సాక్షి, సింహాచలం(పెందుర్తి): 30 ఏళ్ల క్రితం నాన్న రాష్ట్ర మంత్రిగా తొలిసారి శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆయన చిటికిన వేలు పట్టుకొని సింహగిరిపై నడిచాను.. ఇప్పుడు తాను మంత్రిగా స్వామి దర్శనానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని గురువారం సాయంత్రం ఆయన దర్శించుకున్నారు.
ఆలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు, దేవస్థానం ఈవో సూర్యకళ పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆయన పేరిట అర్చకులు స్వామికి అష్టోత్తరంపూజ నిర్వహించారు. దేవస్థానం తరపున శేషవస్త్రాలు, జ్ఞాపికను, ప్రసాదాన్ని ఈవో అందజేశారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంతో తమ కుటుంబానికి ఎంతో దగ్గర అనుబంధం ఉందన్నారు.
ఆ స్వామిని ఆరాధ్యదైవంగా పూజిస్తామన్నారు. ఆ సింహాద్రినాథుడి ఆశీస్సులు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దయ వల్లే నాకు మంత్రిగా అవకాశం లభించిందన్నారు. పంచగ్రామాల భూసమస్య పరిష్కారానికి ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీ వేసిందని, సమస్య పరిష్కారానికి తన వంతు కృషి కూడా చేస్తానని తెలిపారు. రాజగోపురం వద్ద దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులు సువ్వాడ శ్రీదేవి, దొడ్డి రమణ, పెనుమత్స శ్రీదేవి వర్మ, ప్రత్యేక ఆహ్వానితుడు దొడ్డి రమణ తదితరులు స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment