వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన వర్షాలు.. నీటి ఎద్దడితో అల్లాడుతున్న తిరుమలకు స్వాంతన నిచ్చాయి. తిరుమలలోని జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. మంగళవారం ఆకాశగంగ, గోగర్భం డ్యాములు పొంగి పొర్లాయి. పాపవినాశనం, కుమారధార, పసుపుధార ప్రాజెక్టుల్లో 70శాతం నీరు చేరింది. ఈ వర్షాల పుణ్యమా అని ఏడాదికి సరిపడా తాగునీరు చేరింది.
శ్రీవారి దర్శనం కోసం రోజూ 70 వేల మంది భక్తులు వస్తుంటారు. వీరి అవసరాలతోపాటు ఆలయం, నిత్యాన్న ప్రసాదం కోసం 32 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతోంది. ప్రస్తుతం ఐదు జలాశయాల్లో చేరిన నీరు ఏడాదికి సరిపోతుందని టీటీడీ ఇంజినీర్లు చెబుతున్నారు. ఇక తిరుపతి కల్యాణీ డ్యాంలోనూ 35 శాతం నీరు చేరింది. దాంతో పాటు తెలుగుగంగ నీరు రోజూ 7 నుంచి 8 ఎంఎల్‌డీలు అందుతోంది.
అవసరాన్ని బట్టి వినియోగించుకుంటే ఏడాదిన్నర కాలానికి ఎలాంటి ఢోకా లేదని ఇంజినీర్ల అభిప్రాయం. కాగా, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు మంగళవారం జలాశయాలను సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు.