చదలవాడకే పట్టం ! | Chadalavada Krishnamurthy to be New TTD chairman! | Sakshi
Sakshi News home page

చదలవాడకే పట్టం !

Published Mon, Sep 29 2014 8:38 AM | Last Updated on Tue, Aug 28 2018 5:43 PM

చదలవాడకే పట్టం ! - Sakshi

చదలవాడకే పట్టం !

 * టీటీడీ పాలక మండలినియామకంపై సీఎం చంద్రబాబు కసరత్తు పూర్తి
* ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు బోర్డు చైర్మన్‌గా ఎంపిక
 * బోర్డులో జిల్లా నుంచి బీజేపీ నేత జీ.భానుప్రకాష్‌రెడ్డికి అవకాశం

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి నియామకంపై సీఎం చంద్రబాబు కసరత్తును పూర్తిచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని బోర్డు చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించారు. బోర్డు సభ్యులుగా సినీ దర్శకుడు కే.రాఘవేంద్రరావు, సీఎం రవిశంకర్, ఎమ్మెల్యేలు నారాయణస్వామినాయుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఆకుల సత్యనారాయణ, జిల్లాకు చెందిన బీజేపీ నేత జీ.భానుప్రకాష్‌రెడ్డి, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరిని సభ్యులుగా నియమించనున్నారు.

ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు అక్టోబర్ మొదటి వారంలో వెలువడే అకాశం ఉందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. టీటీడీ చైర్మన్‌గా పదవీ కాలం పూర్తయ్యే వరకూ కుర్చీ దిగేది లేదని భీష్మించిన కనుమూరి బాపిరాజును ఆర్డినెన్స్ ద్వారా ఆగస్టు 14న ప్రభుత్వం పదవీచ్యుతుడిని చేసింది. ఆ తర్వాత రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి జగదీష్‌చంద్ర శర్మ అధ్యక్షతన స్పెసిఫైడ్ అథారిటీని నియమించింది. టీటీడీకి పాలక మండలి నియమించాలని టీడీపీ వర్గాల నుంచి తీవ్రస్థాయిలో వచ్చిన ఒత్తిళ్లకు చంద్రబాబు తలొగ్గారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని ఎరగావేసి నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చంద్రబాబు టీడీపీ తీర్థం ఇచ్చారు.

ఎన్నికల్లో తిరుపతి శాసనసభ స్థానం అభ్యర్థిత్వాన్ని ఆశించిన చదలవాడ కృష్ణమూర్తిని టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని ఇస్తానని హామీ ఇచ్చి సంతృప్తిపరిచారు. ఆ మేరకు చదలవాడకు చంద్రబాబు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్న రాయపాటికి చెందిన సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా రూ.200 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా అప్పగించిన చంద్రబాబు.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి నుంచి ఆయనను తప్పుకునేలా చేశారు.

ఇదే సమయంలోనే టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోసం చదలవాడ కృష్ణమూర్తి, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు పోటీపడ్డారు. గాలికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వొద్దని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. చదలవాడకు బోర్డు చైర్మన్ పదవి ఇవ్వకూడదని సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే వెంకటరమణ ఒత్తిడి తెచ్చారు. ఇదే అంశంపై బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ద్వారా సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. మాజీ మంత్రి గాలికి ఎమ్మెల్సీ పదవి ఇస్తాననే ఆశ చూపి.. టీటీడీ బోర్డు చైర్మన్ రేసు నుంచి ఆయన తప్పుకునేలా చేయడంలో చంద్రబాబు సఫలీకృతులయ్యారు.

తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో చదలవాడకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీని నిలుపుకోలేకపోతే.. ఎన్నికల్లో ఆయన వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందని చంద్రబాబు భావించారు. ఆ క్రమంలోనే తన అస్మదీయుడు మాగంటి మురళీమోహన్‌కు ఇవ్వాలనుకున్న టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని చదలవాడకు కట్టబెట్టాలని నిర్ణయించారు. సాధారణంగా టీటీడీ పాలక మండలి పదవీకాలం రెండేళ్లు ఉండేలా ఏర్పాటుచేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ.. ఇప్పుడు పాలక మండలిని నియమించడంలో ఆనవాయితీని చంద్రబాబు పక్కన పెట్టారు. కేవలం ఏడాదికి మాత్రమే టీటీడీ పాలక మండలిని నియమించాలని నిర్ణయించారు.
 
బోర్డు చైర్మన్‌గా చదలవాడను ఖరారు చేసిన నేపథ్యంలో.. జిల్లాలో టీడీపీ నేతలకు అందులో చోటు ఇవ్వకూడదని చంద్రబాబు నిశ్చయించారు. జిల్లా నుంచి బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డికి మాత్రమే టీటీడీ బోర్డులో చోటు కల్పించారు. సినీ దర్శకుడు కే.రాఘవేంద్రరావు, సీఎం రవిశంకర్, కర్ణాటకకు చెందిన అనంత్, ఎమ్మెల్యేలు నారాయణస్వామినాయుడు, ఆకుల సత్యనారాయణ, బండారు సత్యనారాయణమూర్తి, తెలంగాణ, తమిళనాడుల నుంచి ఒక్కొక్కరికి బోర్డులో అవకాశం కల్పించాలని నిర్ణయించారు. టీటీడీ పాలక మండలి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు అక్టోబర్ మొదటివారంలో మంత్రివర్గ సమావేశం పూర్తయిన తర్వాత వెలువడే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement