ఉంగరం దొంగలు మీరేనా...! | vinod utsavam in simhachalam | Sakshi
Sakshi News home page

ఉంగరం దొంగలు మీరేనా...!

Published Sun, Apr 24 2016 9:41 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

ఉంగరం దొంగలు మీరేనా...!

ఉంగరం దొంగలు మీరేనా...!

సింహగిరిపై భక్తులను ప్రశ్నించిన అర్చకులు
కన్నీటిపర్యవంతమైన భక్తులు
ఉత్సవమని తెలుసుకుని ఆనందభాష్పాలు
నవ్వుల సందడిగా జరిగిన వినోదోత్సవం
 
సింహాచలం: ‘‘నిన్న రాత్రి స్వామివారి ఉంగరం పోయింది. మీరే దొంగిలించారని తెలిసింది. దయచేసి దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం...’’ అని స్థానాచార్యులు అడిగేసరికి భక్తులు ఆశ్చర్యపోయారు. స్వామి దర్శనానికి వస్తే ఉంగరం దొంగతనం చేశారంటారేంటి? తాళ్లతో బంధించి తీసుకురావడమేంటి? మేము దొంగల్లా కనిపిస్తున్నామా అంటూ స్థానాచార్యులను భక్తులు ఆవేశంతో ఎదురు ప్రశ్నించారు.
 
చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. సీసీ కెమోరాల్లో కూడా రికార్డయ్యాయి. పోలీసులు తీసుకెళ్లకముందే ఉంగరాన్ని ఇచ్చేయండంటూ స్థానాచార్యులు మరల ప్రశ్నించేసరికి భక్తుల కళ్లంట నీళ్లు తిరిగాయి. దొంగతనం చేయలేదని చెబుతున్నా వినకుండా, అందరిమధ్యలో మీరే ఉంగరం దొంగతనం చేశారని స్థానాచార్యులు పదేపదే ప్రశ్నిచడంతో కన్నీటిపర్యవంతమవుతూ భక్తులు గంతులు వేశారు.

తమ వైపు చూసి నవ్వుతున్న వాళ్లపై ఆవేశంతో చిందులు వేశారు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టాలని తెలుసుకుని ఆనందభరితులయ్యారు. తమకు మాత్రమే లభించిన ఈ అరుదైన అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదీ... సింహగిరిపై శనివారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వినోదోత్సవం.
 
ఈ నెల 17 నుంచి వారం రోజుల పాటు జరుగుతున్న స్వామివారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన స్వామివారి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని సింహగిరిపై శనివారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఏడు పరదాల్లో దాగున్న స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లికీలో ఆశీనింపజేశారు. స్వామివారి దూతగా అర్చకుడు సీతారామాచార్యులు కర్రను చేతితో పట్టుకుని దర్శనానికి వచ్చిన భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి తీసుకొచ్చారు.
 
స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ వారిని ప్రశ్నల వర్షం కురిపించారు. స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాని తొలగించారు. చివరికి ఆయన చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. స్వామివారి దర్శనానికి ఎస్‌కోట నుంచి వచ్చిన డిగ్రీ విద్యార్థులు, నగరంలోని గాయత్రి విద్యా పరిషత్‌లో బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న మచిలీపట్నంకి చెందిన విద్యార్థినులు, గాజువాక కి చెందిన ఇంటర్ విద్యార్థినులు, విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన భక్తులు తాము దొంగతనం చేయలేదంటూ కన్నీటిపర్యవంతమయ్యారు.
 
అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, దేవస్థానం రిటైర్డ్ ప్రధాన పురోహితులు మోర్తా సీతారామాచార్యులు, ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, ఏఈవొ మోర్తా వెంకటకృష్ణమాచార్యులు, ఏఈ రాంబాబు, సూపరింటిండెంట్ ఆనందకుమార్, కొత్వాల్‌నాయక్ మాణిక్యం, వంటశాల సిబ్బంది శ్రీను, కొత్తగా పెళ్లి చేసుకుని స్వామి దర్శనానికి వచ్చి నవ దంపతులు, మహిళలు సైతం దొంగలుగా చిక్కారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement