ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులెవరైనా సరే రాజగోపురం ద్వారానే ఆలయంలోకి ప్రవేశించేలా ఇంద్రకీలాద్రిపై మార్పులు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులెవరైనా సరే రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారు. అమ్మవారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులు, వీఐపీలు, అందరూ కూడా ఇక రాజగోపురం లోపల నుంచి మాత్రమే ఆలయంలోకి ప్రవేశించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇకపై దుర్గగుడిపై కూడా అదే తరహాలో అన్ని క్యూలైన్లు రాజగోపురం ద్వారానే ఆలయంలోకి ప్రవేశించేలా క్యూలైన్లు మార్పు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రాజగోపురం లోపల నుంచి మూడు క్యూలైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
రూ.300, రూ.100, సర్వదర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ఆలయ ఈవో ఎం.పద్మ, చైర్మన్ గౌరంగబాబు, అర్చకులు, దుర్గగుడి ఇంజినీరింగ్ అధికారులు, వెస్ట్ ఏసీపీ జి.రామకృష్ణ సమావేశమయ్యారు. కననకదుర్గానగర్ నుంచి వచ్చే భక్తులు లిఫ్టు ద్వారా కొండపైకి చేరుకున్న తర్వాత రాజగోపురం లోపల నుంచి ఏర్పాటుచేసే క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించేలా మార్పు చేయాలని నిర్ణయించారు. దీనిపై సాధ్యాసా«ధ్యాలు, లోటుపాట్లను అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రాజగోపురం ఎదురుగా ఉన్న వీఐపీ లాంజ్‌లో కొద్దిసేపు దీనిపై చర్చించారు. అయితే, ఘాట్‌రోడ్డు వైపు నుంచి వచ్చే భక్తులను రాజగోపురం లోపల వైపునకు ఏవిధంగా అనుమతించాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment