
సాక్షి, విజయవాడ: బెజవాడ కనకదుర్గ చీర దొంగతనం కేసుకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన మాజీ పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత సంచలన ఆరోపణలు చేశారు. దుర్గగుడిలో ఓపీడిఎస్‌కు చెందిన మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. పాలక మండలి సభ్యులు వెలగపూడి శంకరబాబు గుడిలో పనిచేసే మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. గతంలో బాధిత మహిళలు శంకరబాబుపై ఫిర్యాదు చేసినా చైర్మన్ గౌరంబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఫిర్యాదులను గౌరంబాబు పట్టించుకోకపోవడమే కాకుండా శంకరబాబును వెనకేసుకొచ్చేవాడని మండిపడ్డారు.
ఆలయంలో అక్రమాలు
ఆలయ అభివృద్ది పనుల్లో భాగంగా సీసీ రోడ్, ఘాట్‌రోడ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. చైర్మన్ అక్రమాలను వ్యతిరేకించినందుకే తనపై కక్ష్య కట్టారని పేర్కొన్నారు. చీరల విషయంలో లక్షల అక్రమాలు జరిగాయని, వాటిని ప్రశ్నించినందుకు తనను చీరల దొంగగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక దర్యాప్తు జరపకుండానే తనను తొలిగించారని, తాను ఏ తప్పు చేయలేదని సూర్యలత స్పష్టంచేశారు.