సింహాద్రి నాథుడి ఉంగరం పోయింది. దానికోసం అన్వేషించే క్రమంలో భక్తులను బంధించి విచారించే కార్యక్రమం జరిగింది. అలా అర్చకులకు చిక్కిన విద్యార్థినులు ఉంగరం చోరీలో తమ ప్రమేయం లేదని మొరపెట్టుకున్నారు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని ఆనందభరితులయ్యారు. తమకు మాత్రమే లభించిన ఈ అరుదైన అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
సింహాచలం : నిన్న రాత్రి స్వామివారి ఉంగరం పోయింది. మీరే దొంగిలించారని తెలిసింది. దయచేసి దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం... అని స్థానాచార్యులు అడిగేసరికి భక్తులు ఆశ్చర్యపోయారు. స్వామి దర్శనానికి వస్తే ఉంగరం దొంగతనం చేశారంటారేంటి? తాళ్లతో బంధించి తీసుకురావడమేంటి? మేము దొంగల్లా కనిపిస్తున్నామా అంటూ స్థానాచార్యులను భక్తులు ఆవేశంతో ఎదురు ప్రశ్నించారు. చూడండీ.. మీరు దొంగతనం చేసినట్టు మా దగ్గర ఆధారాలున్నాయి. సీసీ కెమెరాల్లో కూడా రికార్డయ్యాయి. పోలీసులు తీసుకెళ్లకముందే ఉంగరాన్ని ఇచ్చేయండంటూ స్థానాచార్యులు ప్రశ్నించే సరికి భక్తుల కళ్లంట నీళ్లు తిరిగాయి. దొంగతనం చేయలేదని చెబుతున్నా వినకుండా, అందరిమధ్యలో మీరే ఉంగరం దొంగతనం చేశారని స్థానాచార్యులు పదేపదే ప్రశ్నించడంతో కన్నీటిపర్యవంతయ్యారు. తమవైపు చూసి నవ్వుతున్న వాళ్లపై ఆవేశంతో చిందులు కూడా వేశారు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టాలని తెలుసుకుని ఆనందభరితులయ్యారు. తమకు మాత్రమే లభించిన ఈ అరుదైన అవకాశంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ... సింహగిరిపై ఆదివారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వినోదోత్సవం. ఈనెల 11 నుంచి వారం రోజుల పాటు జరిగిన స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో దొంగిలించబడ్డ స్వామి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని సింహగిరిపై ఆదివారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఏడు పరదాల్లో దాగున్న స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో కూర్చోబెట్టారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి సీతారామాచార్యులు కర్రను చేతితో పట్టుకుని దర్శనానికి వచ్చిన భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి తీసుకొచ్చారు.
స్థానాచార్యులు టీపీ రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాని తొలగించారు. చివరికి ఆయన చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. నగరంలోని మాధవదార ప్రాంతానికి చెందిన శ్రావ్య, జాహ్నవి, శృతి అనే విద్యార్థులు తాము దొంగలం కాదంటూ వ్యక్తం చేసిన ఆందోళన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే స్వామివారి దర్శనానికి గాజువాకకు చెందిన ఎయిర్‌టెల్‌లో పనిచేస్తున్న కల్యాణి, మంజు, మణి, త్రినాథ్, విశాఖకు చెందిన న్యాయవాది పద్మజ, నగరంలోని ఐటీఐ ప్రాంతానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉద్యోగి రమేష్ దంపతులు, తెలంగాణ రాష్ట్రం వేములవాడకు చెందిన సాయికిరణ్ దంపతులు, అనకాపల్లికి చెందిన వంశీధర్, పార్థసారథి సైతం దొంగలుగా చిక్కారు.
అలాగే దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ, ఆలయ కొత్వాల్ నాయక్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేష్‌రాజ్, బయ్యవరపు రాధ, ఏఈవో తిరుమలేశ్వరరావు, ఇన్‌చార్జి ప్రధానార్చకుడు కేకే ప్రసాదాచార్యులు, ఉప ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఆలయ సూపరింటిండెంట్ నిద్దాం నాయుడు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కనకరాజు సైతం దొంగలుగా బందీలయ్యారు. చివరికి దొంగలంటూ భక్తులను ప్రశ్నించిన స్థానాచార్యులను, కర్రపట్టుకుని తాళ్లతో భక్తులను బంధించిన పురోహిత్ అలంకారి సైతం కూడా దొంగలుగా చిత్రీకరింపబడ్డారు.
మంత్రి గారూ ఉంగరం ఇచ్చేయండి
రాష్ట్రానికి మంత్రిగా ఉండి మీరు కూడా ఉంగరం దొంగతం చేస్తే ఎలాగండీ.. దయచేసి ఉంగరం ఇచ్చేయండంటూ రాష్ట్ర బీసీ వెల్ఫేర్, సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను స్థానాచార్యులు కోకారు. సింహగిరిపై వినోదోత్సవం జరుగుతున్నప్పుడే ఆలయానికి మంత్రి చెల్లుబోయిన దర్శనానికి వచ్చారు. ఆయన రాజగోపురం వద్దకు రాగానే పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి స్థానాచార్యుల ముందు హాజరుపరిచారు. దొంగలించిన ఉంగరం ఇచ్చేయాలంటూ స్థానాచార్యులు మంత్రిని అడిగారు. ఏ ఆపదా రాకూడదని ఆస్వామి రక్ష (తాడు) వేశాడని, స్వామి అనుగ్రహం నాపై ఉందని భావిస్తున్నట్టు మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. వినోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉత్సవం అనంతరం మంత్రి స్వామివారి పల్లకీని మోశారు.
Comments
Please login to add a commentAdd a comment