదలు.. గతంలో సాంస్కృతిక కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించేవారు. ఈ ఏడాది అమ్మవారిపై భక్తితో కళాకారులు ఉచితంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో అనేక మంది భక్త కళాకారులు ముందుకు వచ్చారు. ఈ వ్యయాన్ని రూ.5 లక్షలకు పరిమితం చేస్తున్నారు. ఉభయదాతలుగా కుంకమార్చనలో పాల్గొన్నే మహిళలకు చీర, రవికెను దేవస్థానం తరఫున ఇవ్వడం ఆనవాయితీ. రవికె ముక్కలు కొనుగోలు చేయకుండా భక్తులు అమ్మవారికి పెట్టినవాటిని అమ్మవారి పేరిట తిరిగి భక్తులకే ఇస్తే వారు భక్తితో ఉపయోగించుకుంటారని, దేవస్థానానికి ఖర్చు తగ్గుతుందని ఈవో నిర్ణయించారు. ఈ వారంలోనూ ఇంకా దాతలు ముందుకు వస్తే వారి సేవలు వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఉత్సవాల పేరుతో ఇష్టానుసారంగా సరుకు కొనుగోలు చేయకుండా ఈవో ఆంక్షలు విధించారని ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. బయట నుంచి వస్తువులు కొనుగోలు చేసే కంటే దేవస్థానం ఆధ్వర్యంలో అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగించుకుని ఉత్సవాలు ఏ విధంగా పూర్తిచేయాలో ఆలోచించాలని ఈవో సూచిస్తున్నట్లు తెలిసింది. మారాల్సింది ప్రభుత్వం తీరే.. అధికారులు రూపాయి రూపాయి పొదుపు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం దేవస్థానం ఖజానాకు కన్నం వేస్తోంది. దసరా ఉత్సవాలు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. అటువంటప్పుడు అన్ని శాఖలు ఉచితంగా పనిచేయాలి. అయితే పోలీసు శాఖ రూ.75 లక్షలు దేవస్థానం నుంచి వసూలుచేస్తోంది. ఫైర్ డిపార్టుమెంట్‌కు రూ.1.20 లక్షలు, ఎలక్ట్రికల్ మెయింటినెన్స్‌కు రూ.2.5 లక్షలు, జలవనరుల శాఖకు రూ.2 లక్షలు, ఫిషరీస్ డిపార్టుమెంట్‌కు రూ.1.3 లక్షలు చొప్పున ప్రభుత్వం దేవస్థానం నుంచి వసూలు చేస్తోంది. ఇది చాలదన్నట్లు తెలుగుదేశం నేతలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ రూ.25 లక్షలు వరకు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు వచ్చినప్పుడు వారికి సత్కారాలు, దర్శనాలు కోసం దేవస్థానంపై రూ.లక్షల భారం పడుతోంది. భక్తులకు చేసే ఖర్చులపైనే కాకుండా ప్రభుత్వ పక్షం చేసే ఖర్చులపైన ఈవో కోటేశ్వరమ్మ కోత విధిస్తే బాగుంటుందని భక్త బృందాలు అభిప్రాయపడుతున్నాయి. ఇతర శాఖలకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెచ్చే బాధ్యత పాలకమండలే తీసుకోవాలి. -
ఇంద్రకీలాద్రిపై సంపూ
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) : సినీ హీరో సంపూర్ణేష్ బాబు ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సంపూర్ణేష్‌బాబును ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న సంపూర్ణేష్‌బాబు తన నటించిన నూతన చిత్రం కొబ్బరి మట్ట విజయవంతం కావాలని అమ్మవారికి మొక్కుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సంపూర్ణేష్‌బాబుతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పలువురు భక్తులు ఉత్సాహం చూపించారు. కొంత మంది భక్తులు సంపూ మొదటి చిత్రమైన హృదయకాలేయం గురించి మాట్లాడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. -
‘గుడిలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులు’
సాక్షి, విజయవాడ: బెజవాడ కనకదుర్గ చీర దొంగతనం కేసుకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన మాజీ పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత సంచలన ఆరోపణలు చేశారు. దుర్గగుడిలో ఓపీడిఎస్‌కు చెందిన మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. పాలక మండలి సభ్యులు వెలగపూడి శంకరబాబు గుడిలో పనిచేసే మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. గతంలో బాధిత మహిళలు శంకరబాబుపై ఫిర్యాదు చేసినా చైర్మన్ గౌరంబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఫిర్యాదులను గౌరంబాబు పట్టించుకోకపోవడమే కాకుండా శంకరబాబును వెనకేసుకొచ్చేవాడని మండిపడ్డారు. ఆలయంలో అక్రమాలు ఆలయ అభివృద్ది పనుల్లో భాగంగా సీసీ రోడ్, ఘాట్‌రోడ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. చైర్మన్ అక్రమాలను వ్యతిరేకించినందుకే తనపై కక్ష్య కట్టారని పేర్కొన్నారు. చీరల విషయంలో లక్షల అక్రమాలు జరిగాయని, వాటిని ప్రశ్నించినందుకు తనను చీరల దొంగగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక దర్యాప్తు జరపకుండానే తనను తొలిగించారని, తాను ఏ తప్పు చేయలేదని సూర్యలత స్పష్టంచేశారు. -
చీర మాయం : సూర్యలత సస్పెండ్
సాక్షి, విజయవాడ : బెజవాడ కనకదుర్గ చీర దొంగతనం ఆరోపణలతో ఆలయ పాలకమండలి సభ్యురాలు సూర్యలత సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఆయన చైర్మన్ గౌరంగబాబు సూర్యలతపై చర్యలు తీసుకున్నారు. చీర మాయం ఘటనపై ఆలయ ఈవో పద్మ నివేదిక సిద్ధం చేశారు. ఆలయ ట్రస్టు బోర్డులోని సభ్యురాలు సూర్యలత దుర్గమ్మ చీరను తీసినట్లు రిపోర్టులో స్పష్టం చేశారని తెలిసింది. చీర మాయం విషయంపై ప్రభుత్వం కూడా సీరియస్ అయిన నేపథ్యంలో కదిలిన ఈవో నివేదికను రూపొందించారు. అయితే, నివేదికను ప్రభుత్వానికి పంపే ముందు ఈవో పద్మ వన్‌టౌన్ పోలీసులతో మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. సీసీ టీవీ ఫుటేజి లేకపోయినా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం నమోదు చేసినట్లు ఈవోకు పోలీసులు తెలిపారు. దీంతో వాంగ్మూల నమోదు ప్రతిని తనకు ఇవ్వాలని ఈవో పద్మ పోలీసులను కోరారు. చీర తీసిన పాలకమండలి సభ్యురాలిపై కేసు నమోదు అయితే ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుంది కనుక కేవలం చర్యలు మాత్రమే తీసుకోవాలని ఈవో నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. నాది తప్పు ఎలా అవుతుంది : సూర్యలత చీర వివాదంపై ఆలయ పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత మాట్లాడారు. ఆలయ చైర్మన్, ఈఓలు భక్తుల నుంచి సన్మానాలు స్వీకరిస్తే తప్పు కానిది, తాను భక్తులు సన్మానించిన చీరను తీసుకుంటే తప్పు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. చైర్మన్ నుంచి తనకు ఇంకా సస్పెన్షన్ ఆర్డర్ రాలేదని చెప్పారు. ఆలయంలోని కొందరు కుట్రపూరితంగానే ఇలా చేశారని అన్నారు. ఆలయ అర్చకుడు శాండిల్య చేసిన ఆరోపణలతో తనను ఎలా సస్పెండ్ చేస్తారని నిలదీశారు. భక్తుల నుండి నేను చీరలు ప్రసాదంగా తీసుకున్నానని చైర్మన్ అనడం సరికాదని చెప్పారు. పాలకమండలిలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. -
చీర వివాదంపై మల్లగుల్లాలు
సాక్షి,విజయవాడ: వివాదాల కేంద్రంగా ఇంద్రకీలాద్రి మారింది. అమ్మ సన్నిధిలో ఎవరికివారే అందినకాడికి దోచేసుకుంటున్నారు. తాజాగా ఉండవల్లికి చెందిన భక్త బృందం సమర్పించిన ఖరీదైన పట్టుచీర మాయం వ్యవహారంపై ట్రస్టుబోర్డు సభ్యులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ వ్యవహారం నుంచి ఎలా తప్పించుకోవాలో అని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చీర మాయమైన సమయంలో అక్కడే పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత ఉండటం, ఆమె చీర తీసుకువెళ్లిందంటూ అర్చకుడు శంకర శాండిల్య వెల్లడించడం పాలకమండలి సభ్యులకు మింగుడుపడటం లేదు. అమ్మవారికి చెందాల్సిన చీరను పాలకమండలి సభ్యురాలు తీసుకున్నారన్న విషయం తెలుసుకున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని, దేవాలయం ముందు ధర్నా చేస్తామని దాతలు బహిరంగంగానే ప్రకటించారు. సీఎం దృష్టికి వివాదం దుర్గమ్మ చీర మాయమైన విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. పార్టీ ప్రతిష్ట మంటగలుస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈలోగా పాలకమండలి సభ్యురాలుకు తెలిసిన క్యాబినేట్లో కీలకంగా ఉండే ఒక మంత్రి అర్బన్ నేతలకు ఫోన్ చేసి ఈ వ్యవహారం అంతా సరిచేయాలంటూ సూచించారు. దీంతో సోమవారం రాత్రి అర్బన్ తెలుగుదేశం నేతలు రంగంలోకి దిగి అటు పాలకమండలితోనూ, ఇటు దేవస్థానం అధికారులతోనూ, పోలీసులతోనూ మాట్లాడుతున్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలిసింది. మంటగలుస్తున్న ప్రతిష్ట పాలకమండలి సభ్యులు వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఇటు పాలకమండలి, అటు దేవస్థానం ప్రతిష్ట మంటగలుస్తోంది. ఇటీవల నాయీ బ్రాహ్మణుడిపై పాలకమండలి సభ్యుడు పెంచలయ్య దాడి చేశారు. ఈ ఘటన మరిచిపోకముందే సూర్యలత చీర మాయం చేసిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజా వ్యవహారంలోనూ పెంచలయ్య రంగంలోకి దిగి చీరను సమర్పించిన భక్తులు పోలీసుస్టేషన్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. భక్తుడు సూర్యనారాయణ ఉండవల్లికి చెందిన వారు కావడంలో అదే ప్రాంతానికి చెందిన పెంచలయ్య వారిని అడ్డుకుంటున్నారు. ఏదో విధంగా పోలీసు కేసు నమోదు కాకుండా కేసును పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే భక్తులు పట్టుబట్టడంతో సాయంత్రం దుర్గగుడి ఏఈవో అచ్యుతరామయ్యకు ఫిర్యాదు చేయనిచ్చారు. అదే సమయంలో తమ ప్రతిష్ట కాపాడుకునేందుకు పాలకమండలి తరుఫున బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలంటూ ఏఈవోకు ఒక లేఖఇచ్చినట్లు పాలకమండలి సభ్యులు చెబుతున్నారు. పోలీసు స్టేషన్లో కేసు నమోదు కాకుండా తామే విచారణ చేసి కేసును పరిష్కరిస్తామంటూ చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు చెబుతున్నారు. పోలీసు స్టేషన్ వరకు కేసును తీసుకు వెళ్లిన తరువాత కేసు మాఫీ చేయడమా? లేక పోలీసుల దాకా వెళ్లకుండానే వివాదం పరిష్కరంచమా అనే విషయం పై సోమవారం రాత్రి వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. -
ఆటోలకు అనుమతి ?
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల భద్రతను గాలికి వదిలే స్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి అధికార పార్టీ నేతలు కొండపైకి ఏడు సీట్ల ఆటోలను అనుమతించే ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షి,విజయవాడ: ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల భద్రతను గాలికి వదిలేసి, వార్ని నిలువు దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమౌతోంది. అధికారపార్టీ నేతలు కాసులకు కక్కుర్తి పడి ఇంద్రకీలాద్రి పైకి ఏడు సీట్ల (మ్యాజిక్)ఆటోలను అనుమతించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అర్బన్ తెలుగుదేశం పార్టీలో ఉండే ఒక కీలకనేత ఆటోలను కొండపైకి అనుమతించేందుకు పాలకమండలి తీర్మానం చేయాలంటూ కొంత మంది సభ్యులకు సూచించినట్లు సమాచారం. గతంలో అనేక ఇబ్బందులు.... గతంలో నరసింగరావు ఈవోగా ఉన్నప్పుడు ఆదాయం కోసమని కొండపైకి ఆటోలను అనుమతించారు. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగకపోగా పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ముఖ్యంగా పైన స్థలభావం సమస్య ఏర్పడింది. ఆటో యజమానులు రోజుకు రెండు మూడు ట్రిప్పులు మాత్రమే ఘాట్‌రోడ్డు టోల్ ట్యాక్స్ కట్టి పది నుంచి పదిహేను సార్లు ఆటోలను నడుపుతూ దేవస్థానం ఆదాయానికి గండి కొట్టేవారు. డ్రైవర్లు వేగంగా ఆటోలను నడపడం వల్ల ఏ నిముషంలో ఏ ప్రమాదం జరుగుతుందోననే భయం అందరిలోనూ ఉండేది. ఆ తరువాత ఘాట్ రోడ్డు మరమ్మతులు చేపట్టడంతో పూర్తిగా మూసివేశారు. ఘాట్‌రోడ్డు తెరిచి దేవస్థానం బస్సులు తిప్పుతున్నా ఆటోలను అనుమతిస్తే ప్రమాదాలు జరుగుతాయని అనుమతించలేదు. ఆటోడ్రైవర్లతో అర్బన్ నేత ఒప్పందం నగరంలో ఉన్న ఏడు సీట్లు ఆటో డ్రైవర్ల యూనియన్‌తో అర్బన్ తెలుగుదేశం పార్టీ నేత ఒకరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈవోగా సూర్యకుమారి ఉన్నప్పుడే ఆటోల అనుమతి కోసం ఆమెకు నాలుగైదుసార్లు ఈ నేత సిఫార్సు చేసినా ఆమె అంగీకరించలేదు. ప్రస్తుతం ఈవో ఎం.పద్మ పాలకమండలికి సానుకూలంగా ఉండడంతో ఈ నేతకు ప్లస్ పాయింట్ అయింది. యూనియన్ నాయకులతో మరొకసారి చర్చలు జరిపి లక్షల రూపాయలు ముడుపులుగా తీసుకున్నట్లు ఇంద్రకీలాద్రిపై ప్రచారం జరుగుతోంది. రాబోయే పాలకమండలి సమావేశంలో ఆటోల ఆవశ్యకతను వివరిస్తూ ఒక తీర్మానం పెట్టి ఆమోదింపచేయాలని కొంతమంది సభ్యులకు సూచించారు. ఆటోల డ్రైవర్లను టీఎన్టీయూసీ సభ్యత్వం ఇప్పించి పార్టీకి సేవ చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. భక్తుల నిలువుదోపిడీ సాధారణ రోజుల్లో 25 వేల మంది పర్వదినాలు, వారంతంలోనూ 40 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. వీరికోసం దేవస్థానం ఏడు బస్సులు ఏర్పాటు చేసింది. ఒకొక్క భక్తుడు రూ.10 చెల్లించి బస్టాండ్, రైల్వేస్టేషన్లో దిగవచ్చు. కొండ కిందకు ఉచిత బస్సులు ఉన్నాయి. ఇప్పుడు ఆటోలకు అనుమతిస్తూ ఒకొక్క భక్తుడి వద్ద రూ.30 నుంచి రూ.50 వసూలు చేసుకునేం దుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బస్సుల సంఖ్య తగ్గించి వాటి స్థానంలో ఎక్కువ ఆటోలను పెట్ట డం వల్ల ఆటోడ్రైవర్లకు ఆదాయం పెంచాలని యోచిస్తున్నారు. అదే జరిగితే భక్తులు నిలువు దోపిడీకి గురవుతారు. అసలు ఇంద్రకీలాద్రిపైకి ఆటోలను అనుమతించడం సరికాదు. గ్రీనరీ పేరుతో కొంత రోడ్డును మూసేశారు. మిగిలిన స్థలంలోనూ వీఐపీ, పాలకమండలి సభ్యులు కా ర్లు పార్కింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆటోలను అనుమతిస్తే.. బస్సులకు ఎక్కడ జాగా ఉంటుం దో పాలకమండలి సభ్యులే చెప్పాల్సి ఉంటుంది. దుర్గాఘాట్ వద్ద షెల్టర్ ఏర్పాటు చేయాలి దుర్గాఘాట్‌లో స్నానాలు చేసిన భక్తులు దుర్గాఘాట్ వద్ద బస్సుల కోసం మండుటెండలో నడిరోడ్డుపై నిలబడాల్సి వస్తోంది. ఆటోలను అనుమతించడంపై చూపించే శ్రద్ధ ఇక్కడ దుర్గాఘాట్ వద్ద బస్ షెల్డర్పై చూపించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
దుర్గమ్మ భక్తులపై భారం
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై టీడీపీ పాలకమండలి వచ్చిన తరువాత భక్తులకు సౌకర్యాలకు కల్పించడం కంటే భారాలు మోపేందుకే ఆసక్తి చూపుతుంది. గతంలో లడ్డూ, ప్రసాదాలు, కార్లు పార్కింగ్, కొన్ని పూజల ధరలు పెంచిన పాలకమండలి తాజాగా శాంతి కల్యాణం టికెట్ ధరలను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారం మాడపాటి గెస్ట్‌హౌస్‌లో చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, ఈవో ఎం.పద్మల ఆధ్వర్యంలో పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం చైర్మన్, ఈవో సమావేశ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈవో, చైర్మన్ మాట్లాడుతూ శాంతి కల్యాణం టికెట్ ధర రూ.500 నుంచి రూ.1000కు పెంచామని చెప్పారు. గతంలో శాంతి కల్యాణం చేయించుకున్న భక్తులకు రూ.100 టికెట్ లైన్లో దర్శనానికి అనుమించేవాళ్లమని ఇప్పు డు అంతరాలయ దర్శనానికి(రూ.300 టికెట్) అనుమతిస్తామన్నారు. రూ.13.70 కోట్లతో జీ+4 కాటేజ్‌లు గొల్లపూడిలో దేవస్థానానికి చెందిన స్థలంలో జీ+4 కాటేజ్‌లను రూ.13.70 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. అయితేఈ నిధులు భక్తుల నుంచి సేకరిస్తారు. రూ.10 లక్షలు చెల్లించిన దాత పేరును ఒక గదికి, రూ.15 లక్షలు ఇచ్చిన దాత పేరు ఒక సూట్‌కు పెడతారు. దాతలకు ఏడాదికి 30 రోజులు ఈ రూమ్ లేదా కాటేజ్‌ను ఉచితంగా వాడుకోవచ్చని, మిగిలిన రోజుల్లో భక్తులకు అద్దెలకు ఇస్తామని చెప్పారు. భక్తులకు ఉచిత ప్రసాదాలు ఇంద్రకీలాద్రిపై ఉన్న ఉపాలయాలైన నటరాజస్వామి, సుబ్రహ్మణేశ్వరస్వామి వార్ల దేవాలయాలకు వచ్చే భక్తులకు కూడా ఇక నుంచి ఉచితంగా ప్రసాదాలు పంపిణీ చేయాలని పాలకమండలి నిర్ణయించింది. ఇప్పటికే అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఉచిత ప్రసాదం అందజేస్తున్నారు. ఇక నుంచి ఉపాలయాలు వద్ద కూడా ఉచిత ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. ఇంద్రకీలాద్రిపై శ్రీ పాశుపతాస్త్రాలయం ఇంద్రకీలాద్రిపై పాశుపతాస్త్రాలయం పునః నిర్మించేందుకు ఎ.శివనాగిరెడి(స్థపతి) కన్సల్టెంట్‌గా నియమించేందుకు పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.58లక్షలతో గ్రీనరీ అంశం వాయిదా ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఇంద్రకీలాద్రిపై గ్రీనరీ అభివృద్ధికి రూ.58 అంచనాలతో తయారు చేసిన ప్రతిపాదనను వాయిదా వేశారు. గ్రీనరీని దేవస్థానం సిబ్బందే చేయాలని సూచించింది. క్షురకులకు మాస్క్‌లు దేవస్థానంలోని కేశఖండన శాలలో పనిచేసే క్షురకులు గ్లౌజ్‌లు, మాస్కులు ధరించాలనే ప్రతిపాదనకు పాలకమండలి ఆమోదముద్ర వేసింది. క్షురకులు అనారోగ్యంతో చనిపోయినప్పడు, అతడి భార్యకు లేదా వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి మాత్రమే కేశఖండన శాఖ వద్ద పనిచేయడానికి అనుమతి ఇచ్చే ప్రతిపాదనను తమ పరిధిలోకి రాదని పాలక మండలి సభ్యులు అభిప్రాయపడ్డారు. ఉపాలయాల్లో నగల అలంకరణ అమ్మవారికి భక్తులు సమర్పించే బం గారాన్ని భద్రపరిచి అమ్మవారికి ఏడువారాల నగలు, ఉపాలయాల్లోని దేవతామూర్తులకు వెండి, బంగారు ఆభరణాలు తయారు చేయించాలని నిర్ణయించారు. వెండి విక్రయించగా వచ్చిన సొమ్ము బంగారం, బాండ్లుగా మార్చాలని నిర్ణయించారు. 140 ఎకరాలభూములు వేలం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, దాని దత్తత దేవాలయాలకు సుమారు 140 ఎకరాల భూములు ఉన్నాయి. వీటి లీజు పరిమితి ముగియడంతో తిరిగి వేలం నిర్వహించి మూడేళ్ల కాలపరిమితికి లీజుకు ఇచ్చేందుకు దేవస్థానం అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21 నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు ఒకొక్క రోజు ఒక్కో దేవాలయానికి చెందిన భూముల లీజు హక్కు కోసం వేలం నిర్వహించాలని నిర్ణయించారు. వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని ఈవో ఎం.పద్మ తెలిపారు. దేవస్థానం ఆస్తులను జాగ్రత్తగా కాపాడి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. నగరం సమీపంలో దేవస్థానానికి చెందిన ఏడు ఎకరాల భూమిలో చైతన్య విద్యాసంస్థల మురుగు వదులుతున్న విషయాన్ని పరిశీలించి ఆ సంస్థకు నోటీసులు ఇచ్చామని, ఒకటి రెండు రోజుల్లో మురుగు రాకుండా పకడ్బందీగా ఏర్పాటుచేసి ఆ భూమిని కాపాడతామని చెప్పారు. ప్రస్తుతం ఆ భూమికి వేలం నిర్వహించడం లేదని ఈవో తెలిపారు. -
రాజగోపురం ద్వారానే ప్రవేశం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులెవరైనా సరే రాజగోపురం ద్వారానే ఆలయంలోకి ప్రవేశించేలా ఇంద్రకీలాద్రిపై మార్పులు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులెవరైనా సరే రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారు. అమ్మవారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులు, వీఐపీలు, అందరూ కూడా ఇక రాజగోపురం లోపల నుంచి మాత్రమే ఆలయంలోకి ప్రవేశించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇకపై దుర్గగుడిపై కూడా అదే తరహాలో అన్ని క్యూలైన్లు రాజగోపురం ద్వారానే ఆలయంలోకి ప్రవేశించేలా క్యూలైన్లు మార్పు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రాజగోపురం లోపల నుంచి మూడు క్యూలైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రూ.300, రూ.100, సర్వదర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ఆలయ ఈవో ఎం.పద్మ, చైర్మన్ గౌరంగబాబు, అర్చకులు, దుర్గగుడి ఇంజినీరింగ్ అధికారులు, వెస్ట్ ఏసీపీ జి.రామకృష్ణ సమావేశమయ్యారు. కననకదుర్గానగర్ నుంచి వచ్చే భక్తులు లిఫ్టు ద్వారా కొండపైకి చేరుకున్న తర్వాత రాజగోపురం లోపల నుంచి ఏర్పాటుచేసే క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించేలా మార్పు చేయాలని నిర్ణయించారు. దీనిపై సాధ్యాసా«ధ్యాలు, లోటుపాట్లను అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రాజగోపురం ఎదురుగా ఉన్న వీఐపీ లాంజ్‌లో కొద్దిసేపు దీనిపై చర్చించారు. అయితే, ఘాట్‌రోడ్డు వైపు నుంచి వచ్చే భక్తులను రాజగోపురం లోపల వైపునకు ఏవిధంగా అనుమతించాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. -
దుర్గమ్మ సేవలో హీరోయిన్ తాప్సీ
ప్రముఖ నటి తాప్సీ శుక్రవారం దుర్గగుడిపై సందడి చేశారు. ఓ సినిమా షూటింగ్లో భాగంగా విజయవాడ వచ్చిన ఆమె ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను హీరోయిన్ తాప్సీ, డైరెక్టర్ కోన వెంకట్ శుక్రవారం దర్శించుకున్నారు. ఓ సినిమా షూటింగ్ కోసం విజయవాడ వచ్చిన తాప్సీ, కోన వెంకట్ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చారు. ప్రత్యేక పూజలు జరిపించుకుని వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయ అధికారులు వారికి అమ్మవారి ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం తాప్సీ మీడియాతో మాట్లాడారు. గతంలో పలుమార్లు అమ్మవారి గురించి తెలుసుకున్నానని, ఈసారి దర్శనం చేసుకోవడం తన అదృష్టమన్నారు. తాప్సీతో మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. -
కనకదుర్గ ఆలయ ఈఓగా పద్మ బాధ్యతల స్వీకరణ
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి కార్యనిర్వహణాధికారి(ఈఓ) గా ఐఏఎస్ అధికారిణి ఎం.పద్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి దయ వలనే ఈవో పోస్టు వచ్చిందని, అమ్మే ముందుండి తనను నడిపిస్తోందని చెప్పారు. శాస్ర్తాలకు విరుద్ధంగా కాకుండా భక్తులకు ఉపయోగపడేలా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తానన్నారు. ఎవరి పని వారు చేసుకుంటే ఇబ్బందులు ఏమీ ఉండవని వ్యాఖ్యానించారు. మిగతా ఆలయాల్లో ఏవిధంగా అభివృద్ధి ఉందో ఆవిధంగా చేయాలని అమ్మవారు కలలోకి వచ్చి సూచించారని తెలిపారు. ఆ విధంగా నడుచుకుంటూ ఇంద్రకీలాద్రిపై అభివృద్ది కార్యక్రమాలు చేపడతానని పద్మ హామీ ఇచ్చారు. -
గంటన్నర ఆలస్యంగా దుర్గగుడి మూసివేత
సాక్షి, అమరావతి: ఇంద్రకీలాద్రిపై తాంత్రిక పూజలు జరిగాయని ఆరోపణలు వచ్చిన డిసెంబరు 26వ తేదీన రాత్రి గంటన్నర ఆలస్యంగా దుర్గగుడిని మూసివేసినట్లు నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. సాధారణంగా ప్రతిరోజు రాత్రి 10 గంటలకు గుడిని మూసివేస్తారు. డిసెంబర్ 26న మాత్రం రాత్రి 11.30 గంటలకు మూసివేసినట్టు తమ పరిశీలనలో వెల్లడైందని నిజనిర్ధారణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారంపై విచారణను పూర్తి చేసిన ఈ కమిటీ సభ్యులు రఘునాథ్, శ్రీరామశర్మ తమ నివేదికను శనివారం ఉదయం దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధకు అందజేశారు. అనంతరం ఈ మొత్తం వ్యవహారంపై ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేసి దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, కమిషనర్ అనూరాధ, నిజనిర్ధారణ కమిటీ సభ్యులు శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించారు. భద్రతాపరమైన లోపమేనట! ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా డిసెంబర్ 26న రాత్రి ఆలయాన్ని గంటన్నర ఆలస్యంగా ఎందుకు మూసివేయాల్సి వచ్చిందన్న దానిపై అర్చకులు, ఆలయ సిబ్బందిని నిజనిర్ధారణ కమిటీ ప్రశ్నించింది. భద్రతా సిబ్బంది నుంచి వివరాలు సేకరించింది. భద్రతాపరమైన లోపం కారణంగానే ఆలయాన్ని గంటన్నర ఆలస్యంగా మూసివేశారంటూ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో దేవాదాయశాఖ స్పష్టం చేసినట్లు సమాచారం. అంటే భద్రతాపరమైన లోపం అనే చిన్న కారణం చూపి, తాంత్రిక పూజల వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు దేవాదాయ శాఖ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
అసలేం జరిగింది?
సాక్షి, విజయవాడ: సంప్రదాయాలకు విరుద్ధంగా దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగడం ఇంద్రకీలాద్రిపై హాట్ టాపిక్‌గా మారింది. దీనికితోడు ఈవో సూర్యకుమారిని బదిలీ చేశారంటూ సమాచారం రావడంతో బుధవారం దీనిపైనే చర్చ జరిగింది. ఈవో సూర్యకుమారి స్థానంలో సింహాచలం ఈవో రామచంద్ర మోహన్ ఇన్చార్జి బాధ్యతలు తీసుకుంటారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే, బుధవారం రాత్రి వరకూ ఈవోను మార్చుతున్నట్లు ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అంతా సందిగ్ధంలో పడింది. దీనిపై పూర్తి విచారణ చేయించి, నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ప్రకటించడంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన దేవస్థానం వర్గాల్లో నెలకొంది. మరోసారి బయటపడిన విభేదాలు దుర్గగుడి పాలకమండలికి, ఈవో సూర్యకుమారికి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తాంత్రిక పూజలు జరగడంపై తాము గతనెల 30న పాలకమండలిలో చర్చించినా ఈవో సూర్యకుమారి వేగంగా నిర్ణయం తీసుకోలేదని, అందువల్ల ఆమెను ఈవో పదవి నుంచి తొలగించి విచారణ చేయాలంటూ పాలకమండలి సభ్యులు డిమాండ్ చేశారు. అదే సమయంలో కొంతమంది సభ్యులు దేవస్థానంలో జరుగుతున్న కొన్ని అవినీతి వ్యవహారాలను మీడియా వద్ద ఏకరువు పెట్టారు. సూర్యకుమారి కూడా సాయంత్రం 4 గంటలకు తనను కలిసిన మీడియాతో మాట్లాడేటప్పుడు పాలకమండలి సభ్యులను కలుపుకోలేదు. పాలకమండలి సభ్యులు చేసిన వ్యాఖ్యలకు స్పందించలేదు. తాంత్రిక పూజలు జరిగాయని పాలకమండలి సభ్యులు చెబుతుంటే.. కేవలం శుద్ధిచేసే కార్యక్రమమే జరిగిందంటూ ఈవో సూర్యకుమారి చెప్పారు. వైదిక కమిటీ, ఆలయ అర్చకులతో ఆరోజు సంఘటనపై ఈవో సుదీర్ఘంగా చర్చించారు. అదే సమయంలో దేవస్థానం ప్రతిష్ట దెబ్బతినేలా ఎవరూ మాట్లాడటం సరికాదంటూ ఈవో సూర్యకుమారి వ్యాఖ్యలు చేశారు. ఆరోజు ఏం జరిగిందనే అంశంపై తాము విచారణ చేయిస్తున్నామని, మొత్తం నివేదికను ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. మసకబారుతున్న ఆలయ ప్రతిష్ట దుర్గగుడిలో ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు దేవాలయ ప్రతిష్టను మసకబార్చేలా ఉన్నాయి. ఇటీవల దేవస్థానంలో ఒక అటెండర్ చంద్రశేఖర్ టికెట్లు రీసైక్లింగ్ చేస్తుండగా అయ్యప్ప భక్తులకు పట్టుబడ్డాడు. చివరకు చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేశారు. అంతకుముందు విజిలెన్స్ నివేదికలోనూ ఏడాది కాలంగా దేవస్థానంపై జరుగుతున్న అవకతవకలను బహిర్గతం చేశారు. ప్రసాదాల తయారీ నుంచి ఇంజినీరింగ్ విభాగం వరకూ జరుగుతున్న అవినీతిని ఈ నివేదికల్లో విజిలెన్స్ అధికారులు ఏకరువు పెట్టారు. -
భక్తితో తమన్నా
ప్రముఖ నటి తమన్నా సోమవారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సినీనటి తమన్నా సోమవారం దర్శించుకున్నారు. తల్లితో కలిసి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు ఇచ్చారు. తిరిగి వెళ్తున్న తమన్నాతో ఫొటోలు దిగేందుకు భక్తులతో పాటు ఆలయ అధికారులు, సిబ్బంది పోటీపడ్డారు. తమన్నాను చూసిన భక్తులు ‘అవంతిక.. అవంతిక’ అంటూ కేకలు వేశారు. -
ఏపీ భవన్లో కొలువుదీరనున్న కనకదుర్గమ్మ
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఢిల్లీలోని ఏపీ భవన్లో కనకదుర్గమ్మ అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. అమ్మవారికి నిత్యం పూజలు నిర్వహించేలా ఇంద్రకీలాద్రి దేవస్థానం అధికారులు అక్కడి వారితో సంప్రదింపులు జరిపారు. దీంతో నాలుగు అడుగుల అమ్మవారి ప్రతిమను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆదివారం ఢిల్లీ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాల అనంతరం ఏపీ భవన్లో దుర్గమ్మ ప్రతిమను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. -
ఉత్సవ వైభవం
♦ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం ♦ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు ♦ దర్శనానికి తరలివచ్చిన భక్తులు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమం) : స్థానిక దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలి రోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజల అనంతరం ఉదయం 8.30 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అమ్మవారికి నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, దుర్గగుడి ట్రస్టు బోర్డు చైర్మన్ గౌరంగబాబు, ఆలయ ఈఓ సూర్యకుమారి, తొలి పూజలు చేశారు. స్వర్ణకవచంలో దేదీప్యమానంగా ప్రకాశించిన దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తొలిరోజు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవ మూర్తులకు స్నపనాభిషేకం దసరా ఉత్సవాల ప్రారంభాన్ని పురష్కరించుకుని అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఈ ఏడాది ఉత్సవ మూర్తికి కూడా స్నపనాభిషేకం నిర్వహించారు. దుర్గాఘాట్‌లో ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు స్నపనాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ మూర్తులకు నదీ జలాలతో అభిషేకాలు చేశారు. ఆలయ ఈఓ సూర్యకుమారి, పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, పలువురు పోలీసు అధికారులు, ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు, అర్చకులు నదీ జలాలతో అమ్మవారిని అభిషేకించారు. అనంతరం ఉత్సవ మూర్తిని మేళతాళాలు, మంగళవాయిద్యాలతో మహా మండపం ఆరో అంతస్తుకు తీసుకెళ్లి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ప్రతిష్ఠించి పూలు జరిపించారు. మహా మండపం ఆరో అంతస్తులో అమ్మవారికి నిర్వహించిన విశేష కుంకుమార్చనలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. పలు ఆలయాల నుంచి దుర్గమ్మకు సారె తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రముఖ ఆలయాల నుంచి కనకదుర్గమ్మకు సారె తీసుకొచ్చి సమర్పించారు. టీటీడీ తరఫున జాయింట్ ఎగ్జిక్యూటివ్ కమిషనర్ కోలా భాస్కర్, డాలర్ శేషాద్రి ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారికి పట్టుచీర, పూలు, పండ్లు సమర్పించారు. ఐనవిల్లి విఘ్నేశ్వరస్వామి దేవస్థానం ఈఓ మాకిరాజు లక్ష్మీనారాయణ, మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తరఫున ఈఓ ఎం.పానకాలరావు అమ్మవారికి సారె సమర్పించారు. -
ఉత్సవాల ఊసేదీ?
► దసరా ఉత్సవ ఏర్పాట్లకు కసరత్తు శూన్యం ► సమీపిస్తున్న గడువు ► హడావుడి పనులతో భక్తులకు తప్పని ఇక్కట్లు సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఈ ఏడాది కూడా కష్టాలు తప్పేలా లేవు. ఏర్పాట్ల విషయంలో దుర్గగుడి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణం. వచ్చే నెల 21వ తేదీ నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు ఉత్సవ ఏర్పాట్లపై అధికారులు ఏ విధమైన సమావేశాలు నిర్వహించలేదు. కనీసం దసరా పనులకు టెండర్లు పిలిచి, పనులు ఖరారు చేయడం లేదు. మరోవైపు దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దసరా ఉత్సవాల సమయానికి పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. నత్తనడకన నాలుగు లిఫ్ట్‌ల నిర్మాణం... ప్రస్తుతం మల్లికార్జున మహామండపం నుంచి కొండపైకి చేరుకునేందుకు మెట్ల మార్గంతోపాటు రెండు లిఫ్ట్‌లు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు లిఫ్ట్‌లు భక్తులకు సరిపోవడంలేదు. దీంతో లిఫ్ట్‌ల వద్ద భారీగా భక్తులు లైనులో పడిగాపులు పడుతున్నారు. ఒక్కోసారి తోపులాటలు కూడా జరుగుతున్నాయి. దీంతో సుమారు రూ.2.5 కోట్లతో నాలుగు లిఫ్ట్‌లను మహామండపంలో నిర్మిస్తున్నారు. ఒక్కో లిఫ్ట్‌లో ఒకేసారి 25 మంది వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే, లిఫ్ట్‌ల ఏర్పాటు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. దసరా ఉత్సవాలకు ఈ లిఫ్ట్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. దీంతో భక్తులు తప్పనిసరిగా ఏడు అంతస్తులు మెట్ల మార్గంలోనే వెళ్లాలి. లేదా ఘాట్‌రోడ్డులో క్యూ లైనులో వెళ్లాల్సి ఉంటుంది. రోడ్లపై విశ్రాంతి తప్పదా...! సీవీ రెడ్డి చారిటీస్ స్థలంలో భక్తుల కోసం దేవస్థానం రూ.3 కోట్లతో చేపట్టిన డార్మెటరీల నిర్మాణానికి రాజకీయ గ్రహణం పట్టింది. ముందుగా నిర్ణయించిన ప్లాన్‌ను పక్కన పెట్టి ఇప్పుడు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని పాలకమండలి పట్టుబడుతోంది. దీంతో పనులు అంతంతమాత్రంగా సాగుతున్నాయి. నాలుగు షెడ్లతో నిర్మిస్తున్న డార్మెటరీ దసరా ఉత్సవాలకు పూర్తవుతుందని ఇంజినీర్లు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఒకవేళ డార్మెటరీలు పూర్తయినా ఇతర దేవాలయాల నుంచి వచ్చే సిబ్బందికి కేటాయించాలని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ ఏడాది అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు రోడ్లపైనే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అర్జున వీధిలో నడవగలరా... అర్జున వీధి 350 మీటర్లు మేర నిర్మించాల్సి ఉంది. దసరా ఉత్సవాల సమయానికి కేవలం 100 మీటర్లు గ్రానైట్ ఫ్లోరింగ్ వేయించాలని, అక్కడి వరకు పర్గోలా నిర్మించాలని ఇంజినీర్లు నిర్ణయించారు. మిగిలిన రోడ్లు దసరా తర్వాత నిర్మిస్తారు. ప్రస్తుతం పర్గోల పనులు నిలిచిపోయాయి. దీంతో అరకొర పనులతో వదిలేసిన అర్జున వీధిలో భక్తులు నడవడం కష్టంగా మారుతుందని అధికారులే చెబుతున్నారు. ఘాట్‌రోడ్డును మాస్టర్ ప్లాన్‌లో చూపించిన విధంగా దసరాలోపు అభివృద్ధి చేయడం సాధ్యం కాదు. కేవలం భక్తులు నడిచేందుకు క్యూలైన్ల ఏర్పాటుకు అనువుగా మాత్రమే తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఘాట్‌రోడ్డులో గ్రీనరీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ప్రస్తుతం పక్కన పెడుతున్నారు. ఇక కొండపైకి చేరే భక్తులకు నిలువ నీడ ఉండటం లేదు. ఎండ, వానలకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్సవాల సమయంలో అయినా తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. మల్లేశ్వరాలయం నిర్మాణం పూర్తి కాదు దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు శ్రీ మల్లేశ్వరస్వామి దర్శనం చేసుకుంటారు. ప్రస్తుతం మల్లేశ్వరస్వామి దేవాలయం నూతనంగా నిర్మిస్తున్నారు. వాస్తవంగా దసరా నాటికే గ్రానైట్‌తో దేవాలయం నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అయితే, దసరాకు ఈ దేవాలయ నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. దీంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలోనే మల్లేశ్వరస్వామి భక్తులు దర్శించుకోవాల్సి ఉంటుంది. కనీసం ఉప్పటికైనా అధికారులు స్పందించి ఉత్సవాల నిర్వహణపై కసరత్తు ముమ్మరం చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.