తిరుమల: తిరుమలలో అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో మృతిచెందిన బాలిక ఘటనపై టీటీడీ అప్రమత్తమైంది. ఈ క్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి శనివారం అత్యవసర సమావేవేశాన్ని ఏర్పాటు చేశారు. అటవీశాఖ, విజిలెన్స్ అధికారులతో సమావేశమయ్యారు. తిరుమల నడకమార్గంలో భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు చిరుత దాడి విషయం తెలిసి హైదరాబాద్ నుంచి హుటాహుటిన తిరుమలకు బయలుదేరారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
చిన్నారిపై దాడి బాధాకరం: ఈవో
తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి బాధాకరమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. అలిపిరిలో చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలిపిరి నడకమార్గం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేతపై ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. నడక దారిలో ప్రతి 40 అడగులకు సెక్యూరిటీ ఉండే చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమలకు చిన్న పిల్లలతో వచ్చే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు
నడక దారిలో ఫారెస్ట్, పోలీస్, టీటీడీ కలిసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని ధర్మారెడ్డి అన్నారు. అలిపిరి నడక మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చిరుత దాటి ఘటనపై సీసీఎఫ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయించాని తెలిపారు. ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటలకు బైక్స్ నిలిపి వేయాలని సూచనలు వచ్చాయని.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటాని పేర్కొన్నారు.
చదవండి: ఇదేం చిత్రం చంద్రబాబూ.. ఇదే కదా నీ కొంపముంచేది?
దాడి చేసింది చిరుతనా లేదా ఎలుగబంటినా?
బాలికపై చిరుత దాడికి పాల్పడిన ఘటనా స్థలాన్ని సీసీఎఫ్ నాగేశ్వర రావు, డీఎఫ్‌ఓ సతీష్ కుమార్ పరిశీలించారు. దాడి చేసింది చిరుతా లేక ఎలు బంటా అన్నది పోస్టుమార్టం రిపోర్టు వస్తే నిర్ధారణ అవుతుందని తెలిపారు. దాడి చేసిన జంతువును బంధించేందుకు బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎలుగుబంటి అయితే మత్తు ద్వారా బంధిస్తామని, చిరుత అయితే బోన్ ద్వారా బంధిస్తామని చెప్పారు. జంతువుల కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తామని తెలిపారు. 7వ మైలు రాయి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్‌గా ప్రకటిస్తున్నామని అన్నారు.
కాగా తిరుమలలోని అలిపిరి కాలి బాటలో ఆరేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం చెందిన దినేష్ కుమార్, శశికళ కుమార్తె లక్షిత శుక్రవారం సాయంత్రం అలిపిరి కాలిబాటలో కనిపించకుండా పోయింది. చిరుత దాడిని గుర్తించని తల్లిదండ్రులు.. నడకదారిలో చిన్నారి కోసం వెతగ్గా దొరకలేదు.
నిన్న రాత్రి పోలీసులకు లక్షిత తప్పిపోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. రాత్రి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చే పట్టారు. శనివారం ఉదయం నడక దారిలో లక్షిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి..ఈ ఘటనపైకేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవ్వగా.. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment