► దసరా ఉత్సవ ఏర్పాట్లకు కసరత్తు శూన్యం
► సమీపిస్తున్న గడువు
► హడావుడి పనులతో భక్తులకు తప్పని ఇక్కట్లు
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఈ ఏడాది కూడా కష్టాలు తప్పేలా లేవు. ఏర్పాట్ల విషయంలో దుర్గగుడి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణం. వచ్చే నెల 21వ తేదీ నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు ఉత్సవ ఏర్పాట్లపై అధికారులు ఏ విధమైన సమావేశాలు నిర్వహించలేదు. కనీసం దసరా పనులకు టెండర్లు పిలిచి, పనులు ఖరారు చేయడం లేదు. మరోవైపు దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దసరా ఉత్సవాల సమయానికి పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు.
నత్తనడకన నాలుగు లిఫ్ట్‌ల నిర్మాణం...
ప్రస్తుతం మల్లికార్జున మహామండపం నుంచి కొండపైకి చేరుకునేందుకు మెట్ల మార్గంతోపాటు రెండు లిఫ్ట్‌లు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు లిఫ్ట్‌లు భక్తులకు సరిపోవడంలేదు. దీంతో లిఫ్ట్‌ల వద్ద భారీగా భక్తులు లైనులో పడిగాపులు పడుతున్నారు. ఒక్కోసారి తోపులాటలు కూడా జరుగుతున్నాయి. దీంతో సుమారు రూ.2.5 కోట్లతో నాలుగు లిఫ్ట్‌లను మహామండపంలో నిర్మిస్తున్నారు.
ఒక్కో లిఫ్ట్‌లో ఒకేసారి 25 మంది వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే, లిఫ్ట్‌ల ఏర్పాటు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. దసరా ఉత్సవాలకు ఈ లిఫ్ట్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. దీంతో భక్తులు తప్పనిసరిగా ఏడు అంతస్తులు మెట్ల మార్గంలోనే వెళ్లాలి. లేదా ఘాట్‌రోడ్డులో క్యూ లైనులో వెళ్లాల్సి ఉంటుంది.
రోడ్లపై విశ్రాంతి తప్పదా...!
సీవీ రెడ్డి చారిటీస్ స్థలంలో భక్తుల కోసం దేవస్థానం రూ.3 కోట్లతో చేపట్టిన డార్మెటరీల నిర్మాణానికి రాజకీయ గ్రహణం పట్టింది. ముందుగా నిర్ణయించిన ప్లాన్‌ను పక్కన పెట్టి ఇప్పుడు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని పాలకమండలి పట్టుబడుతోంది. దీంతో పనులు అంతంతమాత్రంగా సాగుతున్నాయి. నాలుగు షెడ్లతో నిర్మిస్తున్న డార్మెటరీ దసరా ఉత్సవాలకు పూర్తవుతుందని ఇంజినీర్లు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఒకవేళ డార్మెటరీలు పూర్తయినా ఇతర దేవాలయాల నుంచి వచ్చే సిబ్బందికి కేటాయించాలని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ ఏడాది అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు రోడ్లపైనే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.
అర్జున వీధిలో నడవగలరా...
అర్జున వీధి 350 మీటర్లు మేర నిర్మించాల్సి ఉంది. దసరా ఉత్సవాల సమయానికి కేవలం 100 మీటర్లు గ్రానైట్ ఫ్లోరింగ్ వేయించాలని, అక్కడి వరకు పర్గోలా నిర్మించాలని ఇంజినీర్లు నిర్ణయించారు. మిగిలిన రోడ్లు దసరా తర్వాత నిర్మిస్తారు. ప్రస్తుతం పర్గోల పనులు నిలిచిపోయాయి. దీంతో అరకొర పనులతో వదిలేసిన అర్జున వీధిలో భక్తులు నడవడం కష్టంగా మారుతుందని అధికారులే చెబుతున్నారు.
ఘాట్‌రోడ్డును మాస్టర్ ప్లాన్‌లో చూపించిన విధంగా దసరాలోపు అభివృద్ధి చేయడం సాధ్యం కాదు. కేవలం భక్తులు నడిచేందుకు క్యూలైన్ల ఏర్పాటుకు అనువుగా మాత్రమే తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఘాట్‌రోడ్డులో గ్రీనరీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ప్రస్తుతం పక్కన పెడుతున్నారు. ఇక కొండపైకి చేరే భక్తులకు నిలువ నీడ ఉండటం లేదు. ఎండ, వానలకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్సవాల సమయంలో అయినా తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.
మల్లేశ్వరాలయం నిర్మాణం పూర్తి కాదు
దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు శ్రీ మల్లేశ్వరస్వామి దర్శనం చేసుకుంటారు. ప్రస్తుతం మల్లేశ్వరస్వామి దేవాలయం నూతనంగా నిర్మిస్తున్నారు. వాస్తవంగా దసరా నాటికే గ్రానైట్‌తో దేవాలయం నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అయితే, దసరాకు ఈ దేవాలయ నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. దీంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలోనే మల్లేశ్వరస్వామి భక్తులు దర్శించుకోవాల్సి ఉంటుంది. కనీసం ఉప్పటికైనా అధికారులు స్పందించి ఉత్సవాల నిర్వహణపై కసరత్తు ముమ్మరం చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.