Cadalavada Krishnamurthy
-
ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
వైభవంగా ధ్వజారోహణ ఒంటిమిట్ట రామాలయం (రాజంపేట): వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట (ఏకశిలానగరం)లో శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి వేదపండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగించారు. ముత్యాల తలంబ్రాల ఊరేగింపు శ్రీసీతారాముల కల్యాణానికి టీటీడీ తీసుకొ చ్చిన ముత్యాల తలంబ్రాలను ఊరేగించారు. టీటీడీ చైర్మన్ చదల వాడ కృష్ణమూర్తి, ప్రభు త్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ముత్యాల తలంబ్రా లను ఆలయంలోని మూలవర్ల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. 10న కల్యాణోత్సవం ఒంటిమిట్ట రామాలయంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ అమలు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. ఆలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విçస్తృతంగా ఏర్పాట్లు చేసిందన్నారు. ఈనెల 10న సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. కల్యాణానికి గవర్నర్, ముఖ్యమంత్రి హాజరవుతారని చెప్పారు. -
2,858 కోట్లతో టీటీడీ బడ్జెట్
2017– 18 వార్షిక బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2017–2018 ఆర్థిక సంవత్సరానికి రూ.2,858.48 కోట్ల అంచనాలతో బడ్జెట్ ఆమోదించింది. 2016–17లో టీటీడీ రూ.2,678 కోట్లతో బడ్జెట్ ఆమోదించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో హుండీ కానుకలు రూ.1010 కోట్లు రావచ్చని అంచనా వేయగా రూ.1,110 కోట్లకు పెరిగాయని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు తెలిపారు. మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో బడ్జెట్‌తోపాటు పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్టు చైర్మన్, ఈవో ప్రకటించారు. శ్రీవారికి రూ.11 కోట్లతో కాసుల హారం తిరుమల శ్రీవారికి రూ.11 కోట్లతో 30 కిలోల బంగారు సహస్ర కాసుల హారం తయారు చేయాలని నిర్ణయించారు. 2012లో అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు రామలింగరాజు కానుకగా ఇచ్చిన రూ.10.91 కోట్ల నగదును ఈ హారం తయారీకి వాడనున్నట్టు చైర్మన్, ఈవో వెల్లడించారు. తిరుమలలో రూ.5కోట్లతో సర్వదర్శనం భక్తులకు కొత్త కాంప్లెక్స్ నిర్మించాలని తీర్మానించారు. 2017–18 ఆదాయ అంచనా ► 2017–18 ఆర్థిక సంవత్సరంలో హుండీ ద్వారా రూ.1,110 కోట్లు‡రావచ్చని అంచనా వేశారు. ► వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్న సుమారు రూ.10వేల కోట్లపై వడ్డీ రూ.807.72 కోట్లు రావచ్చని అంచనా వేశారు. ► ఇక రూ.500 వీఐపీ దర్శనం రూ.28 కోట్లు, రూ.50 సుదర్శనం రూ.3కోట్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విక్రయం రూ.225 కోట్లు వసూలు కావచ్చని భావిస్తున్నారు. ► ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.55 కోట్లు, లడ్డూ, ఇతర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.165 కోట్లు, గదుల అద్దె వసూళ్ల ద్వారా రూ.124 కోట్లు రావచ్చని అంచనావేశారు. ► కల్యాణకట్టలో భక్తులు సమర్పించే తలనీలాల విక్రయం ద్వారా రూ.100 కోట్లు, బంగారు డాలర్ల విక్రయం వల్ల రూ.20 కోట్లు, సెక్యూరిటీ డిపాజిట్లు, ఉద్యోగుల రుణాలపై రూ.56.51 కోట్లు, దుకాణాలు, జనతా హోటళ్ల అద్దెలు, టోల్గేట్ ప్రవేశ రుసుం, పుస్తక విక్రయం, ఇతర ఆదాయాల ద్వారా 164.25 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా. 2017–2018 వ్యయాల అంచనా ► ఉద్యోగుల జీతాల కోసం రూ.575 కోట్లు, పెట్టుబ డులు రూ.533.21 కోట్లు, సరుకుల కొనుగోళ్లు రూ.471.85 కోట్లు, పెన్షన్ ట్రస్టుకు రూ.185 కోట్లు, పెన్షన్ ఫండ్ రూ.75 కోట్లు కేటాయించారు. ► గ్రాంట్లు రూ.192 కోట్లు, స్థిరాస్తులు, ఔట్ సోర్సింగ్ ఖర్చులు రూ.253.25 కోట్లు, విద్యుత్ చార్జీలు రూ.52 కోట్లు, స్థిరాస్తుల నిర్వహణ ఖర్చులు రూ.85.70 కోట్లు, ఉద్యోగుల బ్రహ్మోత్సవ బహుమానం, ఇతర ఖర్చులు రూ.26 కోట్లు, ప్రచారానికి రూ.8.5 కోట్లు, ఇతర చిల్లర ఖర్చులు రూ.149.46 కోట్లు కేటాయించారు. -
తిరుమలలో దీపావళి స్పెషల్
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపావళి ఆస్థానం అత్యంత వైభవంగా జరిగింది. ఏటా దీపావళి పండగ రోజు ఆస్థానం నిర్వహించటం ఆనవాయితీ. స్వామి సన్నిధిలోని బంగారు వాకిలి ఎదుట సర్వభూపాల వాహనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి పూజలు నిర్వహించారు. ఆస్థానం నేపథ్యంలో సుప్రభాతం మినహా ఆర్జిత సేవలన్నింటిని తితిదే రద్దు చేసింది. తితిదే అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు దంపతులు ఆస్థానం కార్యక్రమంలో పాల్గొన్నారు. -
భారీ వర్షాలతో తిరుమలకు జలకళ
వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన వర్షాలు.. నీటి ఎద్దడితో అల్లాడుతున్న తిరుమలకు స్వాంతన నిచ్చాయి. తిరుమలలోని జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. మంగళవారం ఆకాశగంగ, గోగర్భం డ్యాములు పొంగి పొర్లాయి. పాపవినాశనం, కుమారధార, పసుపుధార ప్రాజెక్టుల్లో 70శాతం నీరు చేరింది. ఈ వర్షాల పుణ్యమా అని ఏడాదికి సరిపడా తాగునీరు చేరింది. శ్రీవారి దర్శనం కోసం రోజూ 70 వేల మంది భక్తులు వస్తుంటారు. వీరి అవసరాలతోపాటు ఆలయం, నిత్యాన్న ప్రసాదం కోసం 32 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతోంది. ప్రస్తుతం ఐదు జలాశయాల్లో చేరిన నీరు ఏడాదికి సరిపోతుందని టీటీడీ ఇంజినీర్లు చెబుతున్నారు. ఇక తిరుపతి కల్యాణీ డ్యాంలోనూ 35 శాతం నీరు చేరింది. దాంతో పాటు తెలుగుగంగ నీరు రోజూ 7 నుంచి 8 ఎంఎల్డీలు అందుతోంది. అవసరాన్ని బట్టి వినియోగించుకుంటే ఏడాదిన్నర కాలానికి ఎలాంటి ఢోకా లేదని ఇంజినీర్ల అభిప్రాయం. కాగా, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు మంగళవారం జలాశయాలను సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. -
రేసులో నిలిచిన చదలవాడ..
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఏర్పాటకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోర్డు ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. వారం రోజుల్లో కొత్త పాలకమండలి ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోనున్నారు. చైర్మన్, 18మంది సభ్యులతో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే పాలకమండలి పదవీకాలాన్ని ఏడాదికి కుదించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు టీటీడీ చైర్మన్‌గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి పేరు ఖరారు అయినట్లు సమాచారం. ఇక పాలకమండలి సభ్యులుగా సినీ దర్శకుడు కే.రాఘవేంద్రరావు, సీఎం రవిశంకర్, ఎమ్మెల్యేలు నారాయణస్వామి నాయుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఆకుల సత్యనారాయణ, జిల్లాకు చెందిన బీజేపీ నేత జీ.భానుప్రకాష్‌రెడ్డి, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరిని సభ్యులుగా నియమించనున్నారు. అలాగే బోర్డు సభ్యులుగా తెలంగాణ టీడీపీ నేతలకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు తెలుస్తోంది. సండ్ర వెంకట వీరయ్య, సాయన్న, మేడ ప్రతాప్ రెడ్డికి చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. -
చదలవాడకే పట్టం !
* టీటీడీ పాలక మండలినియామకంపై సీఎం చంద్రబాబు కసరత్తు పూర్తి * ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు బోర్డు చైర్మన్‌గా ఎంపిక * బోర్డులో జిల్లా నుంచి బీజేపీ నేత జీ.భానుప్రకాష్‌రెడ్డికి అవకాశం సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి నియామకంపై సీఎం చంద్రబాబు కసరత్తును పూర్తిచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని బోర్డు చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించారు. బోర్డు సభ్యులుగా సినీ దర్శకుడు కే.రాఘవేంద్రరావు, సీఎం రవిశంకర్, ఎమ్మెల్యేలు నారాయణస్వామినాయుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఆకుల సత్యనారాయణ, జిల్లాకు చెందిన బీజేపీ నేత జీ.భానుప్రకాష్‌రెడ్డి, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరిని సభ్యులుగా నియమించనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు అక్టోబర్ మొదటి వారంలో వెలువడే అకాశం ఉందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. టీటీడీ చైర్మన్‌గా పదవీ కాలం పూర్తయ్యే వరకూ కుర్చీ దిగేది లేదని భీష్మించిన కనుమూరి బాపిరాజును ఆర్డినెన్స్ ద్వారా ఆగస్టు 14న ప్రభుత్వం పదవీచ్యుతుడిని చేసింది. ఆ తర్వాత రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి జగదీష్‌చంద్ర శర్మ అధ్యక్షతన స్పెసిఫైడ్ అథారిటీని నియమించింది. టీటీడీకి పాలక మండలి నియమించాలని టీడీపీ వర్గాల నుంచి తీవ్రస్థాయిలో వచ్చిన ఒత్తిళ్లకు చంద్రబాబు తలొగ్గారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని ఎరగావేసి నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చంద్రబాబు టీడీపీ తీర్థం ఇచ్చారు. ఎన్నికల్లో తిరుపతి శాసనసభ స్థానం అభ్యర్థిత్వాన్ని ఆశించిన చదలవాడ కృష్ణమూర్తిని టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని ఇస్తానని హామీ ఇచ్చి సంతృప్తిపరిచారు. ఆ మేరకు చదలవాడకు చంద్రబాబు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్న రాయపాటికి చెందిన సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా రూ.200 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా అప్పగించిన చంద్రబాబు.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి నుంచి ఆయనను తప్పుకునేలా చేశారు. ఇదే సమయంలోనే టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోసం చదలవాడ కృష్ణమూర్తి, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు పోటీపడ్డారు. గాలికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వొద్దని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. చదలవాడకు బోర్డు చైర్మన్ పదవి ఇవ్వకూడదని సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే వెంకటరమణ ఒత్తిడి తెచ్చారు. ఇదే అంశంపై బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ద్వారా సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. మాజీ మంత్రి గాలికి ఎమ్మెల్సీ పదవి ఇస్తాననే ఆశ చూపి.. టీటీడీ బోర్డు చైర్మన్ రేసు నుంచి ఆయన తప్పుకునేలా చేయడంలో చంద్రబాబు సఫలీకృతులయ్యారు. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో చదలవాడకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీని నిలుపుకోలేకపోతే.. ఎన్నికల్లో ఆయన వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందని చంద్రబాబు భావించారు. ఆ క్రమంలోనే తన అస్మదీయుడు మాగంటి మురళీమోహన్‌కు ఇవ్వాలనుకున్న టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని చదలవాడకు కట్టబెట్టాలని నిర్ణయించారు. సాధారణంగా టీటీడీ పాలక మండలి పదవీకాలం రెండేళ్లు ఉండేలా ఏర్పాటుచేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ.. ఇప్పుడు పాలక మండలిని నియమించడంలో ఆనవాయితీని చంద్రబాబు పక్కన పెట్టారు. కేవలం ఏడాదికి మాత్రమే టీటీడీ పాలక మండలిని నియమించాలని నిర్ణయించారు. బోర్డు చైర్మన్‌గా చదలవాడను ఖరారు చేసిన నేపథ్యంలో.. జిల్లాలో టీడీపీ నేతలకు అందులో చోటు ఇవ్వకూడదని చంద్రబాబు నిశ్చయించారు. జిల్లా నుంచి బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డికి మాత్రమే టీటీడీ బోర్డులో చోటు కల్పించారు. సినీ దర్శకుడు కే.రాఘవేంద్రరావు, సీఎం రవిశంకర్, కర్ణాటకకు చెందిన అనంత్, ఎమ్మెల్యేలు నారాయణస్వామినాయుడు, ఆకుల సత్యనారాయణ, బండారు సత్యనారాయణమూర్తి, తెలంగాణ, తమిళనాడుల నుంచి ఒక్కొక్కరికి బోర్డులో అవకాశం కల్పించాలని నిర్ణయించారు. టీటీడీ పాలక మండలి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు అక్టోబర్ మొదటివారంలో మంత్రివర్గ సమావేశం పూర్తయిన తర్వాత వెలువడే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.