2,858 కోట్లతో టీటీడీ బడ్జెట్
2017– 18 వార్షిక బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2017–2018 ఆర్థిక సంవత్సరానికి రూ.2,858.48 కోట్ల అంచనాలతో బడ్జెట్ ఆమోదించింది. 2016–17లో టీటీడీ రూ.2,678 కోట్లతో బడ్జెట్ ఆమోదించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో హుండీ కానుకలు రూ.1010 కోట్లు రావచ్చని అంచనా వేయగా రూ.1,110 కోట్లకు పెరిగాయని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు తెలిపారు. మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో బడ్జెట్‌తోపాటు పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్టు చైర్మన్, ఈవో ప్రకటించారు.
శ్రీవారికి రూ.11 కోట్లతో కాసుల హారం
తిరుమల శ్రీవారికి రూ.11 కోట్లతో 30 కిలోల బంగారు సహస్ర కాసుల హారం తయారు చేయాలని నిర్ణయించారు. 2012లో అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు రామలింగరాజు కానుకగా ఇచ్చిన రూ.10.91 కోట్ల నగదును ఈ హారం తయారీకి వాడనున్నట్టు చైర్మన్, ఈవో వెల్లడించారు. తిరుమలలో రూ.5కోట్లతో సర్వదర్శనం భక్తులకు కొత్త కాంప్లెక్స్ నిర్మించాలని తీర్మానించారు.
2017–18 ఆదాయ అంచనా
► 2017–18 ఆర్థిక సంవత్సరంలో హుండీ ద్వారా రూ.1,110 కోట్లు‡రావచ్చని అంచనా వేశారు.
► వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్న సుమారు రూ.10వేల కోట్లపై వడ్డీ రూ.807.72 కోట్లు రావచ్చని అంచనా వేశారు.
► ఇక రూ.500 వీఐపీ దర్శనం రూ.28 కోట్లు, రూ.50 సుదర్శనం రూ.3కోట్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విక్రయం రూ.225 కోట్లు వసూలు కావచ్చని భావిస్తున్నారు.
► ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.55 కోట్లు, లడ్డూ, ఇతర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.165 కోట్లు, గదుల అద్దె వసూళ్ల ద్వారా రూ.124 కోట్లు రావచ్చని అంచనావేశారు.
► కల్యాణకట్టలో భక్తులు సమర్పించే తలనీలాల విక్రయం ద్వారా రూ.100 కోట్లు, బంగారు డాలర్ల విక్రయం వల్ల రూ.20 కోట్లు, సెక్యూరిటీ డిపాజిట్లు, ఉద్యోగుల రుణాలపై రూ.56.51 కోట్లు, దుకాణాలు, జనతా హోటళ్ల అద్దెలు, టోల్‌గేట్ ప్రవేశ రుసుం, పుస్తక విక్రయం, ఇతర ఆదాయాల ద్వారా 164.25 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా.
2017–2018 వ్యయాల అంచనా
► ఉద్యోగుల జీతాల కోసం రూ.575 కోట్లు, పెట్టుబ డులు రూ.533.21 కోట్లు, సరుకుల కొనుగోళ్లు రూ.471.85 కోట్లు, పెన్షన్ ట్రస్టుకు రూ.185 కోట్లు, పెన్షన్ ఫండ్ రూ.75 కోట్లు కేటాయించారు.
► గ్రాంట్లు రూ.192 కోట్లు, స్థిరాస్తులు, ఔట్ సోర్సింగ్ ఖర్చులు రూ.253.25 కోట్లు, విద్యుత్ చార్జీలు రూ.52 కోట్లు, స్థిరాస్తుల నిర్వహణ ఖర్చులు రూ.85.70 కోట్లు, ఉద్యోగుల బ్రహ్మోత్సవ బహుమానం, ఇతర ఖర్చులు రూ.26 కోట్లు, ప్రచారానికి రూ.8.5 కోట్లు, ఇతర చిల్లర ఖర్చులు రూ.149.46 కోట్లు కేటాయించారు.