
సాక్షి, విజయవాడ: పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్‌నాథ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను గెలిపించి ఈ స్ధానంలో కూర్చోబెట్టే అవకాశం ఇచ్చిన అనకాపల్లి ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. గురుతరమైన బాద్యత నాపై సీఎం ఉంచారు. రాష్ట్రానికి మంచి చేస్తా.. బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తాను.
రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ విషయంలో ఏపీకి మంచి జరిగే విధంగా కృషి చేస్తా. ఏపీలో పారిశ్రామిక అభివృద్ది చేస్తా. ఐటీకి చిరునామాగా ఉన్న విశాఖ నుంచి వచ్చిన వ్యక్తిగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది చేస్తా. విశాఖకి ఐటీ ఆద్యుడైన దివంగత సీఎం వైఎస్సార్ ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తా. చెన్నై, బెంగుళూరు, ముంబయి లాంటి నగరాలతో పోటీ పడగల అవకాశం ఉన్న నగరం విశాఖపట్నం.
పారిశ్రామిక అభివృధ్దికి, పెట్టుబడులకి అనుకూలమైన రాష్ట్రం ఏపీ. 900 కి.మీలకు పైన తీరప్రాంతం, జాతీయ రహదారులు, నాలుగు పోర్టులు ఉన్న రాష్ట్రం మనది. దేశంలోనే గొప్ప పరిపాలనాదక్షుడైన సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పనిచేయడం అదృష్టం. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సేవలను కూడా ఈ సందర్బంగా గుర్తించుకోవాలి.. ఆయన ఆశయాలని కొనసాగిస్తాను అని మంత్రి అమర్‌నాథ్ అన్నారు. ఈ సందర్భంగా రామాయపట్నం పోర్టుకి అవసరమైన భూసేకరణలో భాగంగా రైతులకి ఇచ్చే రూ.8కోట్ల పరిహారంపై తొలి సంతకం చేశారు.