అమ్మవారికి అభిషేకం చేస్తున్న ఈవో సూర్యకుమారి
♦ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం
♦ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు
♦ దర్శనానికి తరలివచ్చిన భక్తులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమం) : స్థానిక దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలి రోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజల అనంతరం ఉదయం 8.30 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అమ్మవారికి నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, దుర్గగుడి ట్రస్టు బోర్డు చైర్మన్ గౌరంగబాబు, ఆలయ ఈఓ సూర్యకుమారి, తొలి పూజలు చేశారు. స్వర్ణకవచంలో దేదీప్యమానంగా ప్రకాశించిన దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తొలిరోజు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.
ఉత్సవ మూర్తులకు స్నపనాభిషేకం
దసరా ఉత్సవాల ప్రారంభాన్ని పురష్కరించుకుని అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఈ ఏడాది ఉత్సవ మూర్తికి కూడా స్నపనాభిషేకం నిర్వహించారు. దుర్గాఘాట్‌లో ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు స్నపనాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ మూర్తులకు నదీ జలాలతో అభిషేకాలు చేశారు. ఆలయ ఈఓ సూర్యకుమారి, పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, పలువురు పోలీసు అధికారులు, ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు, అర్చకులు నదీ జలాలతో అమ్మవారిని అభిషేకించారు. అనంతరం ఉత్సవ మూర్తిని మేళతాళాలు, మంగళవాయిద్యాలతో మహా మండపం ఆరో అంతస్తుకు తీసుకెళ్లి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ప్రతిష్ఠించి పూలు జరిపించారు. మహా మండపం ఆరో అంతస్తులో అమ్మవారికి నిర్వహించిన విశేష కుంకుమార్చనలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు.
పలు ఆలయాల నుంచి దుర్గమ్మకు సారె
తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రముఖ ఆలయాల నుంచి కనకదుర్గమ్మకు సారె తీసుకొచ్చి సమర్పించారు. టీటీడీ తరఫున జాయింట్ ఎగ్జిక్యూటివ్ కమిషనర్ కోలా భాస్కర్, డాలర్ శేషాద్రి ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారికి పట్టుచీర, పూలు, పండ్లు సమర్పించారు. ఐనవిల్లి విఘ్నేశ్వరస్వామి దేవస్థానం ఈఓ మాకిరాజు లక్ష్మీనారాయణ, మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తరఫున ఈఓ ఎం.పానకాలరావు అమ్మవారికి సారె సమర్పించారు.