సాక్షి, విజయవాడ : మరో వారం రోజుల్లో దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. సుమారు 15 లక్షల మంది కంటే ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. గత ఏడాది దసరా ఉత్సవాలకు సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఈ ఏడాది దసరాకు అయ్యే దబారాపై దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మ ప్రత్యేక దృష్టి సారించారు. అనవసరపు ఖర్చుల్ని తగ్గించాలని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాది రూ.8.3 కోట్లు వ్యయంతో దసరా ప్రణాళికలు సిద్ధం చేశారు.
దాతల కోసం అన్వేషణ..
గతంలో శాశ్వత నిర్మాణాల కోసం మాత్రమే దాతల కోసం దేవస్థానం అధికారులు అన్వేషించేవారు. ప్రస్తుతం దసరా ఉత్సవాలకూ దాతల్ని అన్వేషిస్తున్నారు. ఆసక్తి గలవారికి ఒక్కొక్క పనిని అప్పగించి అమ్మవారికి సేవ చేయమని ప్రోత్సహిస్తున్నారు. ద్వారాకామాయి చారిటబుల్ ట్రస్టు ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో అయ్యే బియ్యం, కందిపప్పు ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చింది. 12000 కేజీల బియ్యం, 2,500 కేజీల కందిపప్పు ఉచితంగా ఇచ్చారు. దీంతో అన్న ప్రసాదానికి అయ్యే ఖర్చు తగ్గుతుందని ఈవో కోటేశ్వరమ్మ చెబుతున్నారు.
కోతలు మొదలు..
గతంలో సాంస్కృతిక కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించేవారు. ఈ ఏడాది అమ్మవారిపై భక్తితో కళాకారులు ఉచితంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో అనేక మంది భక్త కళాకారులు ముందుకు వచ్చారు. ఈ వ్యయాన్ని రూ.5 లక్షలకు పరిమితం చేస్తున్నారు. ఉభయదాతలుగా కుంకమార్చనలో పాల్గొన్నే మహిళలకు చీర, రవికెను దేవస్థానం తరఫున ఇవ్వడం ఆనవాయితీ. రవికె ముక్కలు కొనుగోలు చేయకుండా భక్తులు అమ్మవారికి పెట్టినవాటిని అమ్మవారి పేరిట తిరిగి భక్తులకే ఇస్తే వారు భక్తితో ఉపయోగించుకుంటారని, దేవస్థానానికి ఖర్చు తగ్గుతుందని ఈవో నిర్ణయించారు. ఈ వారంలోనూ ఇంకా దాతలు ముందుకు వస్తే వారి సేవలు వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఉత్సవాల పేరుతో ఇష్టానుసారంగా సరుకు కొనుగోలు చేయకుండా ఈవో ఆంక్షలు విధించారని ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. బయట నుంచి వస్తువులు కొనుగోలు చేసే కంటే దేవస్థానం ఆధ్వర్యంలో అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగించుకుని ఉత్సవాలు ఏ విధంగా పూర్తిచేయాలో ఆలోచించాలని ఈవో సూచిస్తున్నట్లు తెలిసింది.
మారాల్సింది ప్రభుత్వం తీరే..
అధికారులు రూపాయి రూపాయి పొదుపు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం దేవస్థానం ఖజానాకు కన్నం వేస్తోంది. దసరా ఉత్సవాలు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. అటువంటప్పుడు అన్ని శాఖలు ఉచితంగా పనిచేయాలి. అయితే పోలీసు శాఖ రూ.75 లక్షలు దేవస్థానం నుంచి వసూలుచేస్తోంది. ఫైర్ డిపార్టుమెంట్‌కు రూ.1.20 లక్షలు, ఎలక్ట్రికల్ మెయింటినెన్స్‌కు రూ.2.5 లక్షలు, జలవనరుల శాఖకు రూ.2 లక్షలు, ఫిషరీస్ డిపార్టుమెంట్‌కు రూ.1.3 లక్షలు చొప్పున ప్రభుత్వం దేవస్థానం నుంచి వసూలు చేస్తోంది. ఇది చాలదన్నట్లు తెలుగుదేశం నేతలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ రూ.25 లక్షలు వరకు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు వచ్చినప్పుడు వారికి సత్కారాలు, దర్శనాలు కోసం దేవస్థానంపై రూ.లక్షల భారం పడుతోంది. భక్తులకు చేసే ఖర్చులపైనే కాకుండా ప్రభుత్వ పక్షం చేసే ఖర్చులపైన ఈవో కోటేశ్వరమ్మ కోత విధిస్తే బాగుంటుందని భక్త బృందాలు అభిప్రాయపడుతున్నాయి. ఇతర శాఖలకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెచ్చే బాధ్యత పాలకమండలే తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment