Sri Varahalakshmi Narasimha Swamy
-
అప్పన్నను దర్శించుకున్న సింగర్ సునీత
సాక్షి, విశాఖపట్నం(సింహాచలం): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం ప్రముఖ సినీ గాయని సునీత దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆమె పేరిట అర్చకులు స్వామికి పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి ప్రసాదాన్ని ఏఈవో రాజు ఆమెకు అందజేశారు. చదవండి: ('హైదరాబాద్‌తో ఎన్నో జ్ఞాపకాలు.. ఎప్పుడో చెప్పలేను కానీ ఖచ్చితంగా చేస్తా') -
కమనీయం.. అప్పన్న నిజరూపం
సాక్షి, విశాఖపట్నం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున నుంచే స్వామి దివ్యరూపాన్ని భక్తులు దర్శించుకున్నారు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే లభించే స్వామివారి నిజరూపాన్ని దర్శనం చేసుకునేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి 2.30 గంటలకే స్వామివారి తొలి నిజరూప దర్శనం చేసుకుని తొలి చందనం సమర్పణ చేశారు. అనంతరం ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరఫున జేఈఓ ధర్మారెడ్డి, టీటీడీ చైర్మన్ సతీమణి స్వర్ణలతారెడ్డిలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం 3.30 నుంచి భక్తులను అనుమతించారు. స్వామి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనరసింహ కదలివచ్చిన భక్తజనం చందనోత్సవ వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు మంగళవారం వేకువజామున నుంచి ప్రారంభించారు. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఒంటిగంటకు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి చందనం ఒలుపును (స్వామిపై ఉన్న చందనాన్ని తొలగించడం) అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి 9 గంటల అనంతరం సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా ఏకాంతంగానే చందనోత్సవం జరగడం, భక్తులెవరినీ దర్శనానికి అనుమతించకపోవడంతో ఈ ఏడాది చందనోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు మంచినీళ్లు, ఆహారం అందించేందుకు దేవస్థానంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లుచేశాయి. సుమారు 2,500 మంది పోలీసులను భద్రత కోసం వినియోగించారు. వైద్యులు, 108 అంబులెన్స్‌లు, ఏఎన్‌ఎంలతోపాటు ఉచిత మందులూ అందుబాటులో ఉంచారు. పోటెత్తిన వీఐపీలు చందనోత్సవం సందర్భంగా మంగళవారం వీఐపీలు పోటెత్తారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు పీడిక రాజన్నదొర, గుడివాడ అమర్నాథ్, చెల్లుబోయిన వేణుగోపాల్, అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీశెట్టి సత్యవతి, మాజీమంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, తోట నరసింహం, వరుదు కల్యాణి, మాధవ్, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, అచ్చెన్నాయుడు, సుప్రీంకోర్డు న్యాయమూర్తి జస్టిస్ నరసింహం తదితరులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. మరోవైపు.. చందనోత్సవ వేళ ఆలయంలో అపచారం జరిగింది. స్వామి గర్భాలయాన్ని ఓ ఆకతాయి వీడియో తీయగా.. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వం ఏర్పాట్లు బాగా చేసింది సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మహాభాగ్యం. తొలిసారిగా నేను చందనోత్సవంలో పాల్గొన్నాను. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి అత్యంత శక్తివంతమైన దేవుడు. ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే శరీరమంతా దివ్యతేజమైనట్లు అనిపించింది. ఇక్కడ భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చాలాబాగా చేసింది. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకున్నా. – తమిళిసై, తెలంగాణ గవర్నర్ వైభవంగా చందనోత్సవం ఈ ఏడాది చందనోత్సవానికి ఏర్పాట్లు అద్భుతంగా చేసి వైభవంగా నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలూ ఈ ఏడాది ఆర్థికంగాను, ప్రజలు ఆరోగ్యకరంగా, అన్ని రకాలుగాను బాగుండాలని కోరుకున్నా. అందరినీ సమన్వయం చేసుకుంటూ దేవస్థానం ఈఓ సూర్యకళ, కలెక్టర్ మల్లికార్జున, సీపీ శ్రీకాంత్, దేవదాయశాఖ నుంచి ఫెస్టివల్ అధికారి భ్రమరాంబ సామాన్య సేవకుల్లా ఉండి భక్తుల సేవలో ఉండటం గొప్ప విషయం. – స్వరూపానందేంద్ర సరస్వతి, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి -
శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వినోదోత్సవం
-
ఉంగరం దొంగలు మీరేనా?
సింహాద్రి నాథుడి ఉంగరం పోయింది. దానికోసం అన్వేషించే క్రమంలో భక్తులను బంధించి విచారించే కార్యక్రమం జరిగింది. అలా అర్చకులకు చిక్కిన విద్యార్థినులు ఉంగరం చోరీలో తమ ప్రమేయం లేదని మొరపెట్టుకున్నారు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని ఆనందభరితులయ్యారు. తమకు మాత్రమే లభించిన ఈ అరుదైన అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సింహాచలం : నిన్న రాత్రి స్వామివారి ఉంగరం పోయింది. మీరే దొంగిలించారని తెలిసింది. దయచేసి దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం... అని స్థానాచార్యులు అడిగేసరికి భక్తులు ఆశ్చర్యపోయారు. స్వామి దర్శనానికి వస్తే ఉంగరం దొంగతనం చేశారంటారేంటి? తాళ్లతో బంధించి తీసుకురావడమేంటి? మేము దొంగల్లా కనిపిస్తున్నామా అంటూ స్థానాచార్యులను భక్తులు ఆవేశంతో ఎదురు ప్రశ్నించారు. చూడండీ.. మీరు దొంగతనం చేసినట్టు మా దగ్గర ఆధారాలున్నాయి. సీసీ కెమెరాల్లో కూడా రికార్డయ్యాయి. పోలీసులు తీసుకెళ్లకముందే ఉంగరాన్ని ఇచ్చేయండంటూ స్థానాచార్యులు ప్రశ్నించే సరికి భక్తుల కళ్లంట నీళ్లు తిరిగాయి. దొంగతనం చేయలేదని చెబుతున్నా వినకుండా, అందరిమధ్యలో మీరే ఉంగరం దొంగతనం చేశారని స్థానాచార్యులు పదేపదే ప్రశ్నించడంతో కన్నీటిపర్యవంతయ్యారు. తమవైపు చూసి నవ్వుతున్న వాళ్లపై ఆవేశంతో చిందులు కూడా వేశారు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టాలని తెలుసుకుని ఆనందభరితులయ్యారు. తమకు మాత్రమే లభించిన ఈ అరుదైన అవకాశంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇదీ... సింహగిరిపై ఆదివారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వినోదోత్సవం. ఈనెల 11 నుంచి వారం రోజుల పాటు జరిగిన స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో దొంగిలించబడ్డ స్వామి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని సింహగిరిపై ఆదివారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఏడు పరదాల్లో దాగున్న స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో కూర్చోబెట్టారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి సీతారామాచార్యులు కర్రను చేతితో పట్టుకుని దర్శనానికి వచ్చిన భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి తీసుకొచ్చారు. స్థానాచార్యులు టీపీ రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాని తొలగించారు. చివరికి ఆయన చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. నగరంలోని మాధవదార ప్రాంతానికి చెందిన శ్రావ్య, జాహ్నవి, శృతి అనే విద్యార్థులు తాము దొంగలం కాదంటూ వ్యక్తం చేసిన ఆందోళన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే స్వామివారి దర్శనానికి గాజువాకకు చెందిన ఎయిర్‌టెల్‌లో పనిచేస్తున్న కల్యాణి, మంజు, మణి, త్రినాథ్, విశాఖకు చెందిన న్యాయవాది పద్మజ, నగరంలోని ఐటీఐ ప్రాంతానికి చెందిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉద్యోగి రమేష్ దంపతులు, తెలంగాణ రాష్ట్రం వేములవాడకు చెందిన సాయికిరణ్ దంపతులు, అనకాపల్లికి చెందిన వంశీధర్, పార్థసారథి సైతం దొంగలుగా చిక్కారు. అలాగే దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ, ఆలయ కొత్వాల్ నాయక్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేష్‌రాజ్, బయ్యవరపు రాధ, ఏఈవో తిరుమలేశ్వరరావు, ఇన్చార్జి ప్రధానార్చకుడు కేకే ప్రసాదాచార్యులు, ఉప ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఆలయ సూపరింటిండెంట్ నిద్దాం నాయుడు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కనకరాజు సైతం దొంగలుగా బందీలయ్యారు. చివరికి దొంగలంటూ భక్తులను ప్రశ్నించిన స్థానాచార్యులను, కర్రపట్టుకుని తాళ్లతో భక్తులను బంధించిన పురోహిత్ అలంకారి సైతం కూడా దొంగలుగా చిత్రీకరింపబడ్డారు. మంత్రి గారూ ఉంగరం ఇచ్చేయండి రాష్ట్రానికి మంత్రిగా ఉండి మీరు కూడా ఉంగరం దొంగతం చేస్తే ఎలాగండీ.. దయచేసి ఉంగరం ఇచ్చేయండంటూ రాష్ట్ర బీసీ వెల్ఫేర్, సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను స్థానాచార్యులు కోకారు. సింహగిరిపై వినోదోత్సవం జరుగుతున్నప్పుడే ఆలయానికి మంత్రి చెల్లుబోయిన దర్శనానికి వచ్చారు. ఆయన రాజగోపురం వద్దకు రాగానే పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి స్థానాచార్యుల ముందు హాజరుపరిచారు. దొంగలించిన ఉంగరం ఇచ్చేయాలంటూ స్థానాచార్యులు మంత్రిని అడిగారు. ఏ ఆపదా రాకూడదని ఆస్వామి రక్ష (తాడు) వేశాడని, స్వామి అనుగ్రహం నాపై ఉందని భావిస్తున్నట్టు మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. వినోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉత్సవం అనంతరం మంత్రి స్వామివారి పల్లకీని మోశారు. -
నాన్న మంత్రిగా ఉన్నప్పుడు వచ్చా.. ఇప్పుడు మంత్రినై వచ్చా..
సాక్షి, సింహాచలం(పెందుర్తి): 30 ఏళ్ల క్రితం నాన్న రాష్ట్ర మంత్రిగా తొలిసారి శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆయన చిటికిన వేలు పట్టుకొని సింహగిరిపై నడిచాను.. ఇప్పుడు తాను మంత్రిగా స్వామి దర్శనానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని గురువారం సాయంత్రం ఆయన దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు, దేవస్థానం ఈవో సూర్యకళ పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆయన పేరిట అర్చకులు స్వామికి అష్టోత్తరంపూజ నిర్వహించారు. దేవస్థానం తరపున శేషవస్త్రాలు, జ్ఞాపికను, ప్రసాదాన్ని ఈవో అందజేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంతో తమ కుటుంబానికి ఎంతో దగ్గర అనుబంధం ఉందన్నారు. ఆ స్వామిని ఆరాధ్యదైవంగా పూజిస్తామన్నారు. ఆ సింహాద్రినాథుడి ఆశీస్సులు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దయ వల్లే నాకు మంత్రిగా అవకాశం లభించిందన్నారు. పంచగ్రామాల భూసమస్య పరిష్కారానికి ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీ వేసిందని, సమస్య పరిష్కారానికి తన వంతు కృషి కూడా చేస్తానని తెలిపారు. రాజగోపురం వద్ద దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులు సువ్వాడ శ్రీదేవి, దొడ్డి రమణ, పెనుమత్స శ్రీదేవి వర్మ, ప్రత్యేక ఆహ్వానితుడు దొడ్డి రమణ తదితరులు స్వాగతం పలికారు. -
దొరకునా.. ఇటువంటి సేవ..
సాక్షి, సింహాచలం: ఆ కుటుంబం తరతరాలుగా లక్ష్మీనృసింహుని సేవలో పునీతమవుతోంది. 300 ఏళ్లకుపైగా ఇంట్లో పీఠం ఏర్పాటు చేసుకుని నిత్య కైంకర్యాలు చేయడమేగాక ఏటా మూడునెలలు సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సేవలు చేస్తోంది. ఆలయం వద్ద కూడా దాససత్రం ఏర్పాటు చేసి భక్తులకు సేవచేస్తోంది. మానవసేవనే మాధవసేవగా.. మాధవసేవనే మానవసేవగా.. భావించటమేగాక త్రికరణశుద్ధిగా ఆచరిస్తోంది. అదే ఒడిశాలోని గంజాం జిల్లా పట్టుపురం గ్రామానికి చెందిన దాసుల కుటుంబం. ప్రస్తుతం ఆ కుటుంబానికి చెందిన లక్ష్మీకాంత్ నాయక్ దాస్ 14 ఏళ్లుగా స్వామికి సేవచేస్తున్నారు. ఆర్జితసేవలు జరిపించడమేగాక భక్తులకు స్వామి విశిష్టతను, సింహాచలం క్షేత్ర ప్రాశస్థ్యాన్ని వివరిస్తున్నారు. లక్ష్మీకాంత్‌నాయక్ దాస్ తాతగారి పెదనాన్న అయిన ముకుంద నాయక్ దాస్ నుంచి ఈ కుటుంబం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి సేవచే స్తోంది. ఒడిశా నుంచి సింహగిరికి వచ్చిన ముకుంద నాయక్ దాస్ ఒక చెట్టుకింద తపస్సు చేసుకుంటూ స్వామిని సేవించుకునేవారు. ముకుంద నాయక్ దాస్ పరమపదించిన తరువాత ఆయన తమ్ముడి కొడుకు రుషీకేశ్ నాయక్ దాస్ తొమ్మిదేళ్ల వయసులో స్వామిసేవ ప్రారంభించారు. రుషీకేశ్ నాయక్ దాసు 95 ఏళ్లపాటు స్వామికి సేవలు అందించారు. ఆయనకు 76వ ఏట సంతానం కలిగింది. 1947లో సింహగిరి క్షేత్రపాలకుడు త్రిపురాంతకస్వామి ఆలయం వద్ద కొంత స్థలాన్ని తీసుకుని ఒడిశా నుంచి సింహగిరికి వచ్చే భక్తుల కోసం దాససత్రం నిర్మాణానికి పునాది వేశారు. ఆయన అనంతరం ఆయన కుమారుడు బుచ్చికిశోర్ నాయక్ దాస్ స్వామికి సేవలందించే బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆయన తమ్ముడు వనమాలి నాయక్ దాస్ స్వామిసేవ చేశారు. వనమాలి నాయక్ దాస్ హయాంలోనే రుషీకేశ్ నాయక్ దాస్ పునాది వేసిన దాససత్రం నిర్మించారు. 2006 వరకు ఆ సత్రంలో ఏటా మూడునెలలు ఉండేవారు. స్వామిని సేవించుకుంటూ, భక్తులకు నిత్యం సత్రంలో భోజనం పెట్టేవారు. వనమాలి నాయక్ దాస్ అనంతరం 2006లో ఆయన కుమారుడు లక్ష్మీకాంత్ నాయక్ దాస్ స్వామి సేవాబాధ్యతలు స్వీకరించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా 2008లో దాససత్రాన్ని తొలగించిన దేవస్థానం ప్రత్యామ్నాయంగా జఠల్‌సాధు మఠానికి వెళ్లే దారిలో కొండపై స్థలాన్ని ఇచ్చింది. అక్కడ సత్రాన్ని నిర్మించిన లక్ష్మీకాంత్ నాయక్ దాస్ తన తండ్రి వనమాలి నాయక్ దాస్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇంట్లో స్వామి పీఠం దాసుడు సింహాచలంలో ఉన్న మూడునెలల్లో స్వామికి ఆర్జితసేవలను వైభవంగా నిర్వహిస్తుంటారు. లక్ష తులసిపూజ, కోలాసేవ, గరుడసేవ, ఊంజల్ సేవ, నిత్యకల్యాణం, నృసింహ హోమం వాటిలో ముఖ్యమైనవి. పట్టుపురంలోని తమ ఇంట్లో శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి పీఠం ఏర్పాటు చేసుకుని సింహాచలం క్షేత్రంలో జరిగే నిత్యపూజా కార్యక్రమాలను ఆచరిస్తున్నారు. సింహాచలం క్షేత్రంలో స్వామికి రోజూ జరిగే భోగాలను అక్కడ కూడా చేస్తుంటారు. అక్కడ భక్తులు సమర్పించే ఆదాయంలో కొంత నగదుని తీసుకొచ్చి సింహాచల క్షేత్రంలో స్వామికి సమర్పిస్తారు. తులసి, నూనె ప్రసాదం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి అంతరాలయంలో రోజూ పూజ చేసిన అనంతరం తులసిని, ఆలయ ప్రాంగణంలోని గంగమ్మతల్లి సన్నిధిలో దీపాన్ని వెలిగించి ఆ కుందెలో నూనెను దాసుడు భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటారు. వీటిని స్వీకరిస్తే ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. ఈ ప్రసాదం కోసం ఒడిశా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా వస్తారు. సెప్టెంబర్‌లో ప్రారంభమైన లక్ష్మీకాంత్ నాయక్ దాస్ సేవలు ఏటా మే నెల నుంచి మూడు నెలలపాటు స్వామికి దాసుడు సేవలు చేయడం పరిపాటి. కానీ ఈఏడాది కరోనా కారణంగా లక్ష్మీకాంత్ నాయక్ దాస్ సెప్టెంబర్‌లో సింహగిరికి వచ్చారు. ఇప్పటికే నిత్యకల్యాణం, గరుడసేవ, నృసింహహోమం నిర్వహించారు. -
ఉంగరం దొంగలు మీరేనా...!
సింహగిరిపై భక్తులను ప్రశ్నించిన అర్చకులు కన్నీటిపర్యవంతమైన భక్తులు ఉత్సవమని తెలుసుకుని ఆనందభాష్పాలు నవ్వుల సందడిగా జరిగిన వినోదోత్సవం సింహాచలం: ‘‘నిన్న రాత్రి స్వామివారి ఉంగరం పోయింది. మీరే దొంగిలించారని తెలిసింది. దయచేసి దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం...’’ అని స్థానాచార్యులు అడిగేసరికి భక్తులు ఆశ్చర్యపోయారు. స్వామి దర్శనానికి వస్తే ఉంగరం దొంగతనం చేశారంటారేంటి? తాళ్లతో బంధించి తీసుకురావడమేంటి? మేము దొంగల్లా కనిపిస్తున్నామా అంటూ స్థానాచార్యులను భక్తులు ఆవేశంతో ఎదురు ప్రశ్నించారు. చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. సీసీ కెమోరాల్లో కూడా రికార్డయ్యాయి. పోలీసులు తీసుకెళ్లకముందే ఉంగరాన్ని ఇచ్చేయండంటూ స్థానాచార్యులు మరల ప్రశ్నించేసరికి భక్తుల కళ్లంట నీళ్లు తిరిగాయి. దొంగతనం చేయలేదని చెబుతున్నా వినకుండా, అందరిమధ్యలో మీరే ఉంగరం దొంగతనం చేశారని స్థానాచార్యులు పదేపదే ప్రశ్నిచడంతో కన్నీటిపర్యవంతమవుతూ భక్తులు గంతులు వేశారు. తమ వైపు చూసి నవ్వుతున్న వాళ్లపై ఆవేశంతో చిందులు వేశారు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టాలని తెలుసుకుని ఆనందభరితులయ్యారు. తమకు మాత్రమే లభించిన ఈ అరుదైన అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదీ... సింహగిరిపై శనివారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వినోదోత్సవం. ఈ నెల 17 నుంచి వారం రోజుల పాటు జరుగుతున్న స్వామివారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన స్వామివారి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని సింహగిరిపై శనివారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఏడు పరదాల్లో దాగున్న స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లికీలో ఆశీనింపజేశారు. స్వామివారి దూతగా అర్చకుడు సీతారామాచార్యులు కర్రను చేతితో పట్టుకుని దర్శనానికి వచ్చిన భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి తీసుకొచ్చారు. స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ వారిని ప్రశ్నల వర్షం కురిపించారు. స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాని తొలగించారు. చివరికి ఆయన చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. స్వామివారి దర్శనానికి ఎస్‌కోట నుంచి వచ్చిన డిగ్రీ విద్యార్థులు, నగరంలోని గాయత్రి విద్యా పరిషత్‌లో బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న మచిలీపట్నంకి చెందిన విద్యార్థినులు, గాజువాక కి చెందిన ఇంటర్ విద్యార్థినులు, విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన భక్తులు తాము దొంగతనం చేయలేదంటూ కన్నీటిపర్యవంతమయ్యారు. అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, దేవస్థానం రిటైర్డ్ ప్రధాన పురోహితులు మోర్తా సీతారామాచార్యులు, ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, ఏఈవొ మోర్తా వెంకటకృష్ణమాచార్యులు, ఏఈ రాంబాబు, సూపరింటిండెంట్ ఆనందకుమార్, కొత్వాల్‌నాయక్ మాణిక్యం, వంటశాల సిబ్బంది శ్రీను, కొత్తగా పెళ్లి చేసుకుని స్వామి దర్శనానికి వచ్చి నవ దంపతులు, మహిళలు సైతం దొంగలుగా చిక్కారు.