ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల భద్రతను గాలికి వదిలే స్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి అధికార పార్టీ నేతలు కొండపైకి ఏడు సీట్ల ఆటోలను అనుమతించే ప్రయత్నాలు చేస్తున్నారు.
సాక్షి,విజయవాడ: ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల భద్రతను గాలికి వదిలేసి, వార్ని నిలువు దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమౌతోంది. అధికారపార్టీ నేతలు కాసులకు కక్కుర్తి పడి ఇంద్రకీలాద్రి పైకి ఏడు సీట్ల (మ్యాజిక్)ఆటోలను అనుమతించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అర్బన్ తెలుగుదేశం పార్టీలో ఉండే ఒక కీలకనేత ఆటోలను కొండపైకి అనుమతించేందుకు పాలకమండలి తీర్మానం చేయాలంటూ కొంత మంది సభ్యులకు సూచించినట్లు సమాచారం.
గతంలో అనేక ఇబ్బందులు....
గతంలో నరసింగరావు ఈవోగా ఉన్నప్పుడు ఆదాయం కోసమని కొండపైకి ఆటోలను అనుమతించారు. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగకపోగా పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ముఖ్యంగా పైన స్థలభావం సమస్య ఏర్పడింది. ఆటో యజమానులు రోజుకు రెండు మూడు ట్రిప్పులు మాత్రమే ఘాట్‌రోడ్డు టోల్ ట్యాక్స్ కట్టి పది నుంచి పదిహేను సార్లు ఆటోలను నడుపుతూ దేవస్థానం ఆదాయానికి గండి కొట్టేవారు. డ్రైవర్లు వేగంగా ఆటోలను నడపడం వల్ల ఏ నిముషంలో ఏ ప్రమాదం జరుగుతుందోననే భయం అందరిలోనూ ఉండేది. ఆ తరువాత ఘాట్ రోడ్డు మరమ్మతులు చేపట్టడంతో పూర్తిగా మూసివేశారు. ఘాట్‌రోడ్డు తెరిచి దేవస్థానం బస్సులు తిప్పుతున్నా ఆటోలను అనుమతిస్తే ప్రమాదాలు జరుగుతాయని అనుమతించలేదు.
ఆటోడ్రైవర్లతో అర్బన్ నేత ఒప్పందం
నగరంలో ఉన్న ఏడు సీట్లు ఆటో డ్రైవర్ల యూనియన్‌తో అర్బన్ తెలుగుదేశం పార్టీ నేత ఒకరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈవోగా సూర్యకుమారి ఉన్నప్పుడే ఆటోల అనుమతి కోసం ఆమెకు నాలుగైదుసార్లు ఈ నేత సిఫార్సు చేసినా ఆమె అంగీకరించలేదు. ప్రస్తుతం ఈవో ఎం.పద్మ పాలకమండలికి సానుకూలంగా ఉండడంతో ఈ నేతకు ప్లస్ పాయింట్ అయింది. యూనియన్ నాయకులతో మరొకసారి చర్చలు జరిపి లక్షల రూపాయలు ముడుపులుగా తీసుకున్నట్లు ఇంద్రకీలాద్రిపై ప్రచారం జరుగుతోంది. రాబోయే పాలకమండలి సమావేశంలో ఆటోల ఆవశ్యకతను వివరిస్తూ ఒక తీర్మానం పెట్టి ఆమోదింపచేయాలని కొంతమంది సభ్యులకు సూచించారు. ఆటోల డ్రైవర్లను టీఎన్‌టీయూసీ సభ్యత్వం ఇప్పించి పార్టీకి సేవ చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు.
భక్తుల నిలువుదోపిడీ
సాధారణ రోజుల్లో 25 వేల మంది పర్వదినాలు, వారంతంలోనూ 40 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. వీరికోసం దేవస్థానం ఏడు బస్సులు ఏర్పాటు చేసింది. ఒకొక్క భక్తుడు రూ.10 చెల్లించి బస్టాండ్, రైల్వేస్టేషన్‌లో దిగవచ్చు. కొండ కిందకు ఉచిత బస్సులు ఉన్నాయి. ఇప్పుడు ఆటోలకు అనుమతిస్తూ ఒకొక్క భక్తుడి వద్ద రూ.30 నుంచి రూ.50 వసూలు చేసుకునేం దుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బస్సుల సంఖ్య తగ్గించి వాటి స్థానంలో ఎక్కువ ఆటోలను పెట్ట డం వల్ల ఆటోడ్రైవర్లకు ఆదాయం పెంచాలని యోచిస్తున్నారు. అదే జరిగితే భక్తులు నిలువు దోపిడీకి గురవుతారు. అసలు ఇంద్రకీలాద్రిపైకి ఆటోలను అనుమతించడం సరికాదు. గ్రీనరీ పేరుతో కొంత రోడ్డును మూసేశారు. మిగిలిన స్థలంలోనూ వీఐపీ, పాలకమండలి సభ్యులు కా ర్లు పార్కింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆటోలను అనుమతిస్తే.. బస్సులకు ఎక్కడ జాగా ఉంటుం దో పాలకమండలి సభ్యులే చెప్పాల్సి ఉంటుంది.
దుర్గాఘాట్ వద్ద షెల్టర్ ఏర్పాటు చేయాలి
దుర్గాఘాట్‌లో స్నానాలు చేసిన భక్తులు దుర్గాఘాట్ వద్ద బస్సుల కోసం మండుటెండలో నడిరోడ్డుపై నిలబడాల్సి వస్తోంది. ఆటోలను అనుమతించడంపై చూపించే శ్రద్ధ ఇక్కడ దుర్గాఘాట్ వద్ద బస్ షెల్డర్‌పై చూపించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment