సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి కార్యనిర్వహణాధికారి(ఈఓ) గా ఐఏఎస్ అధికారిణి ఎం.పద్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి దయ వలనే ఈవో పోస్టు వచ్చిందని, అమ్మే ముందుండి తనను నడిపిస్తోందని చెప్పారు. శాస్ర్తాలకు విరుద్ధంగా కాకుండా భక్తులకు ఉపయోగపడేలా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తానన్నారు. ఎవరి పని వారు చేసుకుంటే ఇబ్బందులు ఏమీ ఉండవని వ్యాఖ్యానించారు. మిగతా ఆలయాల్లో ఏవిధంగా అభివృద్ధి ఉందో ఆవిధంగా చేయాలని అమ్మవారు కలలోకి వచ్చి సూచించారని తెలిపారు. ఆ విధంగా నడుచుకుంటూ ఇంద్రకీలాద్రిపై అభివృద్ది కార్యక్రమాలు చేపడతానని పద్మ హామీ ఇచ్చారు.