రేసులో నిలిచిన చదలవాడ..
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఏర్పాటకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోర్డు ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. వారం రోజుల్లో కొత్త పాలకమండలి ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోనున్నారు. చైర్మన్, 18మంది సభ్యులతో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే పాలకమండలి పదవీకాలాన్ని ఏడాదికి కుదించినట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు టీటీడీ చైర్మన్గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి పేరు ఖరారు అయినట్లు సమాచారం. ఇక పాలకమండలి సభ్యులుగా సినీ దర్శకుడు కే.రాఘవేంద్రరావు, సీఎం రవిశంకర్, ఎమ్మెల్యేలు నారాయణస్వామి నాయుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఆకుల సత్యనారాయణ, జిల్లాకు చెందిన బీజేపీ నేత జీ.భానుప్రకాష్‌రెడ్డి, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరిని సభ్యులుగా నియమించనున్నారు. అలాగే బోర్డు సభ్యులుగా తెలంగాణ టీడీపీ నేతలకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు తెలుస్తోంది. సండ్ర వెంకట వీరయ్య, సాయన్న, మేడ ప్రతాప్ రెడ్డికి చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి.